Land Scandal: సుధాకర్‌నాయుడి ఖాతా నంబర్‌పై 470 ఎకరాలు: జేసీ
ABN, Publish Date - Feb 20 , 2025 | 06:10 AM
రిటైర్డ్ తహశీల్దార్ సుధాకర్‌నాయుడి ఖాతాపై పెందుర్తి మండలంలో 400 ఎకరాలు కాదు.. 470 ఎకరాలపైనే ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు ఈ విషయాన్ని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ బుధవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
నా అన్న పేరుతో నమోదు చేసిందెవరు?
ఇప్పుడు ఎవరి పేరిట బదిలీ చేస్తున్నారు?
తేల్చాలని రిటైర్డ్ తహశీల్దార్ తమ్ముడి డిమాండ్
విశాఖపట్నం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ తహశీల్దార్ సుధాకర్‌నాయుడి ఖాతాపై పెందుర్తి మండలంలో 400 ఎకరాలు కాదు.. 470 ఎకరాలపైనే ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు ఈ విషయాన్ని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ బుధవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. సాధారణంగా రైతుల వివరాలు తెలియనప్పుడు స్థానిక మండలాధికారి నోషనల్ ఖాతా ఏర్పాటుచేసి అందులో నమోదు చేస్తారని.. అయితే ఈ కేసులో సుధాకర్‌నాయుడి ఆధార్ నంబరు కూడా లింకై ఉందన్నారు. అలా చేయాల్సిన అవసరం లేదని, కానీ ఎవరు చేశారు.. ఎందుకు చేశారో విచారణ చేస్తామని చెప్పారు. ఎక్కువగా వ్యవసాయ భూములే ఆయన ఖాతాపై ఉన్నట్లు గుర్తించామన్నారు. గత నెలలో వాటిలో కొన్ని భూముల మ్యుటేషన్ జరిగిందని.. వాటిపైనా విచారణ జరుగుతుందని తెలిపారు. ఎవరు దరఖాస్తు చేశారు.. వాటిని ప్రాసెస్ చేసిందెవరో తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ భూముల వ్యవహారంపై అనుమానాలుంటే నేరుగా తన కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
కాగా.. సుధాకర్‌నాయుడి పేరిట పెందుర్తి మండలంలో వందల ఎకరాల భూములు నమోదైన విషయాన్ని జిల్లా అధికారులు సీరియ్‌సగా తీసుకున్నారు. అదీగాక ఆ అధికారి చనిపోయిన తర్వాత కొన్ని భూములను మ్యుటేషన్ చేశారని తేలడంతో.. ఆ పని చేసింది.. చేయించింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. సుధాకర్‌నాయుడి కుటుంబం రాజకీయంగా క్రియాశీలంగా ఉంది. ఆయన వదిన లాలం భవాని గతంలో విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. వారికి అనకాపల్లి జిల్లాలో వ్యవసాయ భూములు ఉన్నాయి. తమ కుటుంబంలో ఎవరూ పెందుర్తిలో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేయలేదని, ఆయన పేరిట అన్ని వందల ఎకరాలు ఉన్న విషయం కూడా తమకు తెలియదని ఆయన తమ్ముడు లాలం ప్రసాద్ ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. తన సోదరుడి పేరిట భూములు నమోదు చేసి, ఇప్పుడు వాటిని వేరే వారికి ఎలా బదిలీ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. దీనిపై అధికారులు విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read:
వరద సాయం ప్రకటించిన కేంద్రం.. ఏపీకే ఎక్కువ
ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్.. ఐరాసలో భారత్ నిప్పులు
యుద్ధాన్ని మొదలుపెట్టిందే మీరు.. జెలెన్ స్కీపై ట్రంప్ ఫైర్..
For More Telangana News and Telugu News..
Updated Date - Feb 20 , 2025 | 06:10 AM