Weight Loss Pills and Injections: బరువు తగ్గించే మందులతో ప్రమాదమే
ABN, Publish Date - Sep 09 , 2025 | 05:33 AM
అధిక బరువును తగ్గించుకునే మార్గాలెన్నో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని దగ్గరి దారులుగా..
అధిక బరువును తగ్గించుకునే మార్గాలెన్నో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని దగ్గరి దారులుగా భావించడం పొరపాటు. అత్యవసరమైతే తప్ప బరువు తగ్గించే మాత్రలు, ఇంజక్షన్ల జోలికి వెళ్లకూడదు. ఒబేసిటీ మందుల ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.
అధిక బరువు బిఎమ్‌ఐ మీద ఆధారపడి ఉంటుంది. శరీర బరువు, ఎత్తు/మీటరుతో అధిక బరువును లెక్కించవచ్చు. బిఎమ్‌ఐ 18 కంటే తక్కువగా ఉండే దాన్ని పోషకాహార లోపంగా భావించాలి. 18.5 నుంచి 25 ఉంటే దాన్ని సరైన బరువుగా పరిగణించాలి. 25కు మించితే అధిక బరువుగా, 28, అంతకు మించితే ఒబేసిటీగా పరిగణించాలి. అయితే 13 నుంచి 18 ఏళ్ల వయస్కుల్లో హార్మోన్లు హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి కాబట్టి బరువులో కూడా వ్యత్యాసాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. మరీముఖ్యంగా ఈ వయసు అమ్మాయిల్లో నెలసరి మొదలై కార్టిసాల్ హార్మోన్ పెరిగి, తిండి పట్ల యావ పెరుగుతుంది. దాంతో బరువు పెరుగుతారు. ఇదే వయసు అబ్బాయిలు కూడా హార్మోన్ల హెచ్చుతగ్గుల ఫలితంగా ఎత్తు, బరువు పెరుగుతారు. అలాగే థైరాయిడ్ సమస్యల వల్ల కూడా శరీర బరువు పెరుగుతుంది. జన్యుపరమైన సమస్యల వల్ల కొంతమంది పిల్లలు అధిక బరువుతో పుడతారు. ఇలాంటి పిల్లల్లో భవిష్యత్తులో చిన్న వయసులోనే మధుమేహం తలెత్తుతుంది. దాంతో ఒబేసిటీ కూడా తలెత్తుతుంది. ఒబేసిటీ, హైపర్‌టెన్షన్, మధుమేహం... ఈ మిశ్రమ సమస్యను ‘మెటబాలిక్ సిండ్రోమ్’గా పరిగణించాలి. ఈ కోవకు చెందినవాళ్లు అవసరానికి మించి తినకపోయినా, బరువు పెరిగిపోతూ ఉంటారు.
జన్యువులూ కారణమే!
కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. ఇంకొందరు కొంత తిన్నా లావైపోతూ ఉంటారు. పుట్టుకతో సంక్రమించే జన్యువులే ఇందుకు కారణం. ఆకలి, కొన్ని పదార్థాలు తినాలనే బలమైన కోరిక, సంతృప్తి, శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం, శరీరంలో కొవ్వు నిల్వ.. వీటికి సంబంధించిన జన్యువులుంటాయి. ఈ జన్యువుల్లో లోపాలున్నప్పుడు సంబంధిత అంశాలన్నీ ప్రభావితమవుతాయి. ఆకలి మీద నియంత్రణ కోల్పోవడం, ఎంత తిన్నా సంతృప్తిని పొందలేకపోవడం, శరీరం శక్తిని ఖర్చుచేసుకునే వేగం తగ్గడం, శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉండడం లాంటి సమస్యలన్నిటికీ సంబంధిత జన్యు లోపాలే కారణం. వీటిని నియంత్రించే వీలు ఉండదు కాబట్టి అంతిమంగా స్థూలకాయులైపోతూ ఉంటారు.
వ్యాయామంతోనే ఫలితం
శరీరం శక్తిని ఖర్చు చేసుకునే బేసిక్ మెటబాలిక్ రేటును పెంచుకోదగిన ఏకైక మార్గం... వ్యాయామం. అందుకోసం రోజుకు 20 నుంచి 30 నిమిషాలకు తగ్గకుండా వారానికి 150 నిమిషాల చొప్పున వేగంగా నడవాలి. ఇలా మూడు నెలల పాటు క్రమం తప్పక నడకను కొనసాగించగలిగితే కచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాగే ఈత, జిమ్‌లో వ్యాయామాలతో కూడా ఫలితం ఉంటుంది. అలాగే ఆహార నియమాల్లో భాగంగా పిండిపదార్థాలు తగ్గించేసి, కూరగాయలు, ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలి.
ఉత్తమ మార్గం ఇదే!
