ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh Politics: బంగ్లా పయనమెటు

ABN, Publish Date - Aug 08 , 2025 | 12:54 AM

బంగ్లాదేశ్‌ను సుదీర్ఘకాలం ఏలిన షేక్‌హసీనాను దేశం నుంచి వెళ్ళగొట్టి ఏడాది అయింది. ప్రాణానికే ప్రమాదం వాటిల్లే పరిస్థితుల మధ్య, తట్టాబుట్టా సర్దుకొని, ఢాకాలో ఒక సైనిక...

బంగ్లాదేశ్‌ను సుదీర్ఘకాలం ఏలిన షేక్‌హసీనాను దేశం నుంచి వెళ్ళగొట్టి ఏడాది అయింది. ప్రాణానికే ప్రమాదం వాటిల్లే పరిస్థితుల మధ్య, తట్టాబుట్టా సర్దుకొని, ఢాకాలో ఒక సైనిక హెలికాప్టర్‌లో బయలుదేరి, ఢిల్లీ సమీపంలోని హిండన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో గత ఏడాది ఆగస్టు 5న ఆమె దిగారు. ప్రజాస్వామ్యం పట్ల వీసమెత్తు గౌరవం లేని ఒక నియంతను ఇలా ప్రాణభయంతో పరుగులెత్తించినందుకు బంగ్లాదేశ్‌ విద్యార్థి ఉద్యమకారులు సంతోషించారు. పదిహేనేళ్ళు ఏకధాటిగా ఏలిన, అవధులులేని అధికారవాంఛ గల క్రూరురాలిని దేశం నుంచి తరిమికొట్టినందుకు గర్వించారు. ఆమెలేని దేశం ఇక విలువలతో వెలిగిపోతుందనీ, ప్రజాస్వామ్యం వేళ్ళూనుకుంటుందని బలంగా విశ్వసించారు, భవిష్యత్తుకోసం కలలుకన్నారు. మరి, అంతటి తిరుగుబాటు తరువాత, అన్ని వందలమంది ప్రాణత్యాగాల అనంతరం ఆశించిన దిశలోనే ఆ దేశం ప్రయాణం సాగుతోందా? ఒక తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటూ, ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో ఈ ప్రశ్న బేసబబుగా కనిపించవచ్చును. కానీ, ఏడాది కాలంగా బంగ్లాదేశ్‌ నడుస్తున్న దారిని గమనించినప్పుడు, ప్రశ్నలూ అనుమానాలే కాదు, తీవ్రమైన భయాలు కూడా కలుగుతున్నాయి. బంగ్లాదేశ్‌ను విస్ఫోటనానికి సిద్ధంగా ఉన్న దేశంగా ఒక సుప్రసిద్ధ మేధావి అభివర్ణించాడు. హసీనా దేశం విడిచిపోగానే, నేటికి సరిగ్గా ఏడాది క్రితం పారిస్‌ నుంచి మహ్మద్‌ యూనిస్‌ దేశరక్షకుడిగా తరలివచ్చారు. ఈ నోబెల్‌ విజేత రాకడ యావత్‌ ప్రపంచానికి బంగ్లాదేశ్‌ భవితవ్యంమీద నమ్మకాన్ని కలిగించింది. జూలై విప్లవం ఏ లక్ష్యం కోసం సాగిందో, ఆ ఆశయాలు, ఆదర్శాలకు అనుగుణంగా దేశాన్ని యూనిస్‌ నడిపిస్తారని అంతా నమ్మారు. కానీ, ఆ తిరుగుబాటుకు కొనసాగింపుగా చాలా దుర్మార్గాలు సాగాయి. తాత్కాలిక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా శాంతిభద్రతలను గాలికొదిలేసి, మూకదాడులను అనుమతించింది. అవామీలీగ్‌ ఓటర్లు, అభిమానులు అన్న ఆరోపణతో హిందువులమీద మతఛాందసులు విరుచుకుపడ్డారు.

