Mount Everest: సంకల్ప శిఖరం
ABN, Publish Date - May 26 , 2025 | 01:24 AM
కేరళకు చెందిన సఫ్రినా లతీఫ్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళగా నిలిచారు. తల్లి, కేక్ ఆర్టిస్ట్‌గా ఉన్న ఆమె, పట్టుదలతో ప్రపంచ అత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిగమించి ప్రేరణగా నిలిచారు.
ఒకప్పుడు బ్యాంకింగ్ రంగంలో సేవలు. ఇప్పుడు కేక్‌ల తయారీలో సిద్ధహస్తురాలు. పిల్ల తల్లి... కళాకారిణి అయిన సఫ్రినా లతీఫ్... 37 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. మంచు తుపానులు... ప్రతికూల వాతావరణ పరిస్థితులు... అడుగడుగునా సవాళ్లు. అన్నిటినీ దాటుకొని... సగర్వంగా జాతీయ జెండా ఎగురవేశారు. ఈ ఘనత సాధించిన తొలి కేరళ మహిళగా చరిత్ర సృష్టించారు. సంకల్పానికి పట్టుదల తోడైతే ఎంతటి శిఖరమైనా అందుకోవచ్చనే జీవిత సత్యాన్ని ఈ విజయం నేర్పిందంటున్న సఫ్రినా జర్నీ ఇది.
‘‘ఉద్వేగం, ఆనందం, ఆశ్చర్యం... ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన ఆ క్షణం నా మదిలో ఎన్నో భావనలు. అంతెత్తున నిలుచున్నప్పుడు ప్రపంచాన్నే జయించిన అనుభూతి. దాన్ని వర్ణించడానికి ఇప్పటికీ మాటలు సరిపోవడంలేదు. కేరళలోని కన్నూర్ జిల్లా వెంగాడ్ మాది. పెళ్లి తరువాత నా నివాసం కతార్‌లోని దోహాకు మారింది. మావారు డాక్టర్ షమీల్ ముస్తఫా దోహా ‘హమద్ మెడికల్ కార్పొరేషన్’లో సర్జన్. నేను ‘జఫ్రిన్ బెస్పోక్ సుగర్‌టేల్స్’ బ్రాండ్‌తో కేక్‌లు తయారు చేస్తాను. పలు అవార్డులు కూడా అందుకున్నాను. కొవిడ్ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమైతే... నేను, మావారు ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో చేరాం. అప్పుడు అర్థమైంది... పని ఒత్తిడి పేరుతో మమ్మల్ని మేము ఎంత అశ్రద్ధ చేశామనేది. ఆరంభంలో ట్రెడ్‌మిల్ లాంటి సాధారణ వ్యాయామాలు చేయడానికి కూడా శక్తి సరిపోయేది కాదు. నేనైతే జిమ్‌లో అరగంట సెషన్ కూడా పూర్తికాకుండానే అలసిపోయేదాన్ని. క్రమంగా ఆహారపు అలవాట్లు కూడా మార్చాను. వర్కవుట్స్‌తో శరీరం కాస్త స్వాధీనంలోకి వచ్చాక నాపై నాకు నమ్మకం పెరిగింది. అప్పుడే పర్వతాలు ఎక్కాలనే చిన్ననాటి కోరిక నా మదిలో మెదిలింది. మావారికి చెబితే, ఆయన కూడా ఆసక్తి చూపారు.
అలా మొదలైంది...
ఇద్దరం మౌంటెనీరింగ్ శిక్షణలో చేరాం. ఒక్కో లక్ష్యం నిర్దేశించుకొంటూ ముందుకు సాగాను. తొలి ప్రయత్నంగా టాంజానియాలోని కిలిమంజారో ఎక్కాను. ఆ ఉత్సాహంతో అర్జెంటీనాలోని అకోన్‌కాగువా, తరువాత రష్యాలోని ఎల్‌బ్రస్ పర్వతాలను విజయవంతంగా అధిరోహించాను. వీటిల్లో అకోన్‌కాగువా ఎత్తయిన (6,961 మీటర్లు) పర్వతం. ఈ పర్వతోరోహణ నాలో ఎనలేని ఆత్మవిశ్వాసం నింపింది. ఎవరెస్టు శిఖరాన్ని ముద్దాడాలన్న బలమైన ఆకాంక్ష రగిల్చింది. దాంతో కజకిస్తాన్ వెళ్లి మంచు పర్వతాల అధిరోహణలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా.
