H-1B Visa: చెదురుతున్న అమెరికా కలలు!
ABN, Publish Date - Jan 03 , 2025 | 06:23 AM
అమెరికా చదువులు ఉద్యోగ భరోసాకు, శాశ్వత నివాసానికి బాటలు వేస్తాయన్న ధీమా క్రమంగా బలహీనపడుతోంది.
97వేల మంది భారతీయ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం
హెచ్-1బీ వీసాకు కీలకమైన ఓపీటీపై అమెరికన్ల నిరసనలు
న్యూఢిల్లీ, జనవరి 2: అమెరికా చదువులు ఉద్యోగ భరోసాకు, శాశ్వత నివాసానికి బాటలు వేస్తాయన్న ధీమా క్రమంగా బలహీనపడుతోంది. హెచ్-1బీ వీసా జారీకి కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగామ్‌పై అమెరికన్లలో పెరుగుతున్న వ్యతిరేకత విదేశీ విద్యార్థులపై ప్రత్యేకించి భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఓపీటీని రద్దు చేయాలని ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం అమెరికన్ల ఉద్యోగాలను విదేశీ విద్యార్థులు పొందడానికి అనుమతించే లొసుగని మండిపడుతున్నారు.
ఓపీటీ రద్దుపై రాబోయే ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అమెరికాలో చదువుతున్న 97వేల మందికి పైగా భారతీయ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎఫ్-1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన రంగాల్లో 12 నెలల వరకూ పని చేయడానికి ఓపీటీ ప్రోగ్రామ్ అనుమతిస్తుంది. స్టెమ్ (ఎస్‌టీఈఎం) గ్రాడ్యుయేట్లు ఈ వ్యవధిని అదనంగా మరో 24 నెలలు పొడిగించుకోవడం ద్వారా మూడేళ్ల వరకూ అమెరికాలో ఉండి పని అనుభవం పొందే అవకాశం ఉంది. హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ పని అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నైపుణ్యం కలిగిన విదేశీయులు మరో ఆరేళ్ల పాటు అమెరికాలో ఉండటానికి ఈ వీసా అనుమతిస్తుంది.
Updated Date - Jan 03 , 2025 | 06:23 AM