Pawan Kalyan: సీఎం ప్రమాణ స్వీకారంలో స్పెషల్ అట్రాక్షన్‌గా పవన్ కళ్యాణ్.. జనసేనానితో ఆ ఒక్క నిమిషం మోదీ ఏం మాట్లాడారంటే
ABN, Publish Date - Feb 20 , 2025 | 03:53 PM
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ముచ్చటించారు. వేదికపై ఉన్న వివిధ రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలకు నమస్కరిస్తూ ముందుకుసాగిన మోదీ.. పవన్ కనబడేసరిగా సడన్‌గా ఆగిపోయి కొద్దిసేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. దీంతో పవన్‌తో మోదీ ఏం మాట్లాడారనే చర్చ నడుస్తోంది.
దేశ రాజధాని హస్తినలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల కీలక నేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ దీక్షలో ఉండటంతో ప్రత్యేక దుస్తులతో ఈ కార్యక్రమంలో కనిపించారు.
ప్రధాని మోదీ వేదికపైకి రాగానే అక్కడున్న నేతలను పలకరించారు. తొలుత గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఆ తరువాత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు నమస్కరిస్తూ ముందుకు సాగిన మోదీ, ఆ తర్వాత మహారాష్ట్ర మరో డిప్యూటీ సీఎం ఏక్‌నాధ్ షిండేను పలకరించారు. ఆ తర్వాత ఫడ్నవీస్‌తో పాటు మిగతా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు నమస్కరించుకుంటూ ముందుకుసాగిన మోదీ.. పవన్ కళ్యాణ్ కనిపించగానే ఒక్కనిమిషం పాటు అలా ఆగిపోయారు. పవన్ వస్త్రాదారణ చూసిన మోదీ నవ్వుతూ హిమాలయాలకు వెళ్దామనుకుంటున్నావా అంటూ చమత్కరించారు. మోదీ మాటలకు పడిపడి నవ్విన పవన్ కళ్యాణ్ అలా ఏమి లేదంటూ సమాధానమిచ్చారట. వెంటనే నీ ముందు చాలా బాధ్యతలు ఉన్నాయి.. వాటిని చూసుకో అంటూ మోదీ పవన్ కళ్యాణ్ చేతిలో చేయి వేసి పలకరించారు. మోదీ మాటలకు పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సైతం నవ్వుతూ కనిపించారు. వేదికపై ఉన్నవారందరికి నమస్కరిస్తూ ముందుకుసాగిన మోదీ పవన్ వద్ద కొద్దిసేపు ఆగి.. ప్రత్యేకంగా మాట్లాడటంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌పై మోదీ మరోసారి తన అభిమానాన్ని చూపించారంటూ జనసైనికులు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రత్యేకంగా పవన్
వేదికపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన వస్త్రధారణ చూసి పీఎం మోదీ సైతం ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు జనసేన పోరాడుతుందని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా హిందూ ఆలయాల పరిరక్షణ కోసం ప్రత్యేక సనాతన బోర్డు ఏర్పాటుచేయాలనే డిమాండ్‌ను పవన్ వినిపిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సినీ నటుడిగా దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. రాజకీయంగానూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పవన్ అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ చేతుల్లో చేతులు కలిపి ప్రత్యేకంగా ముచ్చటించడం జాతీయ మీడియాలో ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
వీడియోకోసం ఇక్కడ చూడండి..
Updated Date - Feb 20 , 2025 | 04:44 PM