Investments: భారీ పెట్టుబడులు సాకారం!
ABN, Publish Date - Jan 03 , 2025 | 05:03 AM
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. ప్రతిష్ఠాత్మక బీపీసీఎల్, టీసీఎస్ ప్రాజెక్టులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రెండు ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది.
పట్టాలెక్కనున్న బీపీసీఎల్, టీసీఎస్ ప్రాజెక్టులు
రామాయపట్నంలో భారీ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు
విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యకలాపాలు
రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
కనిగిరిలో కంప్రెస్డ్ బయో గ్యాస్ విద్యుత్ ప్లాంటు
కాకినాడ, నంద్యాల, కడప, పత్తికొండలో కొత్తగా రానున్న ఇంధన ఆధారిత ప్లాంట్లు
కనిగిరిలో బయోగ్యాస్ ప్లాంటు
కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తికి ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో 4 వేల ఎకరాల భూమి కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ తరహావి 500 ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ పఽథకం అమలుపై గురువారం కేబినెట్ చర్చించింది. కనిగిరిలో బీడు భూములు ఎక్కువగా ఉన్నందు అక్కడ ఒక రకమైన గడ్డి పెంచి దాని ద్వారా రిలయన్స్ సంస్థ బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. గడ్డి పెంపకానికి తీసుకున్న వాటిలో ప్రభుత్వ భూములుంటే ఏడాదికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేటు భూములకు రూ.30 వేలు కౌలు రూపంలో రిలయన్స్ చెల్లిస్తుంది. వీలైతే ఈ పథకాన్ని ఈ నెల 8న ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కౌలు ఒప్పందాలు పూర్తికాకపోతే ప్రారంభం వాయిదాపడే అవకాశం ఉంది. కనిగిరితోపాటు ఉదయగిరి ప్రాంతం లోనూ ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయించాలని భావిస్తున్నట్లు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సౌరవిద్యుత్‌కు ఉపయోగపడే భూములు ఇవ్వబోమన్నారు.
అమరావతి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. ప్రతిష్ఠాత్మక బీపీసీఎల్, టీసీఎస్ ప్రాజెక్టులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రెండు ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది. ఇవి కార్యరూపం దాలిస్తే రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోతుంది. అనుబంధ పరిశ్రమల రాకతో పారిశ్రామికాభివృద్ధి పరుగులు తీయనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రతిపాదనల ప్రకారం.. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల అతి భారీ పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కానుంది. మొత్తం 9మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రో కెమికల్స్ యూనిట్స్, క్రూడాయిల్ టెర్మినల్, గ్రీన్‌హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులను నిర్మిస్తారు.
ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే 20 ఏళ్లలో రాష్ట్రానికి రూ.88,747 కోట్ల ఆదాయం లభిస్తుంది. 2,400 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2029లోపే ఈ మొత్తం ప్రాజెక్టును పూర్తిచేసేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. బీపీసీఎల్ కూడా ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. రూ.6,100 కోట్ల అంచనా వ్యయంతో ప్రీ-ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు, రామాయపట్నంలో భారీ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు ప్రతిపాదనను కూడా బీపీసీఎల్ బోర్డు ఇప్పటికే ఆమోదించింది. స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కోసం ఈ సమాచారాన్ని అందిస్తూ వెంటనే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎ్‌సఈ), బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (బీఎ్‌సఈ)లకు ఇటీవలే లేఖ కూడా రాసిం ది. ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద కసరత్తే చేశారు. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ దీనికోసం పోటీ పడగా.. చంద్రబాబు ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ప్రాజెక్టుకు అవసరమైన భూములు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని, ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కావలసిన వనరులు కూడా రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని వివరించారు. తర్వాత రాష్ట్ర అధికారుల బృందం బీపీసీఎల్ ప్రతినిధులతో పలు దఫాలు సంప్రదింపులు జరిపింది. దరిమిలా బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీని రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి సానుకూలత వ్యక్తం చేసింది. అయితే మచిలీపట్నంలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా.. బీపీసీఎల్ మాత్రం రామాయపట్నంపై ఆసక్తి చూపింది. సీఎం కూడా అంగీకరించారు. రాష్ట్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది.
