DGP of AP : డీజీపీగా మళ్లీ హరీశ్ కుమార్ గుప్తా!
ABN, Publish Date - Jan 29 , 2025 | 03:39 AM
ఈ నెల 31న పదవీ విరమణ చేయబోతున్న ద్వారకా తిరుమలరావు స్థానంలో డీజీపీగా హరీశ్ కుమార్ ప్రభు త్వం ఎంపిక చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రేపటిలోపు అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం?
రెండ్రోజుల్లో తిరుమలరావు పదవీవిరమణ
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియామకం దాదాపు ఖరారైంది. ఈ నెల 31న పదవీ విరమణ చేయబోతున్న ద్వారకా తిరుమలరావు స్థానంలో ఆయన్ను ప్రభు త్వం ఎంపిక చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిరుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పటి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని తప్పించి గుప్తాను ఎంపిక చేసింది. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తూ ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది. గుప్తా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా నియమితులయ్యారు. గుప్తా 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. తిరుమలరావు మరో రెండ్రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత సీనియారిటీ పరంగా అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్(1991 బ్యాచ్) ఉన్నారు. అయితే శాంతి భద్రతల విభాగంతోపాటు హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, జైళ్ల శాఖ డీజీగా నూ పనిచేసిన అనుభవం ఉన్న హరీశ్ గుప్తా పనితీరుపై సంతృప్తిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నూతన పోలీస్ బాస్‌గా ఆయన్నే ఖరారు చేసినట్లు సమాచారం. గుప్తా నియామకంపై గురువారంలోపే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.
Updated Date - Jan 29 , 2025 | 03:39 AM