ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Trump-Zelensky Clash: నీ ఆట ముగిసింది.. జెలెన్‌స్కీకి ట్రంప్ మాస్ వార్నింగ్

ABN, Publish Date - Mar 01 , 2025 | 05:35 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య శ్వేతసౌధంలో తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. శుక్రవారం ఇరువురు నేతలు ఓవల్‌ ఆఫీసులో 45 నిమిషాల పాటు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

Trump-Zelenskyy
  • కోట్లాది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావ్‌.. అమెరికాను అగౌరవపరిచావ్‌

  • మూడో ప్రపంచ యుద్ధం వస్తే నీ వల్లే!.. జెలెన్‌స్కీపై భగ్గుమన్న ట్రంప్‌, వాన్స్‌

  • శ్వేతసౌధంలో విలేకరుల ముందే అమెరికా, ఉక్రెయిన్‌ అధ్యక్షుల వాగ్వాదం

  • నేను మొదటి నుంచీ ఒంటరిగానే పోరాడుతున్నా

  • మీకు కాదు.. అమెరికా ప్రజలకు ధన్యవాదాలు: జెలెన్‌స్కీ

  • ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే వెళ్లిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు


వాషింగ్టన్‌, ఫిబ్రవరి 28: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య శ్వేతసౌధంలో తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. శుక్రవారం ఇరువురు నేతలు ఓవల్‌ ఆఫీసులో 45 నిమిషాల పాటు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకదశలో జెలెన్‌స్కీపై ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు కోట్లాది మంది ప్రజల ప్రాణాలతో జూదం ఆడుతున్నారు’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అమెరికాను అగౌరవపరిచారని మండిపడ్డారు. అమెరికా శాంతి నిబంధనలకు అంగీకరించాలని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ వ్యాఖ్యలకు జెలెన్‌స్కీ సమాధానం ఇచ్చిన తర్వాత నేతల మధ్య ఈ గొడవ మొదలైంది. జెలెన్‌స్కీ సమాధానం ఇవ్వబోగా.. ‘మీకు మాట్లాడడానికి అనుమతి లేదు’ అని ట్రంప్‌ అన్నారు. దానికి జెలెన్‌స్కీ.. యుద్ధం మొదలైనప్పుడు తాము ఒంటరిగానే ఉన్నామని బదులిచ్చారు.


ఇద్దరు నేతల మధ్య సంభాషణ ఇలా..

ట్రంప్‌: మీ దగ్గర మా సైనిక సంపత్తి లేకపోతే యుద్ధం 2 వారాల్లోనే ముగిసేది..

జెలెన్‌స్కీ: రష్యా అధ్యక్షుడు మూడు రోజుల్లోనే ముగిసేదన్నారు. ఇప్పుడు అది రెండు వారాలైంది.

ట్రంప్‌: మీ దేశం భారీ కష్టాల్లో ఉంది. ఈ యుద్ధం మీరు గెలవబోవడం లేదు. ఇప్పటికైనా బయటపడే అవకాశాలు ఉన్నాయంటే అది మా వల్లే.

వాన్స్‌: మీ దేశ వినాశనాన్ని అడ్డుకోవాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమెరికా ఓవల్‌ ఆఫీసుకు వచ్చి మా ప్రభుత్వం మీద దాడి చేయడం గౌరవప్రదంగా ఉందని భావిస్తున్నావా? మేం చేస్తున్న ప్రయత్నాలకు కచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి.

జెలెన్‌స్కీ: నేను అమెరికా ప్రజలకు ధన్యవాదాలు చెప్పాను.

ట్రంప్‌: మీ దగ్గర ఆట కొనసాగించడానికి పేకల్లేవు. మా వల్లే ఇన్నాళ్లు ఆడగలిగావు. మీరు కోట్లాది మంది ప్రజల ప్రాణాలతో జూదం ఆడుతున్నారు. మూడో ప్రపంచ యుద్ధంతో ఆటలు ఆడుతున్నారు.

జెలెన్‌స్కీ: నేనే కార్డులూ ఆడడం లేదు.

ట్రంప్‌: మీరు అమెరికాను అగౌరవపరుస్తున్నారు. మీరు మాతో ఆడుకోలేరు. ఇప్పటికే చాలా మాట్లాడారు. ఇక ఆపండి.

ఇరువురు నేతల మధ్య తీవ్ర వాగ్వాదంతో ప్రెస్‌మీట్‌ మధ్యలోనే జెలెన్‌స్కీ వెళ్లిపోయారు. ఓవెల్‌ ఆఫీసులో అమెరికా అధ్యక్షుడు, మరో దేశాధ్యక్షుడి మధ్య జరిగిన అతిపెద్ద వాగ్వాదం ఇదే కావడం విశేషం.


తొలుత సాదర స్వాగతం..

తొలుత శ్వేతసౌధంలో జెలెన్‌స్కీకి ఎదురెళ్లి మరీ ట్రంప్‌ ఆహ్వానం పలికారు. ఇద్దరూ కరచాలనం చేసుకొని లోనికి వెళ్లారు. రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలంటే ఉక్రెయిన్‌ చాలా విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుందని ట్రంప్‌ చెప్పారు. అవసరమైతే కొంత భూభాగాన్ని కూడా రష్యాకు ఇవ్వాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. రాజీలు లేకుండా ఎలాంటి ఒప్పందాలూ జరగవని స్పష్టం చేశారు. అమెరికన్‌ కంపెనీలకు ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజ వనరులను అప్పగించే ఒప్పందంపై సంతకం చేయాలన్నారు. భవిష్యత్తులో అమెరికా మద్దతు అనేది దీనిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ షరతుపై జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాలకు సంబంధించిన ఒప్పందంతో ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు చేకూరుతుందని ట్రంప్‌ అన్నారు. అయితే పుతిన్‌ ఓ హంతకుడని, ఆయనతో రాజీ పడే ప్రసక్తే లేదని జెలెన్‌స్కీ చెప్పారు. యుద్ధ సమయంలో రష్యా సైనికుల అకృత్యాలకు సంబంధించిన ఫొటోలను ట్రంప్‌కు చూపించారు.


రాజీ ప్రసక్తే లేదు

‘మా భూమి కోసం హంతకుడితో ఎలాంటి రాజీ పడబోం’ అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్‌ తమవైపే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ట్రంప్‌ స్పందిస్తూ.. తాను శాంతిదూతగా గుర్తుండిపోవాలని ఆశిస్తున్నానన్నారు. ‘‘నేను ఇదంతా చేస్తున్నది ప్రాణాలను కాపాడేందుకే తప్ప మరో కారణం లేదు. ఇలాగే వదిలేస్తే మూడో ప్రపంచ యుద్ధానికి వెళుతుంది. వ్యవహారం తప్పుడు దారిలో వెళుతోంది’’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఓవల్‌ ఆఫీసులో తీవ్ర వాగ్వాదం అనంతరం జెలెన్‌స్కీ ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే వెళ్లిపోయారు. కాగా, జెలెన్‌స్కీకి శాంతి చర్చలు ఇష్టం లేదంటూ ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘దీన్ని నేను ఒక అవకాశంగా మలచుకోవాలని కోరుకోవడం లేదు. నేను శాంతినే కోరుకుంటున్నా. ఆయన శాంతికి సిద్ధమైతే తిరిగి రావచ్చు’’ అని పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

ఈయూపై 25% సుంకం విధిస్తాం

చంద్రుడిపైకి డ్రోన్‌

మేలో స్కైప్‌ మూసివేత: మైక్రోసాఫ్ట్‌

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2025 | 11:43 AM