ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jain Philosophy: దేవునికైనా అసాధ్యమే

ABN, Publish Date - Sep 05 , 2025 | 01:24 AM

చీవర్ధమాన మహావీరుడు అహింసా మూర్తి. ఆయన ప్రభావం పశుపక్షాదుల మీద కూడా ఉండేది. ఆయన వెళ్ళిన ప్రాంతంలో...

చీవర్ధమాన మహావీరుడు అహింసా మూర్తి. ఆయన ప్రభావం పశుపక్షాదుల మీద కూడా ఉండేది. ఆయన వెళ్ళిన ప్రాంతంలో పరిసరాల్లో ప్రశాంతత ఏర్పడేది. నదుల్లో నీరు తాగడానికి వచ్చిన పులులు, సింహాలు, గోవులు, జింకలు పక్కపక్కనే సంచరించేవి. మహావీరుడి సామీప్యం క్రూర జంతువులను సైతం సాధుజంతువులుగా మార్చేది . జంతువులు, జనులు అక్కడ నిర్భయంగా సంచరించగలిగేవారు.

విచిత్రం ఏమిటంటే... ఎంతటి మహనీయులైనా ఎన్నో ఏళ్ళుగా తమ చుట్టూ ఉన్న కొందరిలో ఏర్పడిన అసూయా ద్వేషాలను, కామ క్రోధాలను రూపు మాపలేరు. వారిలో ఆశలను, కోరికలను నిర్మూలించలేరు. మహావీరుడి చరిత్రలోనూ ఇలాంటి ఉదంతం కనిపిస్తుంది. ఆయనకు జమాలి అనే అల్లుడు ఉండేవాడు. జమాలి ఆయన శిష్యుడు కూడా. మహావీరుడి వారసుడయ్యే హక్కు తనకే ఉందని జమాలి భావించేవాడు. మహావీరుడికి ఎందరో శిష్యులు ఉండేవారు. వారిలో రాజులు కూడా ఉన్నారు. కాబట్టి మహావీరుడి ఆధ్యాత్మిక సామ్రాజ్యం ఎంతో విశాలమైనది. మహావీరుడి తరువాత ఆయన శిష్యులందరికీ తనే నాయకుడు కావాలనే కాంక్ష జమాలిలో ఉండేది. మహావీరుడి అంతిమ దినాల్లో చాలాసార్లు తనను తదుపరి తీర్థంకరుడిగా, వారసుడిగా ప్రకటించాలని ఆయనను ఒత్తిడి చేశాడు. కానీ మహావీరుడు అందుకు సమ్మతించలేదు. ‘‘అది వీలు కాదు. ప్రస్తుత సృష్టిలో నేనే చివరి తీర్థంకరుణ్ణి. రాబోయే సృష్టిలో తీర్థంకరుడు అయ్యే యోగ్యత, అర్హత (మహావీరుడి ముఖ్య శిష్యుడు) గౌతమ గణధరుడికి ఉంది. కాబట్టి నువ్వు నా అల్లుడివి, శిష్యుడివి అయినా నిన్ను నేను నా వారసుడిగా ప్రకటించలేను’’ అని మహావీరుడు నిష్కర్షగా చెప్పాడు. జమాలి దీన్ని అవమానంగా భావించాడు. మహావీరుడి శిష్యుల్లో చీలికలు తెచ్చాడు. అయిదువందలమంది శిష్యులతో బయటకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత మహావీరుణ్ణి నిందలపాలు చేశాడు.

క్రూర జంతువులను, ఎందరో వ్యక్తులను మార్చగలిగిన మహావీరుడు తన అల్లుణ్ణి, శిష్యుణ్ణి ఎందుకు మార్చలేక పోయాడు? ఎందుకంటే మనం పరివర్తన చెందడానికి సిద్ధంగా లేకపోతే... ఏ మహనీయుడూ మనల్ని ఉద్ధరించడు. అది దేవుడికి కూడా సాధ్యం కాదు. అందుకే ‘‘నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి’’ అంటాడు ‘భగవద్గీత’లో శ్రీకృష్ణ పరమాత్మ.

-రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - Sep 05 , 2025 | 01:24 AM