అధిక బరువును వదిలించుకోడానికి సురక్షితమైన మార్గాన్నే ఎంచుకోవాలి. అవసరానికి మించి తినడం వల్ల, వ్యాయామం లోపించడం వల్ల బరువు పెరిగితే అదే ఆహారాన్ని తగ్గించి, వ్యాయామాన్ని పెంచి బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాలతో కచ్చితంగా అధిక బరువు అదుపులోకొస్తుంది. అయినప్పటికీ విపరీతమైన ఆకలి, కొన్ని పదార్థాలను తినాలనే యావ లాంటివి ఉన్నప్పుడు, వాటిని నియంత్రించే కొన్ని మాత్రలు వాడుకోవచ్చు. అవేంటంటే...
అరుగుదల పెంచే మాత్రలు: తిన్నది వెంటనే వేగంగా అరిగి, శరీరంలో క్యాలరీలు పేరుకుపోకుండా చేస్తాయి.
కొవ్వును తగ్గించే మాత్రలు: తిన్నది అరిగిపోతున్నా, శరీరంలో కొవ్వు పేరుకుపోతుంటే, ఆ కొవ్వును కరిగించే మాత్రలు వాడుకోవచ్చు
ఆకలి తగ్గించే మాత్రలు: కొన్ని మాత్రలు మెదడును ప్రభావితం చేసి, ఆకలి కోరికను తగ్గి స్తాయి వీటిలో నాలుగు నుంచి 8 రకాల మాత్రలు అందుబాటులో ఉన్నాయి.
బరువు తగ్గించే ఇంజక్షన్లు
ఆకలి తగ్గించే ఇంజక్షన్: ఈ ఇంజక్షన్‌తో వాంతి వస్తున్న భావన నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి తినాలనే కోరిక సన్నగిల్లుతుంది. దాంతో ఒకట్రెండు వారాల్లో పదార్థాల పట్ల వ్యామోహం తగ్గి, ఆకలి అదుపులోకొస్తుంది. ఈ ఇంజక్షన్ మధుమేహులకు కూడా సహాయపడుతుంది.
సెమాగ్లూటైడ్: ఆకలి, అధిక బరువుతో పాటు మధుమేహాన్ని కూడా తగ్గించే ఇంజక్షన్ ఇది
ఆర్లిస్టాట్, సిబుట్రమైన్: ఈ ఇంజక్షన్లు శరీరంలోని కొవ్వును కరిగించి, విసర్జనతో శరీరం నుంచి తొలగిస్తాయి
ఈ ఇంజెక్షన్లు అందరికీ ఒకే ఫలితాన్ని అందించకపోవచ్చు. కొందర్లో కొన్ని దుష్ప్రభావాలు కూడా తలెత్తవచ్చు. కొందరికి కడుపు నొప్పి, విరోచనాలు, అజీర్తి, కడుపుబ్బరం వేధిస్తాయి.
ఇంజక్షన్లకూ నియమాలున్నాయి
అధిక బరువును తగ్గించుకోవడం కోసం మొదట మూడు నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేయాలి. అలాగే అధిక బరువుకు కారణమయ్యే థైరాయిడ్ సమస్యను మందులతో అదుపులో పెట్టుకోవాలి. వీటితో అనుకున్నంత ఫలితం కనిపించనప్పుడు మాత్రమే అంతిమ పరిష్కారంగా వైద్యులు బరువు తగ్గించే మాత్రలు, ఇంజక్షన్లను సూచిస్తారు. అయితే ఇవి వాడుకున్నంత కాలం ఆహార నియమాలు, వ్యాయామాలు తప్పక కొనసాగించాలి. వ్యాయామాలు మానేసి పూర్తిగా ఈ ఇంజక్షన్ల మీదే ఆధారపడితే, శరీరంలో ఆమ్లం పెరిగి, ఒంటి నొప్పులు, ఇన్‌ఫెక్షన్లు వేధిస్తాయి. బరువు తగ్గించే మాత్రలు, ఇంజక్షన్లు అందరికీ ఒకే రకమైన ఫలితాన్నివ్వవు. కాబట్టి రెండు నుంచి మూడు వారాల పాటు గమనిస్తూ, మాత్రలు, ఇంజక్షన్లలో, వాటి మోతాదుల్లో మార్పులు చేసుకుంటూ ఫలితాన్నీ, దుష్ప్రభావాలనూ గమనిస్తూ, వైద్యులు సరైన చికిత్సను ఎంచుకుంటూ ఉంటారు. ఇలాంటి చికిత్సను మూడు నెలల పాటు కొనసాగించి, అధిక బరువును వదిలించుకోవచ్చు. అయితే ఇలా తగ్గిన బరువు తిరిగి పెరగకుండా ఉంటుందని అనుకోకూడదు. తగ్గిన బరువును కొనసాగించాలంటే వైద్యులు సూచించే ఆహార నియమాలు, వ్యాయామాలు తప్పక కొనసాగించాలి.
-డాక్టర్ శ్రీకృష్ణ ఆర్ బొడ్డు
కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్,
కామినేని హాస్పిటల్స్,
ఎల్.బి నగర్, హైదరాబాద్.
Updated Date - Sep 09 , 2025 | 05:33 AM