ఫిట్‌నెస్ ఉంటేనే సరిపోదు...
ఎవరెస్టు అధిరోహణ అంటే కేవలం ఫిట్‌నెస్, శిక్షణ మాత్రమే సరిపోవు. పట్టుదల, అంకితభావంతో ఉండాలి. భావోద్వేగాలపై నియంత్రణ సాధించాలి. అన్నిటికీ మించి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. ఈ సాహస యాత్రకు దాదాపు డెబ్భై లక్షలు ఖర్చు అవుతుంది. దీని కోసం బెంగళూరులో ఉన్న మా ఇంటిని అమ్మేశాం. కష్టపడి కొనుక్కున్న ఇల్లు. ఎంతో బాధ కలిగింది. యాత్ర కోసం మొదటి దఫా సొమ్మ చెల్లించినప్పుడు అనుకున్నా... ‘ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదు’ అని. ఈ ఏడాది జనవరిలో దృఢ సంకల్పంతో కఠోర సాధన మొదలుపెట్టాను. ముందుగా అనుకున్నది నేను, మావారు కలిసి వెళ్లాలని. కానీ ఆఖరి నిమిషంలో ఆయన గాయంతో తప్పుకున్నారు. తరువాత దోహాలోనే పర్వతారోహణలో నైపుణ్యంగల ట్రైనర్ వద్ద శిక్షణ తీసుకున్నా.
అడుగడుగునా సవాళ్లే...
ఏప్రిల్ మాసం... 12వ తేదీ... గడ్డ కట్టే చలి. ఈదురు గాలులు. ఎవరెస్టు బేస్ క్యాంప్ వైపు నడక మొదలైంది. అంటే నా సాహస యాత్రలో తొలి అడుగు. దట్టంగా మంచు కప్పిన పర్వతంపై... సన్నని దారిలో పదహారు గంటలపాటు సాగింది ప్రయాణం. ఒక క్యాంపు నుంచి మరో క్యాంపునకు. మధ్యలో చిన్నపాటి విరామం. శరీరం ఆ భయంకర వాతావరణానికి కాస్త అలవాటు పడింది. కానీ అసలైన పరీక్ష రెండు రోజుల తరువాత ఎదురైంది. క్యాంపు 2 నుంచి మరింత కఠినంగా ఉంటుంది. అది చూసి మావారికి ఫోన్ చేశాను... ‘నేను వెనక్కి వచ్చేస్తా’ అని. ఆయన ఒప్పుకోలేదు. ‘ఇది మనిద్దరి కల. నువ్వు నెరవేర్చాలి’ అని ధైర్యం చెప్పారు. మనసులో వేరే ఆలోచనలు లేకుండా ముందుకు సాగాను. క్యాంపు 3, అంటే 7,100 మీటర్ల ఎత్తుకు వెళ్లాక ఆక్సిజన్ అత్యవసరమైంది. నిదానంగా క్యాంపు 4 వైపు ప్రయాణం మొదలైంది. దాన్ని ‘డెత్ జోన్’ అని కూడా అంటారు. కొంత దూరం వెళ్లాక ఫిలిప్పీన్ దేశానికి చెందిన పర్వతారోహకుడి శవం కనిపించింది. రెండు రోజుల కిందటే మరణించాడని తెలిసింది. ముందుకు వెళితే మరికొన్ని శవాలు. నా గుండె కొట్టుకొనే వేగం అమాంతం పెరిగింది. చాలా భయం వేసింది. అయితే మా గైడ్ ఇచ్చిన ధైర్యంతో అంతిమ ఘట్టానికి చేరువ అయ్యాం. కానీ వాతావరణం భయంకరంగా ఉంది. మంచు తుపానులు, చల్లని గాలులు, అత్యంత కఠినమైన మార్గం... అన్నిటినీ దాటుకొని మే 18న ఎవరెస్టు అంచుకు చేరాం.
