Amit Shah: తమిళంలో మాట్లాడలేకపోతున్నా.. క్షమించండి
ABN, Publish Date - Feb 27 , 2025 | 05:27 AM
జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రం అమలును డీఎంకే నేతలు వ్యతిరేకిస్తున్న వేళ.. తమిళ భాషపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో అతి ప్రాచీన భాష తమిళం
దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు తగ్గవు
ప్రజల దృష్టి మరల్చడానికే డీఎంకే ఆరోపణలు
పునర్విభజనలో తమిళనాడు ఒక్క సీటు కూడా కోల్పోదు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
చెన్నై, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రం అమలును డీఎంకే నేతలు వ్యతిరేకిస్తున్న వేళ.. తమిళ భాషపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అతి ప్రాచీన భాష తమిళం అని, అటువంటి భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని తమిళనాడు ప్రజలను కోరారు. మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం రాత్రి కోయంబత్తూరుకు వచ్చిన ఆయన.. బుధవారం ఉదయం ఇక్కడ బీజేపీ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తమిళనాడు 8 సీట్లు కోల్పోతుందంటూ ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఒక్క లోక్‌సభ సీటు కూడా తమిళనాడు కోల్పోదని, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోమని చెప్పారు. కేంద్రం నుంచి నిధుల కేటాయింపులోనూ తమిళనాడుకు ఏవిధమైన అన్యాయం జరగలేదన్నారు. 2014-24 మధ్య కాలంలో కేంద్రం తమిళనాడుకు రూ. 5.08 లక్షల కోట్లు ఇచ్చిందని వివరించారు. గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా రాష్ట్రంలో దేశ వ్యతిరేక ధోరణి ప్రబలిందని విమర్శించారు.
Updated Date - Feb 27 , 2025 | 05:27 AM