Gold Crossing 1 lakh: ఈ సంవత్సరం బంగారం ధర లక్ష మార్కు దాటుతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే
ABN, Publish Date - Mar 02 , 2025 | 01:03 PM
బంగారం ధరలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం ధర లక్ష మార్కు దాటుతుందా అన్న చర్చ మొదలైంది. దీనిపై మార్కెట్ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కేవలం దశాబ్ద కాలంలో 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర 25 వేల నుంచి రూ.84,300కు చేరుకుంది. దీంతో, ఈ ఏడాది బంగారం లక్ష మార్కు దాటుతుందా అన్న చర్చ మార్కెట్ వర్గాల్లో మొదలైంది.
2011 ఆగస్టులో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర 25 వేల మార్కును చేరింది. ఆ తరువాత 2020 జులైలో రూ.50 వేల మార్కును దాటింది. అంటే కేవలం, 108 నెలల్లో ధరలు రెట్టింపయ్యాయి. ఆ తరువాత మరో 48 నెలల్లో ధరలు రూ.75 వేల మార్కును కూడా దాటేశాయి. గతేడాది సెప్టెంబర్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.75 వేల మార్కును చేరుకుంది. ప్రస్తుతం రూ.85 వేల వద్ద తచ్చాడుతోంది. ఇక లక్ష మార్క చేరుకోవాలంటే ప్రస్తుత ధర 13.5 శాతం మేర పెరగాలి. దీంతో, బంగారం ధర ఈ ఏడాదిలోనే లక్ష మార్కు దాటుందా అన్న చర్చ ఊపందుకుంది. (Will Gold Cross Rs 1 lakh Mark).
UPI 3.0: యూపీఐ 3.0 కొత్త ఫీచర్లు ఇవేనా
అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడం, భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితి కారణంగా మార్కెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ట్రంప్ సుంకాల విధింపు కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీనికి తోడు అంతర్జాతీయ అనిశ్చితి ఇలాగే కొనసాగితే బంగారం ధరల పెరుగుదల ఇప్పట్లో ఆగదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ట్రంప్ సుంకాల కారణంగా మార్కెట్లలో అనిశ్చితి నెలకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో, పెట్టుబడిదారులు బంగారంవైపు మళ్లే అవకాశాలు పెరుగుతాయి. ఫలితంగా ధరలూ ఎగబాకుతాయి. వీటికి భౌగోళిక రాజకీయన అనిశ్చితులు, ఆర్థిక మందగమనం తోడైతే పసిడి ధరలు కొత్త పుంతలు తొక్కడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ వాదనతో విభేదించేవారూ ఉన్నారు. ట్రంప్ సుంకాల భయాల కారణంగా ఇప్పటికే ధరలు పెరగవలిసినంత పెరిగాయని, కాబట్టి, లక్ష మార్కు దాటే అవకాశాలు తక్కువని అంచనా వేస్తున్నారు. కొత్త అనిశ్చితులు ఏమైనా తలెత్తితే తప్ప పసిడి ధర భారీగా పెరిగే అవకాశం తక్కువని అంటున్నారు.
Commerical Gas Cylinder Price Hike: మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు.. ఏ మేరకు పెరిగిందంటే..
ఇక ట్రంప్‌ల సుంకాలతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కూడా బంగారం ధరలు ప్రభావితం చేస్తాయి. ఇప్పటివరకూ ఫెడరల్ రిజర్వ్ రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లలో కోత ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు బదులుగా వడ్డీ రేట్లు పెరిగినా పెరగొచ్చని అంటున్నాయి. వడ్డీ రేటు పెరిగే డాలర్‌పై పెట్టుబడులు ఆకర్షణీయంగా మారి బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి, బంగారం ధరలు పెరగాలంటే వడ్డీ రేట్లు తగ్గాలి. దీంతో, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంపై అంతా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గే సూచనలైతే కనిపించట్లేదు. దీనికి తోడు ట్రంప్ సుంకాల కారణంగా డాలర్ మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువని ట్రేడ్ పండితులు అంచానా వేస్తున్నారు. అయితే, బంగారం ధరలు ఎలా ఉన్నప్పటికీ సాధారణ మదుపర్లు తమ పెట్టుబడులను వివిధ మార్గాల్లోకి మళ్లించడమే శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - Mar 02 , 2025 | 02:26 PM