Donald Trump: అమ్మకానికి అమెరికా పౌరసత్వం!
ABN, Publish Date - Feb 27 , 2025 | 05:34 AM
సంపన్న వలసదారులకు అగ్రరాజ్యం అమెరికా పెద్దపీట వేయనుంది. రూ.43.5 కోటు (5 మిలియన్ డాలర్లు) చెల్లించేవారికి శాశ్వత పౌరసత్వం కల్పించనుంది. ఈ మేరకు ‘గోల్డ్‌కార్డు’ వీసాను ప్రవేశపెట్టనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంచలన ప్రకటన చేశారు.
రూ.43.5 కోట్లకు ‘గోల్డ్ కార్డు’
డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
ఉద్యోగకల్పనతో లింకు లేకుండా గ్రీన్‌కార్డ్
కాంగ్రెస్ అనుమతి అక్కర్లేదన్న వైట్‌హౌస్
ప్రస్తుతం ఉన్న ‘ఈబీ-5’ స్థానంలో కొత్తది
రూ.8.7 కోట్ల పెట్టుబడి, 10 ఉద్యోగాల కల్పనతో ఈబీ-5
కోటి గోల్డ్‌కార్డులతో రూ.43.5 కోట్ల కోట్లు ఆదాయమే లక్ష్యం
వాషింగ్టన్, ఫిబ్రవరి 26: సంపన్న వలసదారులకు అగ్రరాజ్యం అమెరికా పెద్దపీట వేయనుంది. రూ.43.5 కోటు
వాషింగ్టన్, ఫిబ్రవరి 26: సంపన్న వలసదారులకు అగ్రరాజ్యం అమెరికా పెద్దపీట వేయనుంది. రూ.43.5 కోటు (5 మిలియన్ డాలర్లు) చెల్లించేవారికి శాశ్వత పౌరసత్వం కల్పించనుంది. ఈ మేరకు ‘గోల్డ్‌కార్డు’ వీసాను ప్రవేశపెట్టనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. 35 ఏళ్ల నాటి పెట్టుబడిదారుల వీసా(ఈబీ-5) స్థానంలో గోల్డ్‌కార్డు వీసాను తీసుకురానున్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు 1990లో ఈబీ-5 వీసాలను అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చింది. అమెరికాలో కనీసం రూ.8.7 కోట్లు(ఒక మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టడం ద్వారా కనీసం 10 మందికి ఉద్యోగాలు కల్పించేవారికి ఈబీ-5 వీసాను ఇస్తున్నారు. అయితే, గోల్డ్‌కార్డు వీసాకు ఉద్యోగాల కల్పన నిబంధనను ట్రంప్ ప్రస్తావించలేదు. రూ.43.5 కోట్లు చెల్లించేవారికి అమెరికా శాశ్వత పౌరసత్వం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వచ్చే రెండు వారాల్లో ఈబీ-5 వీసా స్థానంలో ‘ట్రంప్ గోల్డ్‌కార్డు’ రానుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్ చెప్పారు. గోల్డ్‌కార్డు అంటే గ్రీన్‌కార్డు లేదా శాశ్వత లీగల్ నివాసం అన్నారు. ఈబీ-5 వీసాలో మోసాలు జరుగుతున్నాయని, అందుకే దాని స్థానంలో గోల్డ్‌కార్డును తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వార్షిక వలస గణాంకాల పుస్తకంలోని వివరాల మేరకు 2022 సెప్టెంబరు 30తో ముగిసిన ఏడాది కాలానికి 8 వేల మంది ఈబీ-5 వీసాలు పొందారు. అయితే, ఈబీ-5 వీసాను ఒక చెత్త పథకంగా ట్రంప్ అభివర్ణించారు. పౌరసత్వానికి అర్హతలను కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. అయితే, గ్రీన్‌కార్డుకు కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదని ట్రంప్ చెప్పారు. ఈబీ-5 వీసాలకు గరిష్ఠ పరిమితి ఉండగా, ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు ఫెడరల్ ప్రభుత్వం కోటి గోల్డ్‌కార్డులు విక్రయించుకోవచ్చని ట్రంప్ ప్రకటించారు. కోటి గోల్డ్ కార్డుల ద్వారా రూ.43.5 కోట్ల కోట్లు ఆదాయం రానుంది.
