Israeli Veterans Demand: ఇజ్రాయెల్‌లో యుద్ధ వ్యతిరేకత
ABN, Publish Date - Aug 05 , 2025 | 06:01 AM
హమాస్‌తో తమదేశం చేస్తున్న యుద్ధం నిలిచిపోవాలని ఇజ్రాయెల్‌కు చెందిన ఆరువందలమంది రిటైర్డ్ సీనియర్ భద్రతాధికారులు, సైనికాధికారులు కోరుకున్నారట. యుద్ధం ఆపేయమని మా బెంజమిన్ నెతన్యాహూకు...
హమాస్‌తో తమదేశం చేస్తున్న యుద్ధం నిలిచిపోవాలని ఇజ్రాయెల్‌కు చెందిన ఆరువందలమంది రిటైర్డ్ సీనియర్ భద్రతాధికారులు, సైనికాధికారులు కోరుకున్నారట. యుద్ధం ఆపేయమని మా బెంజమిన్ నెతన్యాహూకు చెప్పండి అంటూ అమెరికా అధ్యక్షుడికి 550 మంది మాజీ ఉన్నతాధికారులు ఓ లేఖ రాశారు. మాజీ ప్రధాని ఇహూద్ బరాక్, మాజీ సైన్యాధ్యక్షులు, మొసాద్ మాజీ అధినేతలు, రక్షణమంత్రులు, పోలీస్ చీఫ్‌లు కలిసి విడుదల చేసిన విడియో కూడా ఒకటి మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నది. హమాస్ ఇక ఎంతమాత్రం ఇజ్రాయెల్ ఉనికికి ప్రమాదకరం కాదని, యుద్ధం కొనసాగించడం ద్వారా ఇజ్రాయెల్ తన గౌరవాన్ని కోల్పోతున్నదని వీరి వాదన. 23 నెలలుగా జరుగుతున్న యుద్ధం ఆగనిపక్షంలో దేశభద్రతకు మంచిదికాదని వారు అభిప్రాయపడుతున్నారు. మొసాద్ మాజీ అధినేత ఒకరు మనం ఓటమి అంచున ఉన్నామని కూడా వ్యాఖ్యానించారు.
ప్రపంచం మనల్ని తప్పుపడుతోంది, మన పాపాలను గమనిస్తోంది అంటూ గాజా మృత్యుఘోషపట్ల వీరు సానుభూతి వెలిబుచ్చారు. యుద్ధం ఎందుకు ఆరంభమైందో, ఆ లక్ష్యం పరిపూర్ణమైందని, ఇంకా ఎందుకు కొనసాగుతోందన్నది అర్థంలేని, అర్థంకాని అంశమని వారంటున్నారు. తన పదవిని కాపాడుకోవడానికి, తనమీద ఉన్న కేసులను కదలకుండా చేయడానికీ నెతన్యాహూ యుద్ధం కొనసాగిస్తున్నాడన్న విమర్శ ఎంతోకాలంగా ఉన్నదే. ఇప్పుడు వీరి విడియోలు, లేఖలు మరింత ఒత్తిడిపెంచేందుకు ఉపకరిస్తాయి. సుదీర్ఘయుద్ధంతో ఐడీఎఫ్ బలగాలు నిరాశానిస్పృహల్లోకి జారిపోయాయని, విసుగుచెంది, డస్సిపోయి ఉన్న బలగాలు కూడా యుద్ధం ఆగిపోవాలని ఆకాంక్షిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.
