Summer Heat Relief: వేసవి వేడికి విరుగుడు
ABN, Publish Date - May 13 , 2025 | 07:18 AM
వేసవి వేడిని తగ్గించడానికి శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారపదార్థాలు, పానీయాలు అవసరం. పుచ్చకాయ, దోస, నిమ్మ, కొబ్బరినీళ్లు, సలాడ్స్, హెర్బల్ టీలు, మరియు తాజా సూప్స్ వంటి వాటిని తీసుకోవడం ద్వారా వేడి ప్రభావాలను తగ్గించుకోవచ్చు.
ఆహారం వేసవి
నడి వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే మార్గాల కోసం వెతుకుతూ ఉంటాం. దాహార్తిని తీర్చడంతో పాటు పొట్టను చల్లగా ఉంచే పానీయాలకే పెద్ద పీట వేస్తూ ఉంటాం. అయితే వేసవి సెగ, వేడి ప్రభావాల నుంచి రక్షణ కల్పించి శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారపదార్థాలను ఎంచుకోవాలి. అవేంటంటే...
వేసవిలో డీహైడ్రేషన్‌తో ఎండదెబ్బకు గురి కాకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రత్యేకించి పుచ్చకాయ, దోస, నారింజ, నిమ్మ, పైనాపిల్ లాంటి పుల్లని పండ్లు ఎక్కువగా తినాలి. పసుపు, నారింజ రంగు పండ్లకు ప్రాథాన్యం ఇవ్వాలి. అలాగే ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ద్రవాహారం పరిమాణం పెంచాలి. అందుకోసం కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం లాంటివి తరచూ తీసుకుంటూ ఉండాలి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా దొరికే బెర్రీ పండ్లు తింటూ ఉండాలి. అలాగే తాజా సూప్స్ కూడా తీసుకోవచ్చు. పలురకాల కూరగాయలు, మొక్కజొన్నలతో తయారుచేసిన సూప్స్, పాలకూర సూప్ లాంటివి తీసుకోవచ్చు.
ఒంట్లో నీటి శాతం తగ్గకుండా...
వేసవిలో సాయంకాలానికి శరీరం నిస్సత్తువగా మారిపోతూ ఉంటుంది. తెలియని బడలిక ఆవరిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే శరీరాన్ని చల్లబరిచి, తేలికగా ఉంచే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అందుకోసం పాలకూర, లెట్యూస్ లాంటివి తరచూ తీసుకుంటూ ఉండాలి. వీటిలో క్యాలరీలు తక్కువ, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో ద్రవ నష్టం తొలగిపోయి, శక్తి సమకూరుతుంది. అలాగే టమేటాల్లో యాంటీఆక్సిడెంట్లు, నీటి శాతం ఎక్కువ కాబట్టి. వంటల్లో వీటిని ఎక్కువగా వాడుకోవాలి. అలాగే బత్తాయి, నిమ్మ, ఉసిరి, జామ ఎక్కువగా తినాలి. వీటిలోని విటమిన్ సి, నిస్సత్తువను దూరం చేస్తుంది. వీటిలో నీటితో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువ కాబట్టి వేసవిలోని బడలిక కూడా దూరమవుతుంది. కీరదోసలో విటమిన్ కె, సిలు ఉంటాయి. పైగా ఇది శరీరాన్ని అద్భుతంగా చల్లబరుస్తుంది. కాబట్టి కీరదోసకాయలు కూడా తరచూ తీసుకుంటూ ఉండాలి. అలాగే పుచ్చలో నీటితో పాటు ఎలకొ్ట్రలైట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. వేసవిలో పుచ్చకు ప్రాధాన్యం ఇవ్వాలి.
తేలికగా జీర్ణమయ్యేలా...
