AI in politics: ఏఐ.. నాయకా!
ABN, Publish Date - Jan 20 , 2025 | 04:46 AM
మనం ఏ ప్రశ్న అడిగినా ఠక్కున జవాబిచ్చే చాట్‌జీపీటీ.. వాట్సా్‌పలో కనిపించే మెటా ఏఐ..
రాజకీయ నేతల బదులు.. భవిష్యత్తులో కృత్రిమ మేధ పాలన?
పాశ్చాత్యదేశాల్లో ఈ ప్రతిపాదనపై ఐదారేళ్లుగా విస్తృత చర్చ
2018లో పుతిన్ ప్రత్యర్థిగా ‘అలీసా’ అనే చాట్‌బాట్ తెరపైకి!
టోక్యోలో మేయర్ ఎన్నికల్లో.. హ్యూమనాయిడ్ రోబో పోటీ
ఏఐ అల్గారిథమ్స్ ద్వారా జరిపే పాలనకు ‘అల్గోక్రసీ’గా పేరు
మనం ఏ ప్రశ్న అడిగినా ఠక్కున జవాబిచ్చే చాట్‌జీపీటీ.. వాట్సా్‌పలో కనిపించే మెటా ఏఐ.. ఇవన్నీ ఎన్నికల్లో పోటీ చేస్తే? కేంద్రంలో మోదీకి పోటీగా ప్రధాని పదవికి పోటీ పడితే. ఇక్కడ చంద్రబాబుకో, రేవంత్‌కో ప్రత్యర్థిగా రంగంలోకి దిగితే? ఊహించడానికే వింతగా ఉంది కదూ! మనకు కొత్తగా అనిపించొచ్చుగానీ.. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే ఈ ప్రతిపాదనపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి! ‘ఏమో.. గుర్రం ఎగరావచ్చు’ అన్న నానుడి చందంగా.. ఇప్పటికి ప్రతిపాదన దిశలోనే ఉన్న ఈ ఆలోచన భవిష్యత్తులో నిజం కావొచ్చు! ఏమో.. ఏఐ ఎప్పటికైనా ప్రధాని కుర్చీ ఎక్కావచ్చు!!
ఆరోగ్య సంరక్షణ.. బ్యాంకింగ్.. కోడింగ్.. ఈ-కామర్స్.. వ్యవసాయం.. అందుగలదు ఇందులేదని సందేహం అక్కర్లేదు.. కృత్రిమ మేధ ఇప్పుడు అన్ని రంగాల్లోకీ చొచ్చుకొచ్చేస్తోంది.. రాజకీయంతో సహా!! ఏఐ అనగానే.. మానవుల పనిని సులభతరం చేసే కోడింగ్‌గానో (చాట్‌జీపీటీలాంటివి).. స్మార్ట్‌ఫోన్‌లో మనకు కావాల్సిన సమాచారం అందించే వర్చువల్ అసిస్టెంట్‌గానో.. భౌతికంగా పనిచేసి పెట్టే రోబోలుగానో (ఆండ్రాయిడ్లు) భావిస్తున్నాం. ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఇన్నాళ్లుగా మనం కృత్రిమ మేధను మనిషికి సహాయకారిగానే పరిగణిస్తూ వస్తున్నాం. కానీ.. అదే ఏఐని పొలిటీషియన్‌గా మార్చి ప్రజల జీవితాలనే మార్చేసే నిర్ణయాలు తీసుకునే స్థాయి దానికి కల్పిస్తే? ఇలా ఏఐ అల్గారిథమ్స్ ద్వారా పాలించడాన్ని ‘అల్గోక్రసీ’గా నిపుణులు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై పాశ్చాత్య దేశాల్లో ఐదారేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే.. రాజకీయ నాయకుల కన్నా కృత్రిమ మేధ తీసుకునే నిర్ణయాలే నిష్పక్షపాతంగా, నిజంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటాయన్నది ‘అల్గోక్రసీ’ని బలపరిచేవారి వాదన. ఏఐకి ఏ ఒక్క వర్గం మీదనో ప్రత్యేకంగా ప్రేమ ఉండదని.. సగటు రాజకీయనాయకుల్లాగా ఓటు బ్యాంకును బలపరచుకోవడం కోసం నిర్ణయాలు తీసుకోదని.. డబ్బు, పేరు ప్రతిష్ఠల కోసం పాకులాడదని.. దేశ సమగ్ర అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందని వారు చెబుతారు. ఈ క్రమంలోనే.. కొన్ని దేశాల్లో జరిగిన ఎన్నికల్లో వర్చువల్ పొలిటీషియన్ల పేర్లు బలంగా తెరపైకి వచ్చాయి! ఉదాహరణకు 2017లో.. న్యూజిలాండ్‌కు చెందిన నిక్ గెర్రిట్సెన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ‘శామ్’ అనే పేరుతో మానవ చరిత్రలోనే తొలి వర్చువల్ పొలిటీషియన్‌ను సృష్టించాడు. ఆయన దానికి ‘భవిష్యత్తు రాజకీయ నాయకుడు’ అని పేరుపెట్టాడు.
