Pope Health: మరింత క్షీణించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి..వెంటిలేటర్ పై చికిత్స..
ABN, Publish Date - Mar 01 , 2025 | 09:03 PM
Pope Health: రోమ్ జెమెల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 14న ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం రెండు రోజులుగా మెరుగుపడుతుందని వైద్యులు చెప్పగా.. ఇప్పుడు పరిస్థితి మాత్రం వేరేలా ఉంది.
Pope Francis Health in Critical Condition: పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పోప్ ఫ్రాన్సిస్‌కు తీవ్రమైన దగ్గు వచ్చింది. వాంతులు కూడా అయ్యాయి. దీని కారణంగా ఆయన ఊపిరితిత్తుల పనితీరు మరింత క్షీణించింది. వెంటనే వైద్యులు మెకానికల్ వెంటిలేషన్‌ను అందించారు. అయినప్పటికీ, ఆయన పూర్తి స్పృహతోనే ఉన్నారని, ఆక్సిజన్ మాస్క్ సహాయంతో శ్వాస తీసుకుంటున్నారని వాటికన్ అధికారులు తెలిపారు. వైద్యులు ఇప్పుడు మరో 24 నుంచి 48 గంటల పాటు అతని ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు.
పోప్ ఫ్రాన్సిస్‌కు ఎప్పటి నుంచో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి ఉంది. ఇటీవల బాక్టీరియల్ బ్రాంకైటిస్ కారణంగా సోకిన నిమోనియాతో ఆసుపత్రిలో చేరారు. కానీ వైద్యం అందుకుంటూ కోలుకుంటున్నారని భావించిన సమయంలో తాజాగా శ్వాసకోశ సమస్యలు పెరగడం వైద్యులను ఆందోళనకు గురిచేసింది. శ్వాస సంబంధిత అత్యవసర చికిత్సల నిపుణుడైన డాక్టర్ జాన్ కోల్మన్ ప్రకారం, "పోప్ వయస్సును, గత వైద్య చరిత్రను చూస్తే, ఈ పరిస్థితి చాలా తీవ్రమైనదే. ఈ స్థితిలో ఊహించని మార్పులు రావచ్చు. అందుకే ఇది అత్యంత ఆందోళనకరమైన పరిణామం," అని అన్నారు. మరో వైద్య నిపుణుడు డాక్టర్ విలియం ఫెల్డ్మాన్ కూడా పోప్ స్పృహలో ఉన్నా.. ఇటువంటి సమస్య తలెత్తడం కఠిన పరిణామమేనని వ్యాఖ్యానించారు.
అయితే, పోప్ ఫ్రాన్సిస్ తన ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా తన పనులు కొనసాగిస్తున్నారు. వాటికన్ తన అధికారిక పత్రాలపై "జెమెల్లి పాలీక్లినిక్ నుంచి" అనే కొత్త ట్యాగ్‌తో పోప్ సంతకం చేసిన పత్రాలను విడుదల చేసింది. ఇది ఆసుపత్రిలోనే ఆయన తన విధులను కొనసాగిస్తున్నట్లు తెలియజేస్తుంది. మరోవైపు పోప్ ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్నారు.
Read Also : Picture Puzzle: మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో తేడాగా ఉన్న పిల్లిని 5 సెకెన్లలో కనుక్కోండి..
EU Bans Caffine : 27 దేశాల్లో కెఫీన్ వాడకం నిషేధం.. బాంబు పేల్చిన EU..
Updated Date - Mar 01 , 2025 | 09:06 PM