విశాఖలో టీసీఎ్‌సకూ ఓకే
దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విశాఖలో రూ.80కోట్లతో డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. తొలిదశలో 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. తర్వాత టీసీఎ స్‌ను మరింత విస్తరిస్తారు. అప్పుడు 10వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. విశాఖలోని రుషికొండ ఐటీపార్కు హిల్-2పై నాన్ సెజ్ ఏరియాలో డల్లాస్ టెక్నాలజీస్ సంస్థ నిర్మించిన భవనంలో లీజు ప్రాతిపదికన ఆఫీసు ఏర్పాటుకు టీసీఎస్ ముందుకు రాగా.. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే డల్లాస్ భవనంలో 1400 మంది వరకు మాత్రమే పనిచేయడానికి స్థలం సరిపోతుంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ ప్రతిపాదనల మేరకు సీటింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు పక్కనే ఖాళీగా ఉన్న స్థలాన్ని అదనంగా కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రంలో ఐటీ కేంద్రంగా అభివృద్ధి సాధిస్తున్న విశాఖలో యాంకర్ కంపెనీలు లేకపోవడం ఇంతవరకు పెద్ద లోటుగా ఉండేది. ఈ లోటును భర్తీ చేయడంపై ఐటీ మంత్రి లోకేశ్ ప్రత్యేక దృష్టి సారించారు. విశాఖకు టాప్-10 కంపెనీలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలోనే టీసీఎస్ ప్రతినిధులతో చర్చలు జరిపి. వారిని విశాఖకు ఆహ్వానించారు. ఇన్ఫోసి్‌సకు పక్కనే టీసీఎస్ డెవల్‌పమెంట్ సెంటర్ ప్రారంభమైతే విశాఖ ఐటీ కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ భారీ ప్రాజెక్టులు కార్యకలాపాలను ప్రారంభిస్తే.. అనుబంధ పరిశ్రమలతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తుంది. వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
పునరుత్పాదక విద్యుత్ రంగంలో కొత్త టెక్నాలజీతో దేశంలో మొదటిసారిగా రెండు ప్లాంట్లను హీరో సంస్థ మన రాష్ట్రంలో ప్రారంభించబోతోంది. మంత్రివర్గ సమావేశంలో అధికారులు ఈ విషయం తెలిపారు. పవన, సౌర విద్యుత్, బ్యాటరీ ప్రాజెక్టుల కలయికతో కడప, నంద్యాల జిల్లాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. బ్యాటరీలను కూడా కలిపి ఇంతవరకూ దేశంలో ఎక్కడా ఈ తరహా ప్లాంట్లు లేవు. సౌర, పవన విద్యుత్‌ను ఈ బ్యాటరీల్లో నిల్వ చేసి వాటిని గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. 249 మెగావాట్ల సామర్థ్యంతో ఇవి ఏర్పాటు కానున్నాయి.
మరిన్ని నిర్ణయాలు..
మెస్సర్స్ ఏఎం గ్రీన్ అమ్మోనియా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఒక ఎంఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా తయారీ సామర్థ్యంతో ప్లాంటు ఏర్పాటుకు ఆమోదం.
రెండు గిగావాట్ ఎలకో్ట్రలైజర్ తయారీ సామర్థ్యంతో కాకినాడలో ప్లాంటు ఏర్పాటుకు జూస్ కాకెరిల్ గ్రీన్‌కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు గ్రీన్‌సిగ్నల్.
టాటా పవర్ రెన్యువబుల్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు, పెద్ద హులిటీ గ్రామాల్లో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటుకు ఆమోదముద్ర.
బస్సుల బాడీ బిల్డింగ్ సంస్థ ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ రూ.1,046 వేల కోట్ల పెట్టుబడితో శ్రీసత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసే ప్లాంటుకు 70.7 ఎకరాలు కేటాయింపు. ఎకరా ధర రూ.38.37 లక్షలు.
బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లాలో ఉడ్ ఫ్యాక్టరీ స్థాపనకు అంగీకారం.
Updated Date - Jan 03 , 2025 | 05:04 AM