Nabard : నాబార్డు నుంచి రాష్ట్రానికి రూ.1,850 కోట్లు
ABN, Publish Date - Jan 29 , 2025 | 05:13 AM
రాష్ట్రానికి వివిధ అభివృద్ధి పథకాల కోసం నాబార్డు రుణాలందిస్తోంది.
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఆర్‌ఐడీఎఫ్-30 కింద రాష్ట్రానికి నాబార్డు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,850 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి వివిధ అభివృద్ధి పథకాల కోసం నాబార్డు రుణాలందిస్తోంది. ఆర్‌ఐడీఎఫ్ కింద గ్రామీణ రోడ్లకు 80 శాతం రుణం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం భరించాలి. 2,683 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.1,086 కోట్లు కోరుతూ ఆర్‌అండ్‌బీ ప్రతిపాదనలు పంపింది. పంచాయతీరాజ్‌శాఖకు సంబంధించి రూ.1024 కోట్లతో 2,233 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. గత ఐదేళ్లలో పాఠశాల విద్యకు సంబంధించి అదనపు గదులు, టాయ్‌లెట్స్, తాగునీటి కోసం రూ.6,066 కోట్లు మంజూరయ్యాయి. ఇంకా రూ.1,113 కోట్లు రావల్సి ఉంది. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణానికి రూ.5331 కోట్లు మంజూరుకాగా, మరో రూ.2,198 కోట్లు అందాల్సి ఉంది. బీసీ, సాంఘిక, గిరిజన, మహిళా సంక్షేమం, వ్యవసాయం, పిషరీస్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలకు గత ఐదేళ్లలో నాబార్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.14,435 కోట్ల రుణం మంజూరయ్యింది.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jan 29 , 2025 | 05:14 AM