100కుపైగా దేశాల్లో గోల్డెన్ వీసాలు
ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా దేశాలు పెట్టుబడిదారుల వీసాలను అందిస్తున్నాయని హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ అనే అడ్వైజరీ సంస్థ తెలిపింది. బ్రిటన్, స్పెయిన్, గ్రీస్, ఆస్ర్టేలియా, కెనడా, ఇటలీ తదితర దేశాలు ‘గోల్డెన్ వీసా’లను అందిస్తున్నాయని పేర్కొంది. కాగా, గోల్డ్‌కార్డు వీసాను ఒక అద్భుతంగా ట్రంప్ అభివర్ణించారు. ‘ఇది గొప్పది. అద్భుతంగా ఉండనుంది. ఇది గ్రీన్‌కార్డు లాంటిది. ధనవంతులు, గొప్ప టాలెంట్ ఉన్నవారికి పౌరసత్వం కల్పించే ఒక మార్గం. వారు ధనవంతులు. చాలా డబ్బు వెచ్చిస్తున్నారు. చాలా పన్నులు చెల్లిస్తున్నారు. చాలామందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇది చాలా విజయవంతమవుతుందని నేను భావిస్తున్నాను’ అన్నారు.
కెనడాపై అమెరికా మరింత ఒత్తిడి
అమెరికా దాని ప్రధాన మిత్ర దేశాలతో కలిసి ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ కూటమి ‘ఫైవ్ ఐస్’ నుంచి కెనడాను బయటకు పంపించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ట్రంప్ సన్నిహితుడు, సలహాదారు పీటర్ నవ్రో ఇందుకు సంబంఽధించిన ప్రతిపాదన చేసినట్టు ఓ ఆంగ్ల పత్రిక కథనం పేర్కొంది. అమెరికాతో కెనడా విలీనమయ్యేలా ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా ఈ మేరకు ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆంగ్ల పత్రిక కథనాన్ని పీటర్ ‘నాన్సెన్స్’ అంటూ కొట్టిపారేశారు. ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ కూటమిలో బ్రిటన్, ఆస్ర్టేలియా, న్యూజిలాండ్ కూడా ఉన్నాయి. మరోవైపు, రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు తమ మద్దతు ఉంటుందని కెనడా ప్రధాని ట్రూడో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా కొత్తగా మిలిటరీ సాయాన్ని పంపినట్టు వెల్లడించారు. శాశ్వత శాంతి కోసం పోరాటంలో ఒంటరిగా గెలువలేమన్నారు. పాశ్చాత్య ఆంక్షలను తప్పించుకునేందుకు, అక్రమంగా రష్యా ఆయిల్‌ను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేందుకు వాడే రష్యా ‘షాడో ఫ్లీట్’పై కొత్త ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు, ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజ వనరుల వినియోగంపై ఒప్పందం చేసుకొనేందుకు ఈ శుక్రవారం ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వైట్ హౌస్‌కు రానున్నారని ట్రంప్ బుధవారం వెల్లడించారు.
మస్క్ కెనడా పౌరసత్వం రద్దుకు పిటిషన్
ట్రంప్ సన్నిహితుడు డోజ్ సారథి ఎలాన్ మస్క్ కెనడా పౌరసత్వంతోపాటు పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పార్లమెంటరీ పిటిషన్‌పై కెనడా పౌరులు, నివాసితులు పెద్ద ఎత్తున సంతకాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పిటిషన్‌పై 2.50 లక్షలకు పైగా మంది సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. కెనడా ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా మస్క్ చర్యలు ఉన్నట్టుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ టెక్ బిలియనీర్‌కు దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా పౌరసత్వాలు ఉన్నాయి.
భారతీయులపై కెనడా వీసా నిబంధనల తీవ్ర ప్రభావం
విదేశాల నుంచి వలసల నియంత్రణకు కెనడా చేపట్టిన చర్యలు భారతీయ విద్యార్థులు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. విదేశాంగ మంత్రిత్వశాఖ గణాంకాల మేరకు సుమారు 4.27 లక్షల మంది భారతీయ విద్యార్థులు కెనడాలో చదువుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చిన కెనడా నూతన వలస నిబంధనల ప్రకారం వివిధ కారణాలతో స్టడీ, వర్క్ పర్మిట్లు, ఈటీఏ(ఎలక్ర్టానిక్ ట్రావెల్ ఆథరైజేషన్)లను ఇమ్మిగ్రేషన్ అధికారులు రద్దు చేయొచ్చు. ఈ నిబంధనల ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినా, క్రిమినల్ రికార్డు ఉన్నా వీసా రద్దు చేస్తారు. అలాగే, ఆ వ్యక్తి అధికారిక నివాస గడువు ముగిసినా కెనడాను వీడరని ఎవరైనా అధికారి భావిస్తే అలాంటి వ్యక్తి వీసాను రద్దు చేస్తారు. పత్రాలు పోయినా, చోరీ అయినా, పరిపాలనా లోపంతో జారీ అయినా వీసా రద్దు చేస్తారు.
Updated Date - Feb 27 , 2025 | 05:34 AM