Nara Lokesh : 117 జీవో ఉపసంహరణపై ఆమోదయోగ్య పరిష్కారం
ABN, Publish Date - Jan 29 , 2025 | 04:15 AM
గత వైసీపీ సర్కార్ అనాలోచితంగా తీసుకువచ్చిన 117 జీవో ఉపసంహరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఉపాధ్యాయులు, సంఘాల అభిప్రాయాలు తీసుకోండి
అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశం
బదిలీల చట్టంపైనా అభిప్రాయ సేకరణ చేయాలని నిర్దేశం
టీచర్లకు ఇకపై ఒకటే యాప్.. ప్రతి శనివారం నో బ్యాగ్ డే
అమరావతి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కార్ అనాలోచితంగా తీసుకువచ్చిన 117 జీవో ఉపసంహరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, వివిధ సంఘాల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. 117 జీవో ఉపసంహరణపై ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పాఠశాల విద్య డైరెక్టర్ నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలు, సూచనలను అధికారులు మంత్రికి వివరించారు. వాటిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. ఏ ఒక్క విద్యార్థీ డ్రాపౌట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలో తీసుకురానున్న ఉపాధ్యాయ బదిలీ చట్టంపై కూడా క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, సంఘాల అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు సాంకేతిక పరిజ్ఞానం సాయం తీసుకోవాలన్నారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి.. విద్యార్థులకు కో-కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలని సూచించారు. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న యాప్‌ల స్థానంలో ఒకటే యాప్‌ను రూపొందించే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jan 29 , 2025 | 04:15 AM