Divya Deshmukh: ఆ ఆనందమే శాశ్వతం
ABN, Publish Date - Jun 23 , 2025 | 05:52 AM
ఆలోచించాల్సింది ప్రత్యర్థి ఎవరనేది కాదు, ఆటలో ఎలా గెలవాలనే దాని గురించి... ఇది దివ్య దేశ్‌ముఖ్ అనుసరించే విజయ సూత్రం. మహరాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన ఈ పంతొమ్మిదేళ్ళ చదరంగ తార...
దివ్యా దేశ్‌ముఖ్... ఇప్పుడు క్రీడాభిమానుల్లో మారుమోగుతున్న పేరు. ఈ మధ్య జరిగిన ‘వరల్డ్ బ్లిడ్జ్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్’లో వరల్డ్ నెంబర్-1 హౌ యిఫాన్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. చదరంగంలో భారత భవిష్యత్ ఆశాకిరణంగా ప్రశంసలు పొందుతున్న దివ్య... మహిళా క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గళమెత్తడంలోనూ ముందుంటుంది.
‘ఆలోచించాల్సింది ప్రత్యర్థి ఎవరనేది కాదు, ఆటలో ఎలా గెలవాలనే దాని గురించి’... ఇది దివ్య దేశ్‌ముఖ్ అనుసరించే విజయ సూత్రం. మహరాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన ఈ పంతొమ్మిదేళ్ళ చదరంగ తార... ఘనమైన విజయాలతో కొన్నేళ్ళుగా వార్తల్లోకి నిలుస్తోంది. అయితే మొదట్లో చదరంగం ఆడడం అంటే చిరాగ్గా ఉండేదంటుంది దివ్య. ఆమె తండ్రి జితేంద్ర నాగపూర్ వైద్య కళాశాలలో ప్రొఫెసర్. తల్లి కూడా వైద్యురాలు. ఇద్దరికీ క్రీడలంటే ఇష్టం. దివ్యను, ఆమె అక్కను టెన్నిస్ శిక్షణకు పంపారు. ‘‘అక్క కోర్టులో చురుగ్గా ఉండేది. నాకేమో బంతిని గట్టిగా కొట్టేంత శక్తి లేదు. దాంతో నేను అక్కతో కలిసి వెళ్ళనని ఇంట్లో చెప్పేశాను’’ అని చెబుతుంది దివ్య. అయితే అయిదేళ్ళ వయసులో ఇంట్లోనే ఆమెకు చదరంగం పరిచయం అయింది. ఇప్పుడు అదే తన లోకమైపోయింది.
ఓటమిని ఒప్పుకోను...
‘‘నేను నాన్న కూచిని. నాన్నకు చదరంగం అంటే చాలా ఇష్టం. రాత్రి ఇంటికి వచ్చాక... కాసేపు చదరంగం ఆడేవారు. ఆయననే అంటి పెట్టుకొని ఉండేదాన్ని. మెల్లగా నాకు ఆయన ఆట నేర్పారు. మొదట్లో దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆట కోసం ఇంత ఆలోచించడం అవసరమా? అనిపించేది. కానీ నాది చిన్నప్పటి నుంచీ ఓటమిని ఒప్పుకొనే మనస్తత్వం కాదు. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆడేదాన్ని’’ అని గుర్తు చేసుకుంటుంది దివ్య. చదరంగంలో ఆమె నైపుణ్యాన్ని గమనించి, ప్రసిద్ధ కోచ్ రాహుల్ జోషీ దగ్గర శిక్షణ కోసం చేర్పించారు దివ్య తల్లితండ్రులు. ఆ శిక్షణతో ఆమె ప్రతిభ మరింత మెరుగుపడింది. 2011-12లో అండర్-7 బాలికల విభాగంలో... జాతీయ స్థాయిలో స్వర్ణపతకంతో తన జైత్రయాత్రను ప్రారంభించింది. ఆ తరువాత అండర్-9 విభాగంలో జాతీయ ఛాంపియన్‌గా, అండర్-10 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2021లో... పదహారేళ్ళకే భారతదేశంలో 21వ మహిళా చెస్ గ్రాండ్ మాస్టర్ హోదాను సాధించింది. 2023లో ఇంటర్నేషనల్ మాస్టర్‌గా గుర్తింపు పొందిన దివ్య ఖాతాలో మూడు ఒలింపియాడ్ స్వర్ణాలతో సహా నలభైకి పైగా పతకాలున్నాయి. 2023లో... జరిగిన ‘ఆసియా ఉమెన్ చెస్ ఛాంపియన్‌షిప్’లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక లాంటి మహిళా చెస్ దిగ్గజాలను ఓడించిన ఆమె... ఆ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచింది. కిందటి ఏడాది... ‘వరల్డ్ జూనియర్ గర్ల్స్ ఛాంపియన్’ టైటిల్ గెలుచుకుంది. మన దేశం నుంచి ఈ ఘనత సాధించిన నాలుగో మహిళగా చరిత్రకెక్కింది. అంతేకాదు... ఈ టైటిల్‌ను భారత్‌కు పదిహేనేళ్ళ తరువాత సంపాదించి పెట్టింది. ‘స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు కూడా అందుకుంది. వ్యక్తిగతంగానే కాదు, భారత చదరంగం జట్టు విజయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
అవి ప్రాతిపదికలు కాకూడదు...
