Ancient Wisdom: పదాలు వేరు... అర్థాలూ వేరు
ABN, Publish Date - Sep 05 , 2025 | 01:29 AM
ఉపాధ్యాయుడు, గురువు, ఆచార్యుడు అనే మూడు విశిష్టమైన పదాలను ఇప్పుడు పర్యాయ పదాలుగా ఒకే స్థాయి బరువు ఉండే మాటలుగా వాడేస్తున్నారు. క్రమక్రమంగా లోకంలో ఆ పదాలు సమానార్థకాలు అయిపోయాయి. అది సరి కాదు...
ఉపాధ్యాయుడు, గురువు, ఆచార్యుడు అనే మూడు విశిష్టమైన పదాలను ఇప్పుడు పర్యాయ పదాలుగా (ఒకే స్థాయి బరువు ఉండే మాటలుగా) వాడేస్తున్నారు. క్రమక్రమంగా లోకంలో ఆ పదాలు సమానార్థకాలు అయిపోయాయి. అది సరి కాదు.
శిష్యుణ్ణి ఎంచుకొనేవాడు ఉపాధ్యాయుడు
‘ఉప’... తన సమీపానికి రప్పించుకొని, ‘అధ్యాయః’ చదువు చెప్పేవాడు (ఉప సమీపమేత్య అధ్యాపయతి) ఉపాధ్యాయుడు. క్రమశిక్షణతో కనిపిస్తున్న పిల్లవాణ్ణి ఇతను నాకు ‘విద్యా+అర్థి’గా కనిపిస్తున్నాడు కాబట్టి చదువు చెబుతానని ఎంచుకొనేవాడు ఉపాధ్యాయుడు. ఆ ‘విద్యా+అర్థి’ని (కేవలం చదువు కోసమే తనను ఆశ్రయించినవాణ్ణి) తన ఇంటనే ఉంచుకొని బోధిస్తూ ఉండేవాడు. కాబట్టే విద్యార్థికి ‘అంతేవాసి’ (తన దగ్గరే ఉండేవాడు), ‘ఛాత్రుడు’ (గురువు ఏదో పొరుగు ఊరు నుంచి ఆలస్యంగా వచ్చి, ఆ రోజు అనుష్ఠానాన్ని పూర్తిగా చేయ(లే)ని పక్షంలో... ఆ దోషాన్ని పదిమందికీ చాటింపు వేయకుండా... (ఛత్రం తచ్ఛీలమస్యేతి ఛాత్రః) ‘ఛత్రం’ అంటే గొడుగులా దాచిపెట్టేవాడు) అనే పేర్లు వచ్చాయి. ద్వాపర యుగంలో ఎవరు విద్యా బోధకులో వారికి ‘ఆచార్యుడు’ అనే వృత్తిపరమైన పేరు ఉండేది. ఇప్పటికీ ఆ పద్ధతి అక్కడక్కడా కనిపిస్తుంది. దాంతో కురు, పాండు పుత్రులకు ధనుర్విద్య నేర్పే ఉపాధ్యాయుడు ‘కృప-ఆచార్యుడు’ అయ్యాడు.
