TDP government: ‘అగ్రి ఇంజనీరింగ్ డైరెక్టరేట్’పై మీనమేషాలు!
ABN, Publish Date - Jan 23 , 2025 | 05:32 AM
వ్యవసాయ అనుబంధ శాఖల్లో సాంకేతికతను పర్యవేక్షించే ఇంజనీరింగ్ యంత్రాంగాన్ని ఒకే గొడుకు కిందకు తేవడం ద్వారా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఒక ముసాయిదాను రూపొందించింది.
గతంలోనే తయారైన ముసాయిదా
అటకెక్కించిన వైసీపీ సర్కార్
డైరెక్టరేట్ ఏర్పాటును గుర్తు చేస్తున్న కేంద్రం
‘అది ఏర్పాటైతేనే నిధులు’ అని స్పష్టీకరణ!
చాలా రాష్ట్రాలు ముందంజ.. ఏపీ జాప్యం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
వ్యవసాయ అనుబంధ శాఖల్లో సాంకేతికతను పర్యవేక్షించే ఇంజనీరింగ్ యంత్రాంగాన్ని ఒకే గొడుకు కిందకు తేవడం ద్వారా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఒక ముసాయిదాను రూపొందించింది. పెద్దగా ఖర్చు లేకుండా, కేవలం వ్యవసాయ ఇంజనీరింగ్ అధికారుల సర్దుబాటు, హోదాల సవరణలతో జరిగే ప్రక్రియ ఇది. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఈ ముసాయిదాను అటకెక్కించింది. ఇప్పుడు ప్రభుత్వం మారినా ఇంకా దీనిపై దృష్టి పెట్టకపోవడంతో ముసాయిదా కాగితాలకే పరిమితమైంది. దీని ఏర్పాటుపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం ఎందుకో అర్థం కావడంలేదు!!.
తాజాగా కేంద్రం నుంచి లేఖలు!
సన్నచిన్నకారు రైతులకు మేలు చేసేలా, వ్యవసాయ యాంత్రీకరణ బలోపేతానికి అన్ని రాష్ట్రాల్లోనూ వ్యవసాయ ఇంజనీరింగ్ డైరెక్టరేట్‌లు ఏర్పాటు చేయాలన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసును అమలు చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తాజాగా లేఖలు రాశారు. దీంతో వ్యవసాయ ఇంజనీరింగ్ అధికారులు, విద్యార్థుల్లో ఆశలు చిగురించాయి. వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగం రాష్ట్రానికి చాలా ముఖ్యమైంది. కేంద్రం వ్యవసాయ యాంత్రీకరణకు వివిధ ప్రాజెక్టు ద్వారా ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నిధుల్ని వాడాలంటే ఆశాఖ ఉండాలి. కానీ రాష్ట్రంలో నూతన యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చే నిపుణులు, నైపుణ్యం కొరవడిందన్న విమర్శలున్నాయి. ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీలు బాపట్ల, మడకశిరలోనే ఉన్నాయి. అక్కడి నుంచి ఏటా 100మంది దాకా ఇంజనీరింగ్ పట్టభద్రులు తయారవుతున్నారు. కానీ వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రభుత్వపరంగా లేవు. దీంతో అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వారు ప్లాంట్ పారామీటర్స్ మాత్రమే చూస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రాధాన్యమున్న నూతన యాంత్రీకరణను రైతులకు అందుబాటులోకి తేవడం లేదా వారికి అవగాహన కల్పించే వారు కరువయ్యారు.
అదే వ్యవసాయ ఇంజనీరింగ్‌కు ప్రత్యేక సంస్థ ఉంటే వారి అవసరం, వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. కొత్తగా డ్రోన్స్, రోబోస్, సెన్సార్ బేస్ట్ యాంత్రీకరణ వస్తున్న నేపథ్యంలో వ్యవసాయ ఇంజనీరింగ్‌కు ప్రత్యేక సంస్థ ఉంటేనే నిధులిస్తామని కేంద్రం చెప్తోంది. దీంతో చాలా రాష్ట్రాల్లో ప్రత్యేక డైరెక్టరేట్లు ఏర్పాటవుతున్నాయి. పొలం చదును నుంచి పంట కోత, ఉత్పత్తుల శుద్ధి, మార్కెటింగ్ వరకు యాంత్రీకరణ వరకు ఉపయోగపడే యంత్రాలు వస్తున్నాయి. కానీ వాటిపై రైతుకు అవగాహన కల్పించడం లేదు. విత్తనం వేసేటప్పుడు ఎలా పడితే అలా వేయకుండా, తగిన లోతు, వరుస క్రమంలో నాటే యంత్రాలున్నాయి. అంతర సాగులో కలుపు నివారణ పద్ధతులు కూడా కొత్త సాంకేతికత వస్తోంది. పండ్ల తోటల్లో చేతులతో కోయడంతో పండ్లు పాడైపోతున్నాయి. ఎగుమతులకు అవకాశం లేకుండా పోతోంది. భూమిలో మిత్ర పురుగులు సంరక్షణ, చీడపురుగుల నివారణ వంటి చర్యల్లో సంప్రదాయ పద్ధతుల కన్నా ఆధునిక సాంకేతిక ఉందని చెప్తున్నారు. పొలాలు, తోట నుంచి పంట ఉత్పత్తుల తరలింపు, గోదాముల్లో నిల్వ చేసే పద్ధతుల్లోనూ సాంకేతికతను వినియోగించే విధానాలు కొన్ని దేశాలు పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నూతన సాంకేతికత, ఊబరైజేషన్‌కు ప్రాధాన్యమిచ్చే సీఎం చంద్రబాబు వ్యవసాయ ఇంజనీరింగ్ డైరెక్టరేట్‌పై దృష్టి పెడితే.. రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఇంజనీరింగ్ విద్యార్థులు, నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం..
Also Read: ప్రయాణికులపై నుంచి దూసుకెళ్లిన రైలు: పలువురు మృతి
Also Read: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు జడ్జిలు నియామకం
Also Read: : గడ్డ కట్టే చలిలో సమావేశానికి నడిచి వెళ్లిన మంత్రి నారా లోకేష్
Also Read: రాజధాని అమరావతికి మళ్లీ గుడ్ న్యూస్
Also Read: బిహార్ సీఎం నితీష్ కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jan 23 , 2025 | 05:32 AM