టోర్నమెంట్స్‌లో ప్రశాంతంగా కనిపించే దివ్య కిందటి ఏడాది జనవరి చివర్లో అనూహ్యమైన కారణంతో వార్తల్లోకి ఎక్కింది. నెదర్లాండ్స్‌లో జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో తనకు ఎదురైన అనుభవాలపై ఇన్‌స్టాగ్రామ్‌లో అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఒక విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ టోర్నమెంట్ ముగిసేవరకూ ఆగాలని నిర్ణయించు కున్నాను. ఇది క్రీడాకారిణుల విషయంలో కొందరు వ్యవహరించే తీరు గురించి. వాళ్ళు ఆటలో నా ప్రదర్శన కన్నా... నా దుస్తులు, నా భాషలోని యాస, నా కురులు, నా స్టైల్ ఇలాంటి అనవసరమైన విషయాల మీదనే దృష్టి పెట్టడం, అనుచితమైన వ్యాఖ్యలతో వేధించడం బాధగా అనిపించింది. క్రీడాకారిణుల మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి ఇవి ప్రాతిపదికలు కావడం దురదృష్టకరం’’ అంటూ ధ్వజమెత్తింది. దివ్య వ్యాఖ్యలు క్రీడా ప్రపంచంలో సంచలనం సృష్టించాయి. ఎంతో కాలంగా జరుగుతున్న దాని మీద ఆమె నిర్భయంగా తన గళాన్ని వినిపించిందంటూ కొందరు క్రీడాకారిణులు దివ్యకు మద్దతుగా నిలిచారు. అదే సమయంలో మామూలు విషయాలపై రచ్చ చేస్తోందనే విమర్శలూ వచ్చాయి. ‘‘ఎంతో ఆవేదనతోనే ఆ మాటలు అన్నాను. భరించేవాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. ఇది చాలామంది క్రీడాకారిణులు ఎదుర్కొన్న పరిస్థితే’’ అంటున్న దివ్య... ఇలాంటి అంశాలేవీ ఆట మీద తన ఏకాగ్రతను దెబ్బతీయవని చెబుతోంది.
వారి అండతోనే...
తాజాగా ‘వరల్డ్ బ్లిడ్జ్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్’లో వరల్డ్ నెంబర్-1 హౌ యిఫాన్‌పై ఆమె సాధించిన గెలుపు సర్వత్రా ప్రశంసలు అందుకుంది. ‘‘వ్యక్తిగతంగానే కాదు, ఒక సభ్యురాలుగా జట్టు విజయానికి దోహదపడడం సంతోషంగా ఉంది. నా తల్లితండ్రులు, నా జట్టు సభ్యులు నాకు ఎప్పుడూ అండగా నిలుస్తున్నారు. నా పురోగతిలో వారి సహకారం ఎంతో ఉంది’’ అంటున్న దివ్య ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. ఫుట్‌బాల్, వాకింగ్, సైక్లింగ్, ట్రెక్కింగ్ అంటే ఇష్టం. ‘‘క్రీడాకారిణిగా ఎప్పటికప్పుడు నా లక్ష్యాలు మారుతూ ఉంటాయి. కానీ ఆటలో నేను పొందే ఆనందం మాత్రం శాశ్వతం. దాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదిస్తాను’’ అంటోంది దివ్య.
Updated Date - Jun 23 , 2025 | 05:54 AM