వేసవిలో తేలికగా అరిగే పదార్థాలనే ఎంచుకోవాలి. వాటిలో చెప్పుకోదగినవి... ‘సలాడ్స్’! ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల ముక్కలతో తయారుచేసిన సలాడ్‌ను భోజనానికి ముందూ, తర్వాత తీసుకుంటూ ఉండాలి. అలాగే కూరగాయలను ఉడకబెట్టి తయారుచేసిన సూప్స్ లేదా ఫ్రిజ్‌లో చల్లబరిచిన సూప్స్ తాగుతూ ఉండాలి. వీటితో శరీరంలో నీటి శాతం పెరగడంతో పాటు తేలికగా జీర్ణమై శక్తి సమకూరుతుంది. అలాగే పెరుగులో అరటి, స్ట్రాబెర్రీ పండ్ల ముక్కలు కలుపుకుని తింటూ ఉండాలి. కొబ్బరినీళ్లు, ఉప్పు/చక్కెర కలపని మజ్జిగ తీసుకోవాలి. వీటితో వేసవి వేడిమి నుంచి ఉపశమనం దక్కుతుంది. హెర్బల్ టీలు కూడా తాగుతూ ఉండాలి. తాపం తీరడం కోసం ఐస్‌డ్ హెర్బల్ టీలు ఎంచుకోవచ్చు. గ్రీన్ టీ, బ్లూ పీ టీ, క్యామొమైల్ టీలు వేసవి తాపాన్ని తీరుస్తాయి. అలాగే కొద్దిగా నూనె చిలుకరించిన లేదా నూనె ఉపయోగించని కూరగాయ ముక్కలను గ్రిల్ చేసి తినాలి. ఇవి కూడా తేలికగా అరిగి, శక్తిని అందిస్తాయి. బార్లీ నీళ్లు రుచికరమైనవే కాదు, పోషకభరితమైనవి కూడా! అలాగే రాగి జావ, మజ్జిగలు తాగొచ్చు. దీన్లోని క్యాల్షియం శరీరానికి శక్తినిస్తుంది. చియా నీళ్లు శరీరానికి చల్లదనం అందిస్తాయి.
భారీ ఆహారం వద్దు
అధిక ఉప్పు, నూనె, కొవ్వులు కలిగిన పదార్థాలకు దూరంగా ఉండాలి. బిరియానీ, పానీ పూరి, సమోసాలు, కచోరిలు, బజ్జీలు, నూనెలో వేయించే ఇతరత్రా చిరుతిళ్లు, ఐస్‌క్రీమ్స్, చాక్లెట్లు, శీతల పానీయాలు తగ్గించాలి. వీటిలోని కృత్రిమ తీపిపదార్థాలు, చక్కెరలు, కొవ్వులు దాహార్తిని పెంచుతాయి. డీహైడ్రేషన్‌కు గురి చేస్తాయి. ఉప్పు ఎక్కువగా ఉండే అప్పడాలు, చిప్స్, నిల్వ పచ్చళ్లు ఈ కాలంలో తీసుకోకపోవడమే మేలు. మాంసకృత్తుల కోసం చర్మం తొలగించిన చికెన్, చేప, టోఫు (సోయా పనీర్) తీసుకోవాలి.
చల్లని చిరుతిళ్లు
వేసవిలో చల్లగా తినడం కోసం ఐస్‌క్రీమ్స్‌ను ఎంచుకుంటూ ఉంటాం. అయితే వీటితో అదనపు చక్కెరలు శరీరంలోకి చేరకుండా ఉండడంతో పాటు పోషకాలను పొందడం కోసం, ఫ్రూట్ పాప్సికల్స్‌ను ఇంట్లోనే తయారుచేసుకుని తినొచ్చు. పుచ్చకాయ రసాన్ని అచ్చుల్లో నింపి, డీప్ ఫ్రీజ్ చేసి ఫ్రూట్ పాప్సికల్స్ తయారుచేసుకోవచ్చు. పెరుగులో పండ్ల ముక్కలు కలిపి, ఫ్రోజెన్ యొగర్ట్‌లా తినొచ్చు. పండ్ల ముక్కలను పెరుగు, లేదా కొబ్బరిపాలతో కలిపి మిక్సీలో వేసి, ఆ మిశ్రమాన్ని మౌల్డ్స్‌లో నింపి, ఫ్రిజ్‌లో గడ్డకట్టించి తినొచ్చు.
ఎండదెబ్బ నుంచి కోలుకోవడంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎంతో బాగా సహాయపడతాయి. అందుకోసం అవకాడొ, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం లాంటివి ఎంతో బాగా ఉపయోగపడతాయి. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు, గుండె పనితీరులకు తోడ్పడతాయి. అలాగే సలాడ్‌లో అవకాడొ ముక్కలు కలిపి, నట్స్, సీడ్స్‌ను చల్లుకుని, పెరుగుతో కలిపి తినొచ్చు. పొట్టు తీయని గోధుమలు, మల్టీ మిల్లెట్స్‌తో తయారుచేసుకున్న టోస్ట్‌ను నట్ బటర్‌తో కలిపి తినొచ్చు. అలాగే శరీరం కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడం కోసం కొబ్బరినీళ్లు, మజ్జిగ, సూప్స్, పండ్ల రసాలు లాంటివి తీసుకోవాలి.
-డాక్టర్ ఎ. కిరణ్మయి
సీనియర్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ లైఫ్‌స్టైల్ కన్సల్టెంట్,
రెయిన్‌బో చిల్ర్డెన్స్ హాస్పిటల్, హైదరాబాద్.
Updated Date - May 13 , 2025 | 07:19 AM