SC categorization : మార్చి 15 తర్వాతే ఎస్సీ వర్గీకరణపై నివేదిక!
ABN, Publish Date - Jan 24 , 2025 | 03:47 AM
ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ మార్చి 15 తర్వాతే నివేదికను సమర్పించనుంది.
మరో 45 రోజుల గడువు కోరిన ఏకసభ్య కమిషన్
13 ఉమ్మడి జిల్లాల్లో పూర్తైన అభిప్రాయ సేకరణ.. 2024 కుల సర్వేపై పునఃసమీక్షకు నిర్ణయం
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ మార్చి 15 తర్వాతే నివేదికను సమర్పించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కోసం వివిధ రాష్ట్రాలు ఆ ప్రక్రియ చేపట్టాయి. మన రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2024 నవంబరు 15న ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసి 2 నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. 13 జిల్లాల్లో దళిత సంఘాలు, మేధావులు, ఉద్యోగులను సంప్రదించింది. వారి నుంచి విజ్ఞాపన పత్రాలను స్వీకరించింది. ఎస్సీల్లోని అన్ని ఉపకులాల నేతలు, ఉద్యోగ సంఘాలతో చర్చించింది. 2024 జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కులగణన గణాంకాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక ఇవ్వాలని కమిషన్ భావిస్తోంది. అయితే, అప్పట్లో చేపట్టిన కులగణన సర్వే వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో నిర్వహించడం వల్ల లోపభూయిష్టంగా ఉందని ఫిర్యాదులున్నాయి. దీంతో గ్రామ స్థాయిలో సర్వే అధికారులను నియమించి అప్పట్లో తీసిన సర్వే కచ్చితంగా ఉందో లేదో సమీక్ష చేస్తున్నారు. ఈ ప్రక్రియను జనవరి 15లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ కూడా ఇంకా కొలిక్కి రాకపోవడంతో దానిని వేగవంతం చేసి త్వరలో కులగణన సర్వే సమీక్ష పూర్తి చేయాలని భావిస్తున్నారు. దానికి ఇంకా కొంత సమయం పట్టనుంది. ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పణకు ఇచ్చిన గడువు ఈనెల 15నే ముగిసింది. అయితే, మరో 45 రోజుల గడువు కావాలని కమిషన్ కోరింది. దానికి ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు.
వెనుకబాటు ప్రాతిపదికనే...
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీల్లో ఆయా వర్గాలు ప్రభుత్వ రంగంలో అవకాశాలు పొందడంలో వెనుకబాటుతనంపైనే కమిషన్ దృష్టి పెట్టింది. ఎస్సీల్లో మాదిగలు ప్రభుత్వ ఉద్యోగాల్లో అతి తక్కువ భాగస్వామ్యం కలిగి ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా ఉద్యోగాల్లో ఎస్సీల్లోని ఏ ఉపకులానికి ఎంత మంది ఉన్నారన్న గణాంకాలు తీసి ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. హరియాణాలో 2023లోనే కమిషన్ వేసి అధ్యయనం చేశారు. 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు రాగానే అక్కడ అమలు చేశారు. మిగతా రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ మొదలైంది. ముందుగా ఆంధ్రలో సత్వరమే ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం
Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 24 , 2025 | 03:47 AM