నన్ను నేను నమ్మలేని క్షణం...
ఎవరెస్టు పర్వతం ఎత్తు 8,848 మీటర్లు. అంత ఎత్తుకు వెళ్లి నిలుచున్నప్పుడు నన్ను నేను నమ్మలేకపోయాను. ప్రపంచంలోకెల్లా ఎత్తయిన పర్వతం అధిరోహించానన్న వాస్తవం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. కన్నీళ్లు ఆగలేదు. అక్కడ భారత్, కతార్ పతాకాలు ఎగురవేశాను. అయితే పైకి వెళ్లగానే గాగుల్స్ లేకుండా ఎవరెస్టును చూడాలనుకున్నాను. కళ్లద్దాలు తీయగానే మంచు తుపాను తాకిడికి ఉన్నట్టుండి నా చూపు మందగించింది. ఏదీ స్పష్టంగా కనిపించలేదు. ఒళ్లంతా నొప్పులు. చేతులు వాచిపోయాయి. కళ్లు మండుతున్నాయి. కిందకి దిగడం ఒక పీడకలలా మిగిలిపోయింది. దారిలో నాకు నేను చెప్పుకున్నాను... ‘ఎలాగైనా సరే శవంగా కాకుండా బతికి ఇంటికి వెళ్లాలి’ అని. మా గైడ్ సాయంతో పది గంటలు ఆలస్యంగా క్యాంపు 4కు చేరుకున్నాను. తరువాత హెలికాప్టర్‌లో కఠ్మండూ ఆసుపత్రికి తీసువెళ్లి చికిత్స అందించారు. అప్పుడు మరో జన్మ ఎత్తిన అనుభూతి కలిగింది.’’
మా అమ్మాయికి స్ఫూర్తినవ్వాలి...
నిజానికి ఇంటి నుంచి వెళ్లేముందే నా భర్తకు, కూతురుకు ఇక సెలవని చెప్పాను. ఎందుకంటే నాకు తెలుసు... ఎవరెస్డు పర్వతారోహణ ఎంత ప్రమాదకరమో. అయితే ఆత్మవిశ్వాసంతో అన్నిటినీ జయించాను. తిరిగి ఇంటికి రాగలిగాను. అదికూడా సజీవంగా. ఇప్పుడు నా కూతురుకు చెప్పడానికి నా దగ్గర ఎన్నో కథలు ఉన్నాయి. అవి విని తను ప్రేరణ పొందాలి. తనకు నేను అతిపెద్ద స్ఫూర్తిమంత్రం అవ్వాలి. ఎందుకంటే నేను ఒక తల్లిని. కేక్ ఆర్టి్‌స్టని. ఒకప్పటి బ్యాంకర్‌ని. ఇప్పుడు పర్వతారోహకురాలిని. ఒక సాధారణ వ్యక్తిని ఎన్నో సాధించాను. నాలాంటి మహిళలకు చెప్పేది ఒక్కటే... మీరు ఎక్కే పర్వతం ఎవరెస్టు కాకపోవచ్చు... కానీ సాధించాలనే తపన, పట్టుదల, బలమైన సంకల్పం ఉంటే జీవితంలో ఎంతటి ఎత్తయిన శిఖరాన్నయినా అధిరోహించవచ్చు.
ఇవి కూడా చదవండి
Sheikh Hasina: మహ్మద్ యూనస్ దేశాన్ని అమెరికాకు అమ్మేశాడు.. మాజీ ప్రధాని షేక్ హసీనా..
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..
Updated Date - May 26 , 2025 | 01:27 AM