AP Budget: రూ.3.24 లక్షల కోట్లతో నేడే రాష్ట్ర బడ్జెట్!
ABN, Publish Date - Feb 28 , 2025 | 03:00 AM
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను శుక్రవారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.
సూపర్ సిక్స్, ఇతర హామీలకు ప్రాధాన్యం!
కూటమి వచ్చాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్
అసెంబ్లీలో పయ్యావుల, మండలిలో కొల్లు
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న అచ్చెన్న
పుస్తకాలకు స్వస్తి.. అంతా ట్యాబ్‌లలోనే!
అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత... తొలి పూర్తిస్థాయి బడ్జెట్ రూపుదిద్దుకుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను శుక్రవారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను నవంబరులో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2.94 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోల్చితే ఇది 10 శాతం ఎక్కువ. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా... తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ‘సూపర్ సిక్స్’లో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతోపాటు సంక్షేమానికి భారీగా కేటాయింపులు ఉంటాయని... కేంద్ర సహకారంతో వీటిని అమలు చేసేలా పద్దులు రూపొందించారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి 5 లక్షల ఇళ్లను పేదలకు కట్టించి ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరేలా అవసరమైన మేరకు నిధులు కేటాయించినట్లు సమాచారం. అమరావతి, పోలవరంతోపాటు... వెలిగొండ, వంశధార, హంద్రీనీవా ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది.
వాస్తవిక అంచనాలతో...
కూటమి సర్కారు ఇప్పటిదాకా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తోనే సరిపుచ్చింది. ఇప్పుడు తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. అధికారంలోకి రాగానే బడ్జెట్ రూపొందించాలని భావించినా... గత ఐదేళ్ల ఆర్థిక విధ్వంసం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టత లేకపోవడంతో అది కుదరలేదు. ఇక... కేంద్రం నుంచి వచ్చే నిధులపైనా తగిన అంచనా లేకపోవడంతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు... కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు, పన్నుల్లో వాటాలపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో వాస్తవిక అంచనాలతో రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించినట్లు చెబుతున్నారు. ఒకే ఏడాదిలో పూర్తిస్థాయిలో అద్భుతా లు సృష్టించలేకపోయినప్పటికీ... జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్ది, అభివృద్ధిని గాడిన పెట్టి, సంక్షేమానికి పెద్దపీట వేసేలా బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు మాట.
మంత్రివర్గ సమావేశం..
శుక్రవారం ఉదయం 9 గంటలకు జరిగే మంత్రివర్గ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమవుతుంది. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తికాగానే... వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.50 వేల కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. అన్నదాత-సుఖీభవ, పంటల బీమా, వడ్డీ లేని - పావలా వడ్డీ రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం, ప్రకృతి వ్యవసాయం, ఆయిల్‌పామ్, రాయితీ విత్తనాలు, ఎన్టీఆర్ జలసిరి, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు భృతి, వ్యవసాయ సాంకేతిక పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి, నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
‘పేపర్‌లెస్’ బడ్జెట్
ఈ ఏడాది పూర్తిస్థాయి ‘ఈ-బడ్జెట్’ను ప్రవేశపెడుతున్నారు. ప్రతి ఏటా బడ్జెట్ పుస్తకాలను రాత్రికి రాత్రి ప్రింట్ చేసి తెల్లవారే సరికి అసెంబ్లీకి తెచ్చేవారు. ఇప్పుడు ఈ సంప్రదాయానికి స్వస్తి పలికారు. సభ్యులందరికీ ‘ట్యాబ్’లలోనే బడ్జెట్‌ను లోడ్ చేసిఇస్తారు.
Updated Date - Feb 28 , 2025 | 07:13 AM