Moong Dal Recipes: పెసలతోపసందుగా...
ABN, Publish Date - Jul 26 , 2025 | 12:29 AM
జీడి పప్పు, బాదం పప్పులను చిన్న పలుకుల్లా కోసి పెట్టుకోవాలి.
పెసర లడ్డూ
కావాల్సిన పదార్థాలు
పెసలు- ఒక కప్పు, నెయ్యి- నాలుగు చెంచాలు, జీడి పప్పులు- ఆరు, బాదం పప్పులు- ఆరు, యాలకులు- రెండు, బెల్లం ముక్కలు- ఒక కప్పు, నీళ్లు- తగినన్ని
తయారీ విధానం
జీడి పప్పు, బాదం పప్పులను చిన్న పలుకుల్లా కోసి పెట్టుకోవాలి.
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టాలి. అందులో పెసలు వేసి చిన్న మంట మీద పది నిమిషాలపాటు దోరగా వేపాలి. పెసలు, కొద్దిగా రంగు మారి మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ మీద నుంచి దించి చల్లార్చాలి. తరవాత మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని ఒక పళ్లెంలోకి తీసుకోవాలి.
స్టవ్ మీద గిన్నెపెట్టి మూడు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. అందులో జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు వేసి దోరగా వేపాలి. తరవాత పెసర పొడి వేసి కలపాలి. చిన్న మంట మీద రెండు నిమిషాలు వేపాలి. తరవాత యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఈ పెసర పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లార్చాలి.
స్టవ్ మీద మరో గిన్నె పెట్టి, బెల్లం ముక్కలు వేసి రెండు చెంచాల నీళ్లు చిలకరించాలి. బెల్లం మొత్తం నీళ్లలో కరిగాక పెసర పొడి ఉన్న గిన్నెలోకి వడబోయాలి. పెసర పొడికి బెల్లం పూర్తిగా పట్టేలా కలపాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక చెంచా నెయ్యి వేసి బాగా కలపాలి. దీన్ని కొద్ది కొద్దిగా చేత్తో తీసుకుంటూ లడ్డూలు చుట్టాలి. ఈ పెసర లడ్డూలను పిల్లలు ఇష్టంగా తింటారు.
చిట్కాలు
పెసలను సన్నని సెగమీద నెమ్మదిగా వేయిస్తే లడ్డూలకు కమ్మని రుచి వస్తుంది. పెసలు సరిగా వేగకపోతే లడ్డూలు చేదుగా అనిపిస్తాయి.
లడ్డూలు చుట్టేముందు కావాలనుకుంటే ఖర్జూరం ముక్కలు, కిస్‌మిస్‌లు, గుమ్మడి గింజలు వేసుకోవచ్చు.
ఈ లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో భద్రపరిస్తే రెండు వారాల పాటు నిల్వ ఉంటాయి.
పెసల మఖనీ
కావాల్సిన పదార్థాలు
నానబెట్టిన పెసలు- ఒక కప్పు, దాల్చిన చెక్క- చిన్న ముక్క, లవంగాలు- రెండు, యాలకులు- రెండు, పసుపు- అర చెంచా, ఉప్పు- తగినంత, నెయ్యి- ఆరు చెంచాలు, జీలకర్ర- అర చెంచా, ఇంగువ- పావు చెంచా, ఎండు మిర్చి- రెండు, వెల్లుల్లి రెబ్బలు- అయిదు, ఉల్లిపాయలు- రెండు, టమాటాలు- రెండు, పచ్చిమిర్చి- రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, గరం మసాలా పొడి- అర చెంచా, మిరియాల పొడి- అర చెంచా, కసూరి మేతి- అర చెంచా, కారం- ఒకటిన్నర చెంచాలు, వేడినీళ్లు- ఆరు కప్పులు, కొత్తిమీర- కొద్దిగాతయారీ విధానం
పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నానబెట్టిన పెసలు, అర చెంచా ఉప్పు, పావు చెంచా పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి నాలుగు కప్పుల వేడి నీళ్లు పోయాలి. కుక్కర్‌కు మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చే దాకా ఉడికించాలి. తరవాత స్టవ్ మీద నుంచి దించాలి.
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నాలుగు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. ఇందులో జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి ముక్కలు, వెల్లుల్లి తరుగు వేసి దోరగా వేపాలి. తరవాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి. వీటిని అయిదు నిమిషాలపాటు వేగనివ్వాలి. తరవాత గరం మసాలా పొడి, మిరియాల పొడి, పావు చెంచా పసుపు, కారం, తగినంత ఉప్పు, టమాటా ముక్కలు వేసి కలపాలి. గిన్నె మీద మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గించాలి. నెయ్యి పైకి తేలే వరకు వేగనివ్వాలి. తరవాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసల మిశ్రమం వేసి రెండు కప్పుల వేడి నీళ్లు పోసి కలపాలి. గిన్నె మీద మూతపెట్టి చిన్న మంట మీద పావుగంటసేపు మగ్గించాలి. మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. అవసరమైతే మరో అరకప్పు వేడినీళ్లు కలపవచ్చు. ఈ పప్పు మిశ్రమం మెత్తగా ఉడికిన తరవాత కసూరి మేతిని వేసి బాగా కలపాలి. తరవాత కొత్తిమీర తరుగు వేసి రెండు చెంచాల నెయ్యిని చిలకరించి స్టవ్ మీద నుంచి దించాలి. ఇలా తయారుచేసుకున్న పెసల మఖనీని వేడి అన్నంలో కలుపుకుని తినవచ్చు. పుల్కా, నాన్, చపాతీల్లోకి కూడా బాగుంటుంది.
చిట్కాలు
నెయ్యికి బదులు నూనె వేసి చేసుకోవచ్చు.
పెసలను మెత్తగా ఉడికించుకోవాలి. అప్పుడే ఈ వంటకం రుచిగా ఉంటుంది.
పెసల మఖనీని గరిటె జారుగా ఉండేలా తయారు చేసుకోవాలి. అప్పుడే తినడానికి బాగుంటుంది. ఇది చల్లారేకొద్దీ గట్టిపడుతుంటుంది.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News
Updated Date - Jul 26 , 2025 | 12:29 AM