Political Strategy: ఎమ్మెల్సీగా ఎవరెవరో!
ABN, Publish Date - Mar 09 , 2025 | 03:40 AM
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల జాబితా చాలా పెద్దగానే ఉంది. 4 స్థానాలకు ఏకంగా సుమారు 25 మందికి పైగా రేసులో ఉన్నారు. దీంతో అభ్యర్థులను ఖరారు చేసేందుకు టీడీపీలో భారీ కసరత్తే నడుస్తోంది.
నామినేషన్ల దాఖలుకు రేపే గడువు
టీడీపీ ఆశావహుల్లో ఉత్కంఠ
4 సీట్లకు 25 మందికి పైగా రేసులో
ఎంపికపై అధిష్ఠానం భారీ కసరత్తు
సీనియర్లు, బీసీ, ఎస్సీలకే ప్రాధాన్యం
నేడు అభ్యర్థులను ప్రకటించే చాన్స్
2027 నాటికి అందుబాటులోకి
రానున్న మరో 23 స్థానాలు
అప్పుడు న్యాయం చేస్తామని నేతలకు
నచ్చచెబుతున్న పార్టీ అధిష్ఠానం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల జాబితా చాలా పెద్దగానే ఉంది. 4 స్థానాలకు ఏకంగా సుమారు 25 మందికి పైగా రేసులో ఉన్నారు. దీంతో అభ్యర్థులను ఖరారు చేసేందుకు టీడీపీలో భారీ కసరత్తే నడుస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు సోమవారం ఆఖరి రోజు. గడువు దగ్గర పడటంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆదివారం అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు స్థానాల్లో ఒకదాన్ని జనసేన నాయకుడు నాగబాబుకు కేటాయించడం, ఆయన నామినేషన్ దాఖలు చేయడం కూడా జరిగిపోయింది. మిగిలిన నాలుగు స్థానాలను టీడీపీ అభ్యర్థులకే కేటాయించనున్నారు. ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో నలుగురు బీసీ, ఒక కాపు సామాజిక వర్గం నేతలు ఉన్నారు. ఒక స్థానాన్ని జనసేన కోటాలో కాపు సామాజికవర్గం ద్వారా భర్తీ చేస్తున్నారు. మిగిలిన నాలుగు స్థానాల్లో ఈసారి బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది. ఎమ్మెల్సీ సీట్ల ఖరారులో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తారా లేక జూనియర్లను ప్రోత్సహిస్తారా అన్న చర్చ టీడీపీలో జరుగుతోంది. మంత్రివర్గ కూర్పులో అధికశాతం జూనియర్లకు అవకాశం కల్పించారు. మండలిలో 2027 వరకు వైసీపీ ఆధిపత్యం కొనసాగనున్న నేపథ్యంలో సీనియర్లకు, బలంగా గళం వినిపించే వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నారు. వీరిలోనూ ప్రాంతాలు, సామాజికవర్గాల వారీగా కసరత్తు చేసి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.
ఎందరో ఆశావహులు...
అభ్యర్థుల ఎంపికలో సీనియర్లకు అవకాశం ఇస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకు తమ సీట్లను త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు. అలాంటి వారిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎ్‌సఎన్ వర్మ ముందుంటారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం వర్మ తన సీటును త్యాగం చేశారు. ప్రస్తుతం పవన్ సోదరుడు నాగబాబు కూడా ఎమ్మెల్సీగా వెళుతున్న నేపథ్యంలో వర్మకు ఇవ్వకుంటే అది కేడర్‌కు తప్పుడు సంకేతాలను పంపుతుందన్న ప్రచారం ఉంది. దీంతో వర్మకు దాదాపు ఖాయమన్న ప్రచారం ఉంది. వర్మతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కనివారిలో దేవినేని ఉమ, కొమ్మాలపాటి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి వంటి వారు ఉన్నారు. ఇక బీసీ కోటాలో బుద్దా వెంకన్న, బీదా రవిచంద్ర, జంగా కృష్ణమూర్తి వంటి వారు రేసులో ఉన్నారు. వీరిలో జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. బీసీల్లో గవర సామాజికవర్గానికి చెందిన వెంకన్న తనకు ఎమ్మెల్సీ ఇస్తే దాని ప్రభావం తమ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రతో పాటు రాజధాని ప్రాంతంలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఉంటుందని పార్టీ పెద్దలకు చెబుతున్నారు. బీదా, జంగా యాదవ సామాజికవర్గం కోటాలో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం కేబినెట్‌లో ఈ సామాజికవర్గం నుంచి(టీడీపీ) పార్థసారథి ఉండగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. ఎస్సీ కోటాలో మాదిగ సామాజికవర్గం నుంచి కేఎస్ జవహర్, మాల సామాజికవర్గం నుంచి పరసా రత్నం, పీతల సుజాత రేసులో ఉన్నారు.పీతల సుజాతకు రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టారు. అయుతే ఇలాంటి పోస్టు ఏదీ లేకపోవడంతో ప్రస్తుతం ఆమెకు ఏ పదవీ లేనట్టే.
వీరితో పాటు లోకేశ్ టీమ్‌గా ప్రచారంలో ఉన్న మంతెన సత్యనారాయణ రాజు, కావలి గ్రీష్మ, మద్దిపట్ల సూర్యప్రకాశ్, బీవీ వెంకటరాముడు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వీరికి అవకాశం ఉండకపోవచ్చని సమాచారం. ఇక గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, రెడ్డి సుబ్రమణ్యం, నాగుల్ మీరా వంటివారు రేసులో ఉన్నారు. మైనారిటీ కోటాలో విశాఖకు చెందిన ఎండీ నజీర్ తన పేరు పరిశీలించాలని కోరుతున్నారు.
ఉన్నవి నాలుగే... 2027 వరకు ఆగండి
ఎమ్మెల్సీ ఆశావహులు భారీగా ఉన్నా ప్రస్తుతానికి కేవలం 4 స్థానాలే ఉన్నాయి. దీంతో అందరికీ న్యాయం చేయడం సాధ్యం కాదని, 2027 వరకు వేచి ఉండాలని పార్టీ అధిష్ఠానం నచ్చచెబుతోంది. 2027 నాటికి 23 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. వీటిలో ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థ కోటాలో 11 ఉండగా.. గవర్నర్ కోటాలో 5 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఒకటి టీడీపీ, మరొకటి జనసేనది కాగా మిగిలిన సీట్లు వైసీపీవి. గవర్నర్ కోటాలో మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా ఇవన్నీ వైసీపీ ఖాతాలో ఉన్నాయి. వీరిలో కత్తి పద్మశ్రీ ఇప్పటికే రాజీనామా చేశారు. ఈ స్థానానికి 2029 వరకు గడువు ఉంది. 2026 జూలై నాటికి రెండు, 2027 జూన్‌లో మరో మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతాయి. 2027 నాటికి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్సీ సీట్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మందికి న్యాయం చేసే అవకాశం ఉందని పార్టీ అధిష్ఠానం చెబుతోంది. ప్రస్తుతానికి సీనియర్లయిన బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యం ఇచ్చి, 2027 నాటికి లోకేశ్ టీమ్‌కి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దల యోచనగా ఉంది. ఏదేమైనా సోమవారంతో నామినేషన్లకు గడువు ముగియనుండటంతో ఎమ్మెల్సీ ఆశావహుల ఉత్కంఠకు ఆదివారం నాటితో తెరపడే అవకాశం ఉంది.
Updated Date - Mar 09 , 2025 | 07:26 AM