అవామీలీగ్‌ నాయకులందరినీ జైళ్ళలోకి నెట్టివేయడమే కాక, హసీనా రాజకీయ ప్రత్యర్థి, బీఎన్‌పీ అధినేత ఖలీదాజియా మీద ఉన్న కేసులన్నీ రద్దుపరిచి జైలు నుంచి విడుదల చేయడం కూడా జరిగిపోయింది. హసీనా జైళ్ళలోకి నెట్టిన మత తీవ్రవాదులు తిరిగి రోడ్లమీదకు వచ్చేశారు. బంగ్లాదేశ్‌ పితామహుడు షేక్‌ ముజబూర్‌ రహ్మాన్‌ మూలాలూ గుర్తింపులను తుడిచిపెట్టడం లక్ష్యంగా ఆయన విగ్రహం నుంచి నివాసభవనం కూల్చివేతవరకూ ప్రతీదాన్నీ ప్రభుత్వమే అనుమతించింది. ఆయన చరిత్ర చెరిపివేయాలన్న కసిలో భాగంగా, బంగ్లా విముక్తిలో భారతదేశం పాత్ర కూడా పాఠ్యపుస్తకాలనుంచి చెరిగిపోయింది. పాకిస్థాన్‌కు ఏ మాత్రం నొప్పి కలగనిరీతిలో, ఏ పోరాటమూ, ఎవరి ప్రమేయమూ లేకుండానే బంగ్లాదేశ్‌ ఆవిర్భవించినట్టుగా చరిత్ర రచన సాగుతోంది. పాకిస్థాన్‌తో ఎన్నడూ లేనంత సాన్నిహిత్యమే కాక, సమస్తరంగాల్లోనూ సహకారం పెరిగింది. ఈ ఏడాదికాలంలో బ‍ంగ్లాదేశ్‌ ఆర్థికంగా బాగా దెబ్బతిన్నది. యూనిస్‌ ప్రభుత్వ వైఫల్యాలను, ఆలోచనా విధానాన్ని ప్రశ్నిస్తున్న వందలాదిమంది పాత్రికేయులు జైళ్ళకుపోయారు. నేరాలూ ఘోరాల పెరుగుదలతో పాటు, హసీనా వ్యతిరేక ఉద్యమంలో ముందువరుసలో ఉన్న విద్యార్థి నాయకులు దోపిడీలకు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఘటనలూ హెచ్చాయి. మతఛాందసత్వంతో మహిళలను కట్టిపడేసే కృషి జరుగుతోంది. హసీనామీద ఆగ్రహంతో ప్రభుత్వమే ప్రోత్సహించిన మూకదాడులకు ఇటీవల మాజీ ఎన్నికల ప్రధానాధికారి సైతం గురికావలసివచ్చింది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నట్టుగా యూనిస్‌ మంగళవారం చేసిన ప్రకటన, బంగ్లాదేశ్‌ తిరిగి గాడిన పడటానికి ఉపకరించవచ్చు. తాత్కాలిక ప్రభుత్వం కన్నా, ప్రజలు ఎన్నుకున్నవారు, ఎవరైనా కావచ్చు, అధికారంలో ఉండటంవల్ల కాస్తంత జవాబుదారీతనం ఉంటుంది. హసీనా పార్టీకి గుర్తింపు తొలగించి, ఎన్నికల బరిలో నిలవనివ్వకుండా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యంలో అక్కడ జరగబోయే ఎన్నికలు ప్రజాభీష్ఠాన్ని సంపూర్ణంగా ప్రతిఫలించవు. అయినప్పటికీ, తాము ఏ ఆశయాల కోసం హసీనాను గద్దెదింపామన్నది విద్యార్థి ఉద్యమకారులు విస్మరించకుండా, దేశం మతఛాందస శక్తులు, పార్టీల చేతిలోకిపోకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యం.

Updated Date - Aug 08 , 2025 | 12:54 AM