Nadendla Manohar : ఇంటింటికీ రేషన్‌తో ప్రజాధనం వృథా
ABN, Publish Date - Mar 06 , 2025 | 04:46 AM
వైసీపీ హయాంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు.
వైసీపీ హయాంలో 1,600 కోట్లతో 9,260 వాహనాలు కొన్నారు
గత రేషన్ డీలర్ వ్యవస్థే నయం: మనోహర్
అమరావతి, మార్చి5(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఆ పథకం వల్ల రూ.1,600 కోట్లు ప్రజాధనం వృథా అయ్యిందని చెప్పారు. కొనుగోలు చేసిన 9,260 వాహనాల్లో ఒక్కటి కూడా లబ్ధిదారుల ఇంటికెళ్లి బియ్యం ఇవ్వలేదని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం సభలో మంత్రి మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి రాకముందున్న రేషన్ డీలర్ల వ్యవస్థ బాగుండేదని, ప్రజలు సైతం డీలర్ల వద్దకు వెళ్లి తీసుకోవడమే అనుకూలంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఈ అంశాన్ని లేవనెత్తారు. మంత్రి స్పందిస్తూ.. వైసీపీ హయాంలో రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. సిట్ నివేదిక రాగానే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు మాట్లాడుతూ తెల్లకార్డును మల్టీ పర్పస్‌గా కాకుండా కేవలం ఉచిత బియ్యాకే పరిమితం చేస్తే ఎక్కువ మంది స్వచ్ఛందంగా వదులుకుంటారని సూచించారు. దీనికి మంత్రి బదులిస్తూ.. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. జగన్ పాలనలో నాశనమైన పర్యాటక రంగాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు స్వదేశీ దర్శన్ పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్ల పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయారని, విదేశాలకు వెళ్లి పెట్టుబడుల గురించి అడిగితే ‘ఇండియాలో ఎక్కడైనా ఓకే.. ఏపీ తప్ప’ అంటున్నారని మంత్రి టీజీ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - Mar 06 , 2025 | 04:48 AM