CM Chandrababu : ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తాం
ABN, Publish Date - Jan 29 , 2025 | 02:47 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
జూన్‌లోపు నామినేటెడ్, పార్టీ పదవులన్నీ భర్తీ
పార్టీని నమ్ముకున్నవారినే నేతలు ప్రోత్సహించాలి
పార్టీ సభ్యత్వం బాగా చేసిన వారికీ పదవులు
పదవి పొందిన వారి పనితీరుపై రెండేళ్ల తర్వాత సమీక్ష
దాని ఆధారంగా భవిష్యత్ అవకాశాలు: టెలికాన్ఫరెన్స్‌లో సీఎం
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీల్లో పేర్కొన్న పథకాలన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కింది స్థాయి పార్టీ నేతలతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘పథకాలన్నీ ఇస్తాం. వైసీపీ తప్పుడు ప్రచారాలను చూస్తూ ఊరుకోవద్దు. గట్టిగా తిప్పికొట్టండి. ఇప్పటికే వ్యవస్థలను గాడిలో పెట్టాం’ అని న్నారు. కాగా, పార్టీ అంతర్గత నిర్మాణానికి సంబంధించిన క్లస్టర్ కమిటీల్లో ఉండి పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు దక్కుతాయని చంద్రబాబు తేల్చిచెప్పారు. ‘అసెంబ్లీ ఎన్నికల ముందు మనం పార్టీ పని కోసం అంతర్గతంగా వివిధ స్థాయిల్లో క్లస్టర్ కమిటీలు పెట్టాం. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ కమిటీలను కలిపి క్యూబ్స్ అని పిలుస్తున్నాం. ఈ కమిటీల్లో ఉండి పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తాం. పదవులు పొందే నేతలు వీటిలో ఉండి తీరాలి. వారినే పదవుల కోసం నాయకులు సిఫారసు చేయాలి’ అని స్పష్టం చేశారు. సహకార సంస్థలు, 214 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 1100 ఆలయ ట్రస్ట్ బోర్డులు భర్తీ చేయాల్సి ఉందని, వీటి భర్తీకి సరైన ప్రతిపాదనలు పంపాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు.
పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడగా.. చంద్రబాబు సమ్మతించారు. ‘బాగా పనిచేసిన వారి పేర్లనే నామినేటెడ్ పదవులకు సిఫారసు చేయండి. ఎమ్మెల్యేలం... ఎంపీలం అయిపోయాం కాబట్టి ఇక కార్యకర్తలతో పనిలేదని అనుకోవద్దు. వారిని దగ్గరకు తీయండి. ఆప్యాయంగా పలకరించండి. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం జరిగేలా మీరూ మేమూ కలిసి నామినేటెడ్ పదవులు భర్తీ చేద్దాం. జూన్‌లోపు ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు అన్నీ భర్తీ చేస్తాం.సభ్యత్వం బాగా చేసిన వారికి కూడా పదవుల్లో ప్రోత్సాహం ఇస్తాం’ అని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లో నిరంతరం పనిచేయాలని పార్టీ నేతలను కోరారు.
Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..
Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..
Updated Date - Jan 29 , 2025 | 02:48 AM