Donald Trump : బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు
ABN, Publish Date - Jan 21 , 2025 | 04:27 AM
గండరగండడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ఆశీను డయ్యారు. పలు ఎగుడుదిగుళ్లు చూసిన రాజకీయ జీవితంలో పలుమార్లు పదవీచ్యుతి ప్రయత్నాలను, పలు నేరారోపణలను, త్యాయత్నాలను అధిగమించి మరోసారి శ్వేతసౌధం అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.
కొన్ని గంటల్లోనే చేసేస్తా.. స్వర్ణయుగం ఆరంభమైంది
అమెరికా మళ్లీ గొప్ప దేశంగా మారబోతోంది.. అందుకే దేవుడు నన్ను బతికించాడు
అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తా.. మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా..
దేశంలో ఇక ఆడ, మగ రెండే జెండర్లు.. డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగ భరిత ప్రసంగం
47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత ప్రమాణం.. ప్రపంచ దేశాల అతిరథమహారథులు హాజరు
వాషింగ్టన్ డీసీ, జనవరి 20: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక, టెక్ దిగ్గజాలు, అతిరథ మహారథుల సమక్షంలో సోమవారం క్యాపిటల్ బిల్డింగ్‌లో జరిగిన వేడుకలో రిపబ్లికన్ నేత 47వ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నవంబరులో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 78 ఏళ్ల ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. 1861లో అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉపయోగించిన బైబిల్‌ను చేతిలో పట్టుకొని ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్‌లో తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో క్యాపిటల్ బిల్డింగ్ లాన్‌లో వేడుకగా జరగాల్సిన కార్యక్రమాన్ని లోపల హాల్లోకి మార్చారు. బయట సాంస్కృతిక కార్యక్రమాలు, మిలిటరీ పరేడ్ యథావిధిగా సాగాయి. ప్రమాణస్వీకారం సందర్భంగా, అంతకుముందు అభిమానులతో ర్యాలీలో ట్రంప్ ఉత్సాహభరితంగా ప్రసంగించారు. ఈ క్షణం నుంచి అమెరికా స్వర్ణయుగం ప్రారంభమైందని ప్రకటించారు. మళ్లీ అమెరికా గొప్ప దేశం అవుతుందని భరోసా ఇచ్చారు. ప్రపంచం మొత్తం అమెరికాను చూసి కుళ్లుకుంటుందని మద్దతుదారుల హర్షద్వానాల మధ్య వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపై జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్ గుర్తు చేసుకున్నారు.
బుల్లెట్ తన చెవిని చీల్చుకుంటూ వెళ్లిందని, అమెరికాను మళ్లీ గొప్పదేశంగా మార్చే గొప్ప కార్యాన్ని నెరవేర్చడానికే దేవుడు తనను రక్షించాడని ట్రంప్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా భారీ నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. వలసలపై భారీ ఎత్తున నియంత్రణలు పెడతామని, అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని వ్యాఖ్యానించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న లక్షల మంది నేరగాళ్లను వెంటనే వెళ్లగొడతామన్నారు. చమురు తవ్వకం మీద బైడెన్ నిర్ణయాలను తిరగదోడతామని ప్రకటించారు. మెక్సికో సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తామని, సాయుధ బలగాలను మోహరిస్తామని చెప్పారు. సరిహద్దు దాటి వచ్చి ఆశ్రయం కోరేవారు ఇక నుంచి కోర్టు విచారణ తేదీ వచ్చేవరకు సరిహద్దుల్లోనే ఉండే విధంగా పాత విధానాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వ్యక్తులకు అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ప్రస్తుతం ఆటోమాటిక్ పౌరసత్వం ఇస్తున్నారని, దాన్ని ఎత్తేస్తామని అన్నారు. మంగళవారం సూర్యుడు అస్తమించే సమయానికి అమెరికాపై జరుగుతున్న దాడి ఆగిపోతుందని వ్యాఖ్యానించారు.
నాలుగేళ్ల అమెరికా పతనానికి తెర పడిందని తక్షణమే తెర పడిందని చెప్పారు. క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసుల్లో దోషులు/అభియోగాలు ఎదుర్కొంటున్న 1500 మందికి పైగా బాధితులకు ఉపశమనం కల్పిస్తానని పునరుద్ఘాటించారు. ఓవల్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోపే బైడెన్ సర్కారు తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలను రద్దు చేస్తానని వెల్లడించారు. ఆయన ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాలూ అమలు కాకుండా చూస్తానని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలుకుతానని ట్రంప్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలనూ అదుపు చేస్తానన్నారు. మూడో ప్రపంచ యుద్ధంగా రాకుండా అడ్డుకుంటానని స్పష్టం చేశారు. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తానని ట్రంప్ చెప్పారు. దేశంలో ఆడ, మగ రెండు జెండర్‌లు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. జాన్ ఎఫ్ కెనడీ, రాబర్ట్ ఎఫ్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య కేసు ఫైళ్లను బహిర్గతం చేస్తానని తెలిపారు. ప్రభుత్వంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు రాబోయే రోజుల్లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తానని వెల్లడించారు. బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే పాలనాపరమైన అనేక ఆదేశాలు జారీ చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. 250 ఏళ్ల అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు ఎదుర్కోనన్ని పరీక్షలను తాను ఎదుర్కొన్నానని చెప్పారు.
