Minister Nara Lokesh : ఏపీలో పెట్టుబడులు పెట్టండి
ABN, Publish Date - Jan 21 , 2025 | 03:34 AM
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో మాన్యుఫాక్చరింగ్, ఆర్‌అండ్‌డీ కేంద్రాలు, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ముఖ్యమైన పరికరాల....
స్విస్ పారిశ్రామికవేత్తలకు లోకేశ్ ఆహ్వానం
పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సానుకూలం
అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో మాన్యుఫాక్చరింగ్, ఆర్‌అండ్‌డీ కేంద్రాలు, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ముఖ్యమైన పరికరాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ స్విస్ పారిశ్రామికవేత్తలను కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్ రంగాల్లో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి స్విస్ పరిశోధన సంస్థలు పనిచేయాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో ఇందుకు పూర్తి సానుకూల వాతావరణం ఉందన్నారు. ఏపీలో స్టార్ట్‌పలను ప్రోత్సహించడం, సాంకేతికత బదిలీల కోసం ఇన్నోవేషన్ హబ్, ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. స్విస్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మోడల్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం జ్యూరిక్‌లో స్విస్ పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. లోకేశ్ మాట్లాడుతూ.. ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అనుకూల విధానాలను అమలు చేస్తోందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు 15 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు ఏపీ ఎకనమిక్ డెవల్‌పమెంట్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసిందన్నారు. రాష్ట్రంలో 1053 కిలోమీటర్ల సుదూర తీర ప్రాంతం, విశాలమైన రోడ్లు, విమాన సదుపాయాలు, నౌకాశ్రయాలు ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఏపీ పరిశ్రమల మంత్రి టీజీ భరత్, స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్, స్విస్ మెకానికల్ అండ్ ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ సెక్రటరీ జనరల్ రావోల్ కెల్లర్, ఒర్లికాన్ సీఈవో మార్కస్ టకే, యాంగ్టిట్ ఫిస్టర్ సీఈవో ఎరిక్ షెమిద్, ఏపీఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.
ఏడాదిలో రూ.40 వేల కోట్లు
ఏపీ ఆర్థిక వ్యవస్థలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషిస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. 2023 ఆర్‌బీఐ డేటా ప్రకారం ఏపీకి ఎన్‌ఆర్‌ఐల ద్వారా వచ్చిన మొత్తం రూ.40 వేల కోట్ల పైచిలుకు అని, ఇంత మొత్తం దేశంలో ఏ ఇతర రాష్ట్రానికి రాలేదన్నారు. జ్యూరిక్‌లో తెలుగువారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నా దృష్టిలో మీరు నాన్ రెసిడెంట్ ఇండియన్స్(ఎన్‌ఆర్‌ఐ) కాదు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్(ఎంఆర్‌ఐ)’ అన్నారు. ప్రవాసాంధ్రులు టీడీపీకి, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారన్నారు. ‘ఎన్‌ఆర్‌ఐలపై మాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో నలుగురు ప్రవాసాంధ్రులను ఎమ్మెల్యేలను చేశాం. మరికొందరికి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చాం’ అన్నారు.
జ్యూరిక్కా.. జువ్వలపాలెమా
‘ఇక్కడి పరిస్థితులను చూస్తుంటే జ్యూరిక్‌లో ఉన్నానా లేక జువ్వలపాలెంలో ఉన్నానా అన్న సందే హం కలుగుతోంది. జ్యూరిక్‌లో ఇంతమంది తెలుగువారిని ఒకే చోట కలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచాన్ని ఏలే సత్తా తెలుగువారికి మాత్రమే ఉంది. ఏపీకి ఎందుకు రావాలని అడిగితే నేను మా బ్రాండ్ సీబీఎన్ అని చెబుతా’ అని లోకేశ్ అన్నారు.
ఓంక్యాప్‌ను పునర్నిర్మిస్తున్నాం
తాను మానవ వనరుల శాఖ మంత్రి అయ్యాక ఓంక్యా్‌ప (ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ)ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించానని లోకేశ్ తెలిపారు. ‘ఎన్నికల సమయంలో ప్రవాసాంధ్రులు సెలవులు పెట్టి మరీ ఏపీకి వచ్చి కూటమి విజయానికి కృషి చేశారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణానికి కలిసి రావాలి. ప్రవాసాంధ్రులకు సహాయ సహకారాలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం, టీడీపీ సంయుక్తంగా ఎక్స్‌పోర్టు, ఇంపోర్టు సెల్‌ను ఏర్పాటు చేయబోతున్నాయి. విద్య, ఉద్యోగం, నైపుణ్యాలు దశాబ్దాలుగా తెలుగువారు విదేశాలకు వలసవెళ్లి స్థిరపడేలా చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడింటిని పునర్నిర్మించడం, ఆధునీకరించడంపై దృష్టి సారించింది. రాష్ట్ర యువత విదేశాలకు వలస వెళ్లకుండా సొంత గడ్డపైనే సేవలందించేలా చేయడం కూటమి ప్రభుత్వ ఉద్దేశం’ అని లోకేశ్ అన్నారు.
ఏపీలో వరల్డ్ క్లాస్ పీజీఏ గోల్ఫ్ సిటీ
లోకేశ్‌తో స్టోన్ క్రాఫ్ట్ ప్రతినిధుల భేటీ
ఏపీలో ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పీజీఏ) ప్రామాణిక గోల్ఫ్ సిటీ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేశ్ స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ ప్రతినిధులను కోరారు. జ్యూరిక్‌లో లోకేశ్‌తో స్టోన్‌క్రాఫ్ట్ గ్రూపు స్ట్రాటజిక్ గ్లోబల్ అడ్వయిజర్ ఫణి శ్రీపాద, సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫణి మాట్లాడుతూ.. ప్రతిపాదిత ప్రపంచ స్థాయి గోల్ఫ్ సిటీ ఏపీలో ఏర్పాటైతే రాష్ట్రంలో పర్యాటకంతో పాటు ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. గోల్ఫ్ సిటీకి సంబంధించి పూర్తిస్థాయి బ్లూప్రింట్‌తో వస్తే 15 రోజుల్లో ఏపీ ఎకనమిక్ డెవల్‌పమెంట్ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేస్తుందన్నారు.
Updated Date - Jan 21 , 2025 | 03:34 AM