చాట్‌జీపీటీ తరహాలోనే... ‘శామ్’ను ప్రజలు ఏ ప్రశ్న అడిగినా, అది తన వద్ద ఉన్న డేటాను విశ్లేషించి సమాధానం ఇస్తుంది. అయితే అలాంటి వర్చువల్ పొలిటీషియన్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి చట్టాలు అనుమతించవు కాబట్టి ఇప్పటిదాకా అది అక్కడ ఎన్నికల బరిలోకి దిగలేదు. 2018లో రష్యాలో జరిగిన ఎన్నికల్లో పుతిన్‌కు పోటీగా.. ‘యాండెక్స్’ కంపెనీ అభివృద్ధి చేసిన అలీసా అనే చాట్‌బాట్‌ను ఒక వ్యక్తి నామినేట్ చేశాడు. ఒక్కరోజు వ్యవధిలోనే పాతికవేల మందికిపైగా రష్యన్లు దానికి తమ మద్దతు తెలపడం విశేషం. అదే ఏడాది టోక్యోలో.. ఒక హ్యూమనాయిడ్ రోబో టోక్యోలో మేయర్ ఎన్నికల్లో పోటీకి దిగింది. దాన్ని అభివృద్ధి చేసిన ‘మికిహిటో మత్సుదా’ దాని ప్రతినిధిగా వ్యవహరించి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాడు. అప్పట్లో ఆయన తన ప్రచారంలో.. ఆ హ్యూమనాయిడ్ రోబోను ఒక ‘ఆబ్జెక్టివ్ ఎంటిటీ’గా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. దానికి ఎలాంటి పక్షపాతమూ ఉండదని.. ప్రజల అభిప్రాయాలను, విజ్ఞప్తులను స్వీకరించి, ఆ డేటాను విశ్లేషించి వారికి ఉపయోగపడేలా విధానాలను రూపొందిస్తుందని విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆ రోబోను ‘ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి కొత్త రూపం’గా అభివర్ణించాడు. ఇక.. నిరుడు జూన్‌లో యూకే పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ‘ఏఐ స్టీవ్’ అనే కృత్రిమ మేధ అభ్యర్థి బరిలోకి దిగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యూకేలో ‘న్యూరల్ వాయిస్’ అనే కంపెనీని నడిపే స్టీవ్ ఎండాకాట్ ఈ ఏఐని తన తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిపారు. ఒకవేళ ఎన్నికల్లో ‘ఏఐ స్టీవ్’ గెలిస్తే.. అతడి తరఫున ఎండాకాట్ పార్లమెంటేరియన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారని బ్రిటన్ ఎన్నికల కమిషన్ మొదట్లోనే తేల్చిచెప్పింది.
లాభాలు.. నష్టాలు!
ఏఐ పొలిటీషియన్లకున్న ప్రధానమైన సానుకూల అంశం ఏంటంటే.. మామూలు రాజకీయ నాయకుల్లాగా వాటికి విశ్రాంతి అవసరం లేదు. యాప్/వెబ్‌పేజీల ద్వారా ఏ సమయంలోనైనా వాటితో నేరుగా సంభాషించవచ్చు. ఒకేసారి ఎక్కువ మంది ప్రశ్నలకు సమాధానమిచ్చే సామర్థ్యం కూడా వాటికి ఉంటుంది. వీటిని పక్కన పెడితే.. వాటికీ కొన్ని సమస్యలుంటాయి. కృత్రిమ మేధ పనిచేయడానికి విస్తృతంగా కంప్యూటేషనల్ వనరులు, పెద్దఎత్తున విద్యుత్తు వంటివి అవసరమవుతాయి. వాటికి నిరంతరాయంగా నెట్‌వర్క్ యాక్సెస్ ఉండాలి. ఏఐను రూపొందించేది మనుషులే. రకరకాల లాంగ్వేజ్ మోడల్స్ ద్వారా వాటిని అభివృద్ధి చేస్తారు. రూపకర్తలు వాటికి ఏ సమాచారం ఇస్తారో ఆ డేటా ఆధారంగా మాత్రమే అవి నిర్ణయాలు తీసుకోగలవు. ‘రోబో’ సినిమాలో చూపించినట్టు.. వికృత మనస్తత్వం కలిగిన నిపుణులెవరైనా అలా వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు.. రష్యా చాట్‌బాట్ అలీసా ఒక సందర్భంలో గృహ హింసను సమర్థించే సమాధానం ఇచ్చింది. మరో సందర్భంలో.. కాల్పులను సమర్థిస్తూ సమాధానం ఇచ్చింది. కాబట్టి పూర్తిగా వాటిపై ఆధారపడలేని పరిస్థితి. అందుకే వీటికి బదులుగా.. ‘ఏఐ పవర్డ్ డైరెక్ట్ డెమొక్రసీ’ అనే మరో ప్రతిపాదనను సీజర్ హిడాల్గో అనే ఫిజిసిస్ట్ చేశారు. అంటే.. దేశంలోని పౌరులందరూ తమ తమ ఏఐ ఏజెంట్లను రూపొందించుకోవాలి. ఈ ఏఐ ఏజెంట్లన్నీ కలిసి ఆన్‌లైన్ ద్వారా సంప్రదింపులు జరుపుకొని అందరికీ ఆమోదయోగ్యమయ్యే నిర్ణయం తీసుకుంటాయని హిడాల్గో ప్రతిపాదించారు. దీన్ని ఆయన నిజమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్యంగా, ‘అవతార్ డెమొక్రసీ’గా అభివర్ణిస్తున్నారు. కానీ.. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని, ఆచరణసాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మధ్యవర్తి ఏఐ!
విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వర్చువల్ పొలిటీషియన్ల మీద ఆధారపడడం కంటే.. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఏఐ ఆధారిత ‘హబెర్మాస్ మెషీన్’ వంటి ఉపకరణాల సాయం తీసుకోవడం మంచిదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. హబెర్మాస్ మెషీన్ అనేది.. గూగుల్‌కు చెందిన ‘డీప్‌మైండ్’ సంస్థ అభివృద్ధి చేసిన ‘ఏఐ డిబేట్ మీడియేటర్’. ఒక అంశంపై వివిధ వర్గాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను అన్నింటినీ క్రోడీకరించి ఒక ఉమ్మడి ప్రాతిపదికను గుర్తించి అన్ని వర్గాలూ ఏకాభిప్రాయానికి వచ్చేలా చేసే మధ్యవర్తి లాంటి యంత్రం ఇది. ప్రయోగాల్లో భాగంగా ఈ మెషీన్ ఇప్పటికే పలు ట్రయల్ గ్రూపుల మధ్య అత్యంత సమస్యాత్మక అంశాల్లో ఏకాభిప్రాయం కుదర్చగలిగింది.
చివరాఖరు: కృత్రిమ మేధ ఇప్పటిదాకా ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగలేదుగానీ.. పరోక్షంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఎన్నికలను ప్రభావితం చేస్తోంది! ఎన్నికల సమయంలో ఓటర్ల మనసును ప్రభావితం చేసే విధంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులు, డీప్ ఫేక్ వీడియోలు.. ఇవన్నీ ఏఐ సాయంతో సృష్టిస్తున్నవే! కృత్రిమ మేధను మన రాజకీయ నాయకులు ఇప్పటికే విచ్చలవిడిగా వాడేస్తున్నారు మరి!!
(సెంట్రల్ డెస్క్) ఏఐ నడిపే పార్టీ..
ఎన్నికల్లో పోటీ చేయడం కాదు.. డెన్మార్క్‌లో ‘లీడర్ లార్స్’ అనే చాట్‌బాట్ పొలిటీషియన్ ఏకంగా ఒక పార్టీనే నడుపుతోందంటే నమ్ముతారా? ఆ పార్టీ పేరు ‘సింథటిక్ పార్టీ’. 2022 మే నెలలో ప్రారంభమైన ఆ పార్టీ ప్రధాన లక్ష్యం.. మనుషులు, కృత్రిమమేధ కలిసి జీవించడం. ప్రపంచంలోనే తొలి ‘ఏఐ ఆధారిత రాజకీయ పార్టీ’ ఇది. డెన్మార్క్‌లోని ఆర్హస్ యూనివర్సిటీకి చెందిన ‘ఆస్కర్ బ్రిల్డ్ స్టానేస్’ అనే తత్వవేత్త ఈ పార్టీ వ్యవస్థాపకుడు. దీనికన్నా ముందు (2018లో) ఫిన్‌లాండ్‌లో ‘ద ఏఐ పార్టీ’ని స్థాపించారుగానీ.. దాన్ని నడిపేది ‘లీడర్ లార్స్’లాగా ఏఐ కాదు. మనుషులే. కాకపోతే, దేశానికి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఏఐ పాత్ర ఎక్కువగా ఉండాలనేది ఆ పార్టీ లక్ష్యం.
Updated Date - Jan 20 , 2025 | 04:46 AM