భారీ ర్యాలీ.. డ్యాన్స్ చేసిన ట్రంప్!
ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వాషింగ్టన్ డీసీలో ఆదివారం నిర్వహించిన ఈ ర్యాలీలో ట్రంప్ తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(ఎంఏజీఏ) షర్టులు ధరించిన వేల మంది ట్రంప్ అభిమానులు దేశం నలు మూలల నుంచి వాషింగ్టన్‌కు వచ్చి వర్షం, మంచును లెక్క చేయకుండా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. తాను ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చుతానని ప్రకటించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటానని, అమెరికా ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మాగా ర్యాలీలో కళాకారులు వైఎంసీఏ పాటను పాడుతూ నృత్యం చేశారు. బ్యాండ్ సభ్యులు డ్యాన్స్ చేస్తుండగా.. ట్రంప్ కూడా తనదైన శైలిలో స్టెప్పులు వేశారు. ఆయన డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. బ్యాండ్ సభ్యులు ట్రంప్‌తో కరచాలనం చేశారు. 1970వ దశకానికి చెందిన డిస్కో పాట (వైఎంసీఏ)కు ట్రంప్ ప్రచారంలో భాగంగా నిర్వహించే మాగా ర్యాలీల్లో విశేష ప్రాధాన్యం దక్కింది. ఈ ర్యాలీలో ట్రంప్‌తో పాటు దిగ్గజ పారిశ్రామికవేత్త, టెస్లా, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నారు. తన కుమారుడితో కలిసి వేదికపైకి వచ్చిన మస్క్.. కొన్ని శతాబ్దాల పాటు అమెరికాను పటిష్ఠ దేశంగా ఉంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
చివరి గంటల్లో జో బైడెన్ క్షమాభిక్షలు
అమెరికా అధ్యక్ష పదవీకాలం మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా జోబైడెన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ట్రంప్‌ను విమర్శించిన అమెరికా వైద్య నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె తదితరులకు ముందస్తు క్షమాభిక్ష ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులకూ ఉపశమనం కలిగించారు.
ప్రధాని ప్రత్యేక దూతగా హాజరైన జైశంకర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ ప్రత్యేక దూతగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జయ్‌శంకర్ హాజరయ్యారు. ట్రంప్‌ను అభినందిస్తూ ప్రధాని రాసిన లేఖను వెంట తీసుకెళ్లారు. మరోవైపు ప్రధాని మోదీ తన ‘ప్రియమిత్రుడు’ ట్రంప్‌నకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రపంచానికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, రెండు దేశాలకు మేలు చేయడానికి, మరోసారి మీతో సన్నిహితంగా కలిసి పనిచేయాలని ఎదురు చూస్తున్నా’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ట్రంప్ ప్రమాణ స్వీకార వేడుకకు ఇతర మాజీ అధ్యక్షులతో పాటు బరాక్ ఒబామా హాజరైనప్పటికీ ఒబామా మిచెల్లీ ఒబామా రాలేదు. ట్రంప్ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న నేతలతో పాటు వివేక్ రామస్వామి, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్ తదితరులు పాల్గొన్నారు.
ట్రంప్‌కు బైడెన్ స్వాగతం
ఉదయమే వైట్‌హౌ్‌సకు వచ్చిన ట్రంప్‌కు దిగిపోతున్న అధ్యక్షుడు బైడెన్ సాదర స్వాగతం పలికి, తేనీటి విందు ఇచ్చారు. తెలుగింటి అల్లుడు, కొత్త ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు తమిళ ఇంటి ఆడపడుచు, దిగిపోతున్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సాదరస్వాగతం పలికారు. జేడీ వాన్స్ వెంట ఆయన సతీమణి ఉష చిలుకూరి కూడా ఉన్నారు. ట్రంప్ వెంట ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ఉన్నారు. ట్రంప్ భార్యబుగ్గపై ముద్దు పెట్టుకొనే ప్రయత్నం చేయగా ఆమె హ్యాట్ అడ్డం రావడంతో ఆగిపోయారు. శ్వేతసౌధంలో విందు అనంతరం ట్రంప్ భైడెన్‌తో కలిసి ఒకే వాహనంలో ప్రమాణ స్వీకారానికి వెళ్లారు.
Updated Date - Jan 21 , 2025 | 06:13 AM