హమాస్ దగ్గర బందీలుగా ఉన్న తమవారు ఎంతటి ఘోరమైన స్థితిలో ఉన్నారో ఇటీవలి విడియోల్లో ఇజ్రాయెలీలు చూశారు. హమాస్‌ను దుంపనాశనం చేయడం, బందీలను విడిపించడం లక్ష్యంగా యుద్ధం కొనసాగిస్తున్నట్టు నెతన్యాహూ చెప్పుకుంటారు. కానీ, హమాస్ తీవ్రంగా దెబ్బతిన్నదేకానీ, తుడిచిపెట్టేయడం మాత్రం నెతన్యాహూ తరంకాలేదు. తన వద్ద ఉన్న బందీల్లో కొందరిని హమాస్ తనకుతానుగా అప్పగించడం వినా, ఇజ్రాయెల్ వారిని విడిపించిందేమీ లేదు. ఈ నేపథ్యంలో, అత్యంత దుర్భరమైన పరిస్థితుల మధ్య, ఎముకలగూళ్ళుగా మారిన శరీరాలతో ఇజ్రాయెలీ బందీలున్న విడియోలు, చిత్రాలు వెలుగుచూసి నెతన్యాహూను ఆత్మరక్షణలో పడేశాయి. తమవారిని హమాస్‌కు బలిపెడుతున్నాడన్న బంధుజనం విమర్శలు తీవ్రమైనాయి. తక్షణమే యుద్ధాన్ని ఆపివేసి, బందీలను విడిపించి తేవాలంటూ పలుచోట్ల ప్రదర్శనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే, అమెరికా అధ్యక్షుడికి లేఖలు, నెతన్యాహూ మీద విమర్శలు తిరిగి మొదలైనాయి.
గాజాలో సాగుతున్నది నరమేధం కాదంటున్నారు ట్రంప్. కాల్పుల విరమణ పకడ్బందీగా అమలు జరుగుతూ, బందీల అప్పగింతల ప్రక్రియ సాఫీగా సాగుతున్నదశలో, గాజాను ఒక అద్భుతమైన రిసార్టుగా మార్చేయాలన్న ట్రంప్ కలనెరవేర్చడంకోసం నెతన్యాహూ తిరిగి ఊచకోత ఆరంభించిన విషయం తెలిసిందే. చివరకు ఆకలిని కూడా ఆయుధంగా వాడి ఒక్కప్రాణికూడా అక్కడ ఉండకూడదన్న లక్ష్యంతో ఇద్దరూ పనిచేస్తున్నారు. పసికందులనుంచి వృద్ధులవరకూ అందరినీ ఆకలి మింగేస్తున్నది. అన్నంకోసం నిలబడినవారు క్యూలైన్లలోనే కన్నుమూస్తున్నారు. ఆహారంకోసం ఎదురుచూస్తున్నవారినీ, ఎగబడినవారినీ ఇజ్రాయెల్ నిర్దాక్షిణ్యంగా చంపుతోంది. ఆహారపంపిణీ కేంద్రాల వద్ద తొక్కిసలాటలు, కాల్పుల్లో వందలాదిమంది మరణిస్తున్నారు. ఒకపక్క ఆకలిచావులు, మరోవైపు బందీల విడుదల ఇజ్రాయెల్ మీద తీవ్రమైన ఒత్తిడిపెంచుతున్నాయి. హమాస్ వద్ద ఇంకా మిగిలివున్న యాభైమందిలో 20మంది సజీవంగా ఉండివుంటారని అంచనా. ఈ నేపథ్యంలో, ట్రంప్ ప్రతిపాదించిన 60 రోజుల కాల్పుల విరమణ, ఆయుధాల అప్పగింత, బందీల విడుదల ఇత్యాది అంశాలను హమాస్ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇజ్రాయెల్ సైన్యాలు వెనక్కుపోవడం నుంచి పాలస్తీనా రాజ్యం స్థాపనవరకూ అది చాలా డిమాండ్లు ముందుకు తెస్తోంది. ఒప్పందానికి సిద్ధమని అంటూనే ఇరుపక్షాలూ రాజీపడకపోవడంతో చర్చలు కదలడం లేదు. ఈ ప్రతిష్ఠంభన తొలగనంతవరకూ గాజాలో కరువు, ఆకలిచావులకు ముగింపు ఉండదు.
ఈ వార్తలు కూడా చదవండి..
అరెస్ట్ చేయొచ్చు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
వారిపై చర్యలకు కాళేశ్వరం కమిషన్ కీలక సిఫార్స్
For More AP News and Telugu News
Updated Date - Aug 05 , 2025 | 06:01 AM