CM Chandrababu : సంక్షేమం, అభివృద్ధి చేసి చూపిస్తాం
ABN, Publish Date - Jan 01 , 2025 | 07:17 AM
కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు.
కొత్త పథకాలకు వేదికగా 2025: చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం రాత్రి ఆయన ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నా. 2024లో మీరు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పని చేస్తోంది. కేవలం ఆరు నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలను ఆవిష్కృతం చేశాం. స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారమే లక్ష్యంగా పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తూ, అటు ప్రజా సంక్షేమాన్ని, ఇటు రాష్ట్రాభివృద్ధిని మీ అందరి సహకారంతో చేసి చూపిస్తాం. మీ అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ 2025’ అని పేర్కొన్నారు. ఇప్పటికే చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్థావించారు.
టీడీపీ కార్యాలయానికి బొకేలు, కేక్‌లు తేవొద్దు: అశోక్‌బాబు
నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలవటానికి వచ్చే వారెవరూ బొకేలు, పూలదండలు, కేక్‌లు, స్వీట్లు తేవొద్దని పార్టీ కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్‌బాబు కోరారు. వాటిని పార్టీ కేంద్ర కార్యాలయంలోకి అనుమతించరని చెప్పారు. వాటికి అయ్యే ఖర్చుతో మొక్కలు నాటడం, పేదలకు భోజన సదుపాయం కల్పించడం, విద్యార్థులకు పెన్నులు, పుస్తకాల వంటి బహుమతులివ్వడం ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
Updated Date - Jan 01 , 2025 | 07:17 AM