Village Elders: టీడీపీకి ఓటేశారని వెలేశారు
ABN, Publish Date - Jan 03 , 2025 | 06:07 AM
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలో కుల పెద్దలు నిర్ణయించారు. వారి నిర్ణయానికి వ్యతిరేకంగా తమ అభీష్టానికి అనుగుణంగా, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించిన ఏడు కుటుంబాలపై గ్రామ పెద్దలు కన్నెర్న చేశారు.
ఉప్పుమిల్లిలో వైసీపీ పెద్దల అరాజకీయం
బహిష్కరణపై కలెక్టర్‌కు బాధితుని ఫిర్యాదు
ఇరుపక్షాలతో అధికారుల చర్చలు.. కుదిరిన సయోధ్య..!
కలెక్టరేట్(కాకినాడ), జనవరి 2(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలో కుల పెద్దలు నిర్ణయించారు. వారి నిర్ణయానికి వ్యతిరేకంగా తమ అభీష్టానికి అనుగుణంగా, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించిన ఏడు కుటుంబాలపై గ్రామ పెద్దలు కన్నెర్న చేశారు. అంతే వారిని వెలి వేస్తూ గ్రామ పెద్దలు తీర్మానించారు. సభ్య సమాజం నివ్వెరబోయే ఈ ఘటన కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఉప్పుమిల్లిలో ఏడు కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశాయి. అలా వేయడాన్ని గ్రామ, కుల పెద్దలుగా వ్యవహరిస్తున్న వైసీపీకి చెందిన వారు తీవ్రంగా పరిగణించారు. అదే సమయంలో ధాన్యం పాట సొమ్ములు వద్ద ఇరు పక్షాల మధ్య వివాదం తలెత్తింది. అది పెద్దదిగా మారింది. అంతే వెలి తీర్మానం జరిగిపోయింది. వెలి వేసిన కుటుంబంలోని వారితో ఎవరైనా మాట్లాడితే రూ.5,000 జరిమానా చెల్లించాలని తీర్మానించారు. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు పిలవకూడదని, పనులకు పిలవకూడదని కట్టడి చేశారు.
విషయంపై బాధితుడు తుట్టా దుర్గాప్రసాద్ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు కాజులూరు తహసీల్దారు శివకుమార్, గొల్లపాలెం ఎస్‌ఐ మోహన్ కుమార్ గురువారం ఉప్పుమిల్లి గ్రామానికి వెళ్లారు. పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సమక్షంలో ఇరువర్గాలతో చర్చించారు. తహసీల్దారు శివకుమార్ మాట్లాడుతూ, ‘వెలి చట్ట వ్యతిరేకం. సభ్య సమాజంలో ఉంటూ ఇతరులను వెలి వేసే హక్కు ఎవరికీ లేదు. కాదని ఎవరైనా గ్రామంలో వెలివేసి వివక్ష చూపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. గొల్లపాలెం ఎస్‌ఐ మోహన్‌కుమార్ మాట్లాడుతూ, ‘గ్రామంలో ఏడు కుటుంబాలను ఎలాంటి శుభ కార్యక్రమాలకు పిలవకుండా వెలివేసే అధికారం ఎవ్వరికీ లేదు. ఇది చట్టరీత్యా నేరం. ఏదైనా సమస్య ఉంటే అందరూ కూర్చుని మాట్లాడుకోవాలి. అంతేగానీ వివక్ష చూపే అధికారం లేదు’ అని హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో గ్రామంలో శాంతి కమిటీ ఏర్పాటు చేసి ఇరువర్గాలతో చర్చించి సయోధ్య కుదిర్చామని ఎస్‌ఐ తెలిపారు. భవిష్యత్తులో ఈ గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. వెలికి గురైన ఏడు కుటుంబాలు గ్రామంలో ధైర్యంగా బతికేలా రక్షణ కల్పిస్తామన్నారు. ఇక మీదట గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటామని సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు హామీ ఇచ్చారన్నారు.
Updated Date - Jan 03 , 2025 | 06:07 AM