శిష్యుడు ఎంపిక చేసుకొనేవాడు గురువు
కురు, పాండు పుత్రులు బంతి ఆట ఆడుకుంటూ ఉంటే... ఆ బంతి కాస్తా ఒక పాడుపడిన నూతిలో పడింది. వారందరూ ఏమీ తోచక తెల్లముఖాలతో ఆ నూతి చుట్టూ తిరుగుతున్నారు. అప్పటికి ఇంకా ఉపాధ్యాయుడు కాని, ఆచార్య పదవీ లేని ద్రోణుడు ఆ మార్గంలో వెళుతూ వారి పరిస్థితిని గమనించాడు. వారి ప్రార్థన విని... తన భుజాన ఉన్న వింటిని తీసి, నూతిలో ఉన్న బంతిని ఒక బాణంతో కొట్టాడు. సాధారణంగా బాణం తగలగానే బంతి గుండ్రంగా తిరగడమే కాకుండా పక్కకు పడిపోతుంది. అయితే ద్రోణుడు ఒక ప్రత్యేకమైన బాణాన్ని (ఇషువు) తీసుకొని, ఆ బంతిని కొట్టి, ఆ బాణానికి చివర ఉన్న చిన్న రంధ్రంలోకి మరొక బాణాన్ని కొట్టాడు. అలా ఆ రెండు పక్కకు ఒరిగిపోకుండా మరో బాణం చొప్పున కొడుతూ... ఆ బాణాల వరుసను ఒక తాడులా చేసి సునాయాసంగా బంతిని పైకి తీశాడు. దాన్ని కురు, పాండు పుత్రులకు ఇచ్చాడు. చిత్రమేమిటంటే... అద్భుతమైన ఈ ధనుర్విద్యా కౌశలాన్ని అందరూ గమనించలేకపోయారు. బంతి వచ్చిందనే ఆనందంతో వెళ్ళిపోయారు. అర్జునుడు మాత్రం ద్రోణుడి నైపుణ్యాన్ని గమనించి, ఆయననే గురువుగా ఎంచుకున్నాడు. అర్జునుడి అదృష్టం ఎంత గొప్పదంటే... ఈ సంఘటనను సౌధం పై నుంచి చూస్తున్న భీష్ముడికి చెప్పలేనంత ఆనందం కలిగింది. మరుక్షణంలోనే ద్రోణుణ్ణి తన క్షత్రియ విద్యా పాఠశాలలో ధనురాచార్యుడిగా నియమించాడు. దీనితో అయస్కాంతానికి ఇనుప ముక్కలా ద్రోణుడికి అర్జునుడు మరింతగా అతుక్కుపోయాడు.
గురువు లేని నేనెందుకు?
ద్రోణుడి విషయంలో దుర్యోధనుడు నిరంతరం ద్వేషభావంతో ఉండేవాడు. తమ కౌరవులకన్నా పాండు పుత్రులకు మరింత శ్రద్ధగా ఆయన చదువు చెబుతున్నాడేమో? అనే సందేహమే దీనికి కారణం. అర్జునుడు తనకు బాగా దగ్గరయ్యాడనే సంగతి ద్రోణుడికి అర్థమయినా... అతణ్ణి పరీక్షించాలనుకున్నాడు. తన శిష్యులందరితో తాను నిత్యం స్నానం చేసే తటాకం దగ్గరకు వెళ్ళాడు. స్నానం చేస్తూ ‘‘మొసలి! మొసలి!’’ అంటూ గట్టిగా అరిచాడు. ఆ మొసలి మనల్ని కూడా తినేస్తుందనో, వేరే సంశయాలతోనో గురువును రక్షించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. కానీ గురువు అరుపు విన్న వెంటనే అర్జునుడు ఆ చెరువులోకి దూకాడు. తరువాత అదంతా గురువు ఆడిన నాటకం అని గ్రహించి పరమానందపడ్డాడు. ఒడ్డుకు చేరిన తరువాత ‘‘అర్జునా! అక్కడ మొసలే గనుక ఉండి, నాతో పాటు నిన్నుకూడా తినేసినట్టయితే?’’ అన్నాడు ద్రోణుడు. అర్జునుడు దానికి బదులిస్తూ ‘‘అయ్యా! మీరంటూ లేకపోయిన తరువాత ఈ ధనస్సు, బాణాలు, వాటిని ధరించిన నేను ఉండడం ఎందుకు?’’ అని బదులిచ్చాడు. దాంతో ఆ గురుశిష్యానుబంధం పాలు-నీరులా కలిసిపోయింది. ఇదీ గురు విధానం అంటే. ఏవో సిఫార్సులతోనో, బెదిరింపులతోనో ఉపాధ్యాయులను నియమించే విధానం ఉంటే విద్యా వ్యవస్థ దెబ్బతిని తీరుతుంది. ఆ మర్మాన్ని ఎరిగినవాడు కాబట్టే ద్రోణుణ్ణి భీష్ముడు ఆచార్యునిగా నియమించడం ఒక విశేషం కాగా, చక్కని పాండిత్యం ఉన్నా తగిన ఉద్యోగావకాశం లేకపోవడం అనేది ద్వాపర యుగం నుంచీ ఉన్నదనేది మరో విశేషం. అలాగే ఒక సంస్థకు అధిపతిగా ఎవరుంటారో వారి సంతానానికి (ఇక్కడ కౌరవులకు) అహంకారం కారణంగా సరైన చదువు అబ్బదనేది, మాయోపాయాలతో గెలుపు సాధించే పద్ధతే అలవడుతుందనేది, వారు గురునిందకు వెనుకాడరనేది గమనించాల్సిన ఇంకో విశేషం. అందుకే సుయోధనుడు చక్కని యుద్ధ విద్య తెలిసినవాడే అయినా చివరకు దుర్-యోధనుడే అయ్యాడు.
అనేక గురు సమూహం... ఆచార్యుడు
‘కృష్ణం వందే జగద్గురుమ్’ అని పరమాత్మను స్తుతిస్తారు. అంటే ద్రోణుడిలా పాఠ ప్రవచనాన్ని చేసేవాడని కాదు. కృష్ణుడు యుద్ధ విద్యలో నిపుణుడు. అందుకే నరకాసుర వధను స్వయంగా చేయగలిగాడు. సత్యభామకు కూడా యుద్ధ విద్య తెలుసుననే విషయాన్ని లోకానికి తెలియజెప్పడం కోసం ఓడినట్టు తాత్కాలికంగా నటించాడు తప్ప... నరకాసుర వధ చేసినది ఆయనే. అంతేకాదు.. ప్రతి క్షణమూ పాండవులకు అండగా ఉంటూ, ఎన్నెన్నో ఉపద్రవాల నుంచి వారిని బయటపడేశాడు. యుద్ధ, రాజనీతి, ధర్మ, వేదాంతశాస్త్రాది అనేక విషయాల్లో శిఖరాగ్ర పాండిత్యం ఉన్న ఆయన... గీతను ఉపదేశించి ‘గీతాచార్యుడు’ అయ్యాడు. అలాగే భీష్ముడు కూడా కేవలం ధనుర్విద్యనే కాకుండా రాజపరిపాలన, పూర్వ రాజుల చరిత్ర అధ్యయనం చేశాడు. తన వంశం నిర్వంశం అవుతున్న దశలో వ్యాసుణ్ణి ప్రార్థించి, వంశాన్ని నిలబెట్టేలా చేయగలిగాడు. యౌవన గర్వంతో తాను చేసిన మూడు తప్పులకు తనకుతానే అంపశయ్య శిక్ష విధించుకున్నాడు. ధర్మశాస్త్ర పాండిత్యం కూడా కలిగి ‘భీష్మాచార్యుడు’ అనిపించుకోగలిగాడు. ద్రోణుడు కూడా భీష్ముడికి దగ్గరై, ఆయన దగ్గర రాజ్య తంత్రాలన్నీ తెలుసుకొని, సర్వ శాస్త్ర పాండిత్యాన్ని సంపాదించిన కారణంగా ‘ద్రోణాచార్యుడు’ అనే పిలుపును అందుకున్నాడు. ఇలా ఉపాధ్యాయుడు, గురువు, ఆచార్యుడు అనే పదాలకు విస్తృతమైన వేర్వేరు అర్థాలు, ప్రత్యేకతలు ఉన్నాయి.
-డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు
(నేడు ఉపాధ్యాయ దినోత్సవం)
Updated Date - Sep 05 , 2025 | 01:31 AM