దీక్ష విరమణ ఇష్టం లేదా?
ABN, Publish Date - Jan 03 , 2025 | 04:36 AM
నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగజ్జీత్ సింగ్ దల్లేవాల్‌ను ఆస్పత్రికి తరలించనందుకు సుప్రీంకోర్టు గురువారం పంజాబ్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
దల్లేవాల్‌ను ఆస్పత్రికి ఎందుకు తరలించలేదు?.. నచ్చజెప్పడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలం
సుప్రీంకోర్టు అసంతృప్తి
చికిత్స పొందుతూ నిరసన కొనసాగించవచ్చని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జనవరి 2: నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగజ్జీత్ సింగ్ దల్లేవాల్‌ను ఆస్పత్రికి తరలించనందుకు సుప్రీంకోర్టు గురువారం పంజాబ్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజీ పడొద్దన్నట్టుగా ప్రభుత్వ వైఖరి ఉంద ని వ్యాఖ్యానించింది. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దల్లేవాల్ గత ఏడాది నవంబరు 26 నుంచి పంజాబ్-హరియాణా సరిహద్దులోని కౌనడీ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దల్లేవాల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను మంగళవారం (డిసెంబరు 31)లోగా ఆస్ప్రతికి తరలించాలని గత నెల 20న సుప్రీంకోర్టు ఆదేశించింది. అవసరమైతే శిబిరం సమీపంలో తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు చేయవచ్చని, కావాలనుకుంటే అక్కడ దీక్ష కొనసాగించుకోవచ్చుని తెలిపింది. ఈ ఆదేశాలు అమలు కాకపోవడంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయన్‌ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే దీక్ష కొనసాగించుకోవచ్చన్న విషయాన్ని దల్లేవాల్‌కు అర్థమయ్యేలా నచ్చజెప్పడంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని వ్యాఖ్యానించింది. పైగా సుప్రీంకోర్టే నిరాహార దీక్ష అపాలని ఆదేశాలు ఇచ్చిందంటూ కొందరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైతు నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. దీనిపై పంజాబ్ అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ సమాధానం ఇస్తూ చికిత్సలు చేసుకోవాల్సిందిగా దల్లేవాల్‌ను మధ్యవర్తులు నచ్చజెప్పుతున్నారని తెలిపారు. చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తేనే వైద్య సేవలు పొందుతానని దల్లేవాల్ అంటున్నారని తెలిపారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. సమస్య పరిష్కారానికి మేం కమిటీ వేసిన విషయాన్నయినా చెప్పారా?’’ అని అడిగారు. ఏజీ బదులిస్తూ ఆ కమిటీ శుక్రవారం రైతులతో చర్చలు జరుపుతుందని తెలిపారు. తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. కాగా, రైతుల ఆందోళనపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మీడియా ప్రశ్నించినప్పుడు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్చలు జరుపుతామని తెలిపారు.
మోదీని కలిసిన గాయకుడు దిల్జిత్
ప్రధాని మోదీని పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దొసాంజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మోదీ, దిల్జిత్ భేటీకి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా గాయకుడు దిల్జీత్‌పై మోదీ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. అతడు ప్రజల హృదయాలను గెలిచాడని, దిల్జిత్ అనే పేరును సార్థకం చేసుకున్నాడని ప్రశంసించారు. మరోపక్క ప్రధాని నుంచి తాను ఎంతగానో స్ఫూర్తి పొందానని గాయకుడు దిల్జిత్ కొనియాడారు. అయితే ప్రధాని మోదీతో దిల్జిత్ భేటీ కావడంపై రైతు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Jan 03 , 2025 | 04:36 AM