Chennai : కూతురి భద్రత కోసం... 30 ఏళ్లుగా ఓ తల్లి మగవేషం
ABN, Publish Date - Jan 01 , 2025 | 06:20 AM
పిన్నవయసులోనే పెళ్లి.. అంతలోనే గర్భం.. అది తెలిసే లోపే భర్త మరణం.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి! తన చిన్నారిని సంరక్షించుకునేందుకు, ఆకతాయిల నుంచి ‘ఆకలి’ చూపులు తప్పించుకునేందుకు..
మగువ తెగువ
పిన్నవయసులోనే పెళ్లి.. అంతలోనే గర్భం.. అది తెలిసే లోపే భర్త మరణం.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి! తన చిన్నారిని సంరక్షించుకునేందుకు, ఆకతాయిల నుంచి ‘ఆకలి’ చూపులు తప్పించుకునేందుకు.. ఒక్కటే మార్గమని తలచింది. అంతే! తన ఆడతనాన్ని మరచిపోయి మగాడిలా అవతారమెత్తింది. కురులు, దుస్తులే కాదు.. అలవాట్లు కూడా మగాడిగానే మార్చుకుంది. వినడానికి సినిమాలా అనిపించినా.. ఇది మూడు దశాబ్దాలకు పైగా మగాడిగా బతుకుతున్న ఓ మగువ కథ! ఆ కథలోకి వెళితే.. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా చొక్కలింగాపురానికి చెందిన పేచ్చియమ్మాళ్ ఇరవై యేళ్ల ప్రాయంలో శివనాండి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే, పెళ్లయిన కొద్ది రోజులకే భర్త మృతి చెందాడు. అప్పటికే గర్భంతో ఉన్న ఆమెకు కొద్ది నెలలు గడిచాక ఆడబిడ్డ జన్మించింది. ఆ బిడ్డను పెంచి పెద్ద చేసేందుకు సంపాదన ముఖ్యమని భావించింది. పిన్నవయస్సులోనే వితంతువుగా మారిన తనకు సమాజంలో శీలరక్షణ ఉండదని నిర్ధారించుకుంది. అందుకే మగవేషం ధరించింది. పేచ్చియమ్మాళ్ అనే తన పేరును ‘ముత్తుకుమార్’గా మార్చుకుంది. ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డులలో ముత్తుకుమార్ అనే పేరునే నమోదు చేసింది. లుంగీ, చొక్కా ధరించింది. మగవారి మరుగుదొడ్లను ఉపయోగించు కునేది. ఈ పాట్లన్నీ తన ముద్దుల కుమార్తెకోసమే కనుక పేచ్చియమ్మాళ్ ఎన్నడూ బాధ పడలేదు.
-చెన్నై, ఆంధ్రజ్యోతి
Updated Date - Jan 01 , 2025 | 06:20 AM