TTD Board Member : థర్డ్‌క్లాస్ నా.. కొ..!పోరా బయటికి..!!
ABN, Publish Date - Feb 19 , 2025 | 04:05 AM
ఆలయంలో టీటీడీ ఉద్యోగిపై ధర్మకర్త మండలి సభ్యుడు ఒకరు తిట్లతో విరుచుకుపడ్డారు. దర్శనం అనంతరం తనను మహాద్వారం గుండా బయటికి పంపకపోవడంతో ఆగ్రహించారు.
టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి వీరంగం
మహాద్వారం వద్ద ఆపడంతో ఆగ్రహం
ఆలయ ప్రాంగణంలోనే తిట్ల దండకం
తిరుమల, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఆలయంలో టీటీడీ ఉద్యోగిపై ధర్మకర్త మండలి సభ్యుడు ఒకరు తిట్లతో విరుచుకుపడ్డారు. దర్శనం అనంతరం తనను మహాద్వారం గుండా బయటికి పంపకపోవడంతో ఆగ్రహించారు. భ క్తులందరూ చూస్తుండగానే ఉద్యోగిపై నోరుపారేసుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వీఐపీలు ఆలయం వెలుపలకు వచ్చే సమయంలో మహాద్వారం, గొల్లమండపం మధ్యలో తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. దీంతో బయటకు వచ్చేవారంతా బయోమెట్రిక్ వైపుగానే రావాలనే నిబంధనను కొన్నాళ్లుగా అమలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న బోర్డు సభ్యుడు బెంగళూరుకు చెందిన నరేశ్ కుమార్ గేటు తీయాలని మహాద్వారం వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగి బాలాజీని ఆదేశించారు. బయోమెట్రిక్ నుంచి వెళ్లాలని బాలాజీ చెప్పడంతో నరేశ్ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘ఎవడ్రా నువ్వు.. పోరా బయటకి! థర్డ్‌క్లాస్ నా.. కొ..! ఫస్ట్ బయటకి పంపండి ఇతన్ని. లేకుంటే ఇక్కడే కుర్చునేస్తాను’ అంటూ విరుచుకుపడ్డారు. ఆ ఉద్యోగి భుజంపై చేయి వేసి నెట్టారు. టీటీడీ విజిలెన్స్, అధికారులు జోక్యం చేసుకుని నరేశ్ కుమార్‌కు నచ్చజెప్పి ఆ ఉద్యోగిని అక్కడినుంచి పంపేశారు. నిజానికి... టీటీడీ బోర్డు సభ్యులను మహాద్వారం గుండా అనుమతించాలనే నిబంధన లేదు. అయినప్పటికీ... వారు మహాద్వారం గుండానే రాకపోకలు సాగించడం రివాజుగా వస్తోంది. ఉద్యోగి తనను అడ్డుకోవడం నరేశ్ దృష్టిలో తప్పే అయినప్పటికీ... ఆలయ ప్రాంగణంలోనే అసభ్యంగా మాట్లాడటం సరికాదనే అభిప్రాయం వినిపిస్తోంది. అక్కడి నుంచి హుందాగా వెళ్లిపోయి... తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఉద్యోగిపై ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేస్తే సరిపోయేది!
Updated Date - Feb 19 , 2025 | 04:05 AM