CM Chandrababu : ఆక్వాతో అభివృద్ధి
ABN, Publish Date - Feb 19 , 2025 | 03:40 AM
టెక్నాలజీని వాడితే ఆక్వా రంగంలో మరిన్ని అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ఖర్చులు తగ్గించేందుకు, నాణ్యత పెంచేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ను ఆక్వా రంగంలోనూ విరివిగా
ఏపీకి గ్రోత్ ఇంజన్‌గా ఆక్వా పరిశ్రమ
టెక్నాలజీ వాడితే అద్భుత ఫలితాలు
నూతన పద్ధతులతో 30% వృద్ధి సాధ్యం
ఏఐతో రొయ్యల వ్యాధులు విశ్లేషించవచ్చు
ప్రకృతి సేద్యంతో ప్రపంచవ్యాప్త డిమాండ్
ఆక్వా రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యం
నిబంధనల ప్రకారమే సాగు చేపట్టాలి
‘ఆక్వా టెక్ 2.0’ సదస్సులో సీఎం
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఆక్వా రంగం గ్రోత్ ఇంజన్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. టెక్నాలజీని వాడితే ఆక్వా రంగంలో మరిన్ని అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ఖర్చులు తగ్గించేందుకు, నాణ్యత పెంచేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ను ఆక్వా రంగంలోనూ విరివిగా వాడాలన్నారు. రొయ్యలకు ఏ జబ్బులు వచ్చే అవకాశం ఉందో ఏఐతో ముందే విశ్లేషించి తెలుసుకోవచ్చని, సరైన మందులతో ముందుగానే చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. సాంకేతికను జోడించి, నూతన పద్ధతులు అవలంబిస్తే.. ఆక్వా రంగంలో 30ు వృద్ధి రేటు సుసాధ్యం చేయవచ్చని చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్‌లో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ (జీఎ్‌ఫఎ్‌సటీ), ఏపీ మత్స్యశాఖ సంయుక్తంగా మూడు రోజుల పాటు నిర్వహించిన ‘ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్-2.0’ సదస్సుకు చివరిరోజైన మంగళవారం సీఎం చంద్రబాబు హాజరై ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల ఎకరాల ఆక్వా సాగు 2029-30 నాటికి 10 లక్షల ఎకరాలకు పెరగాలి. అయితే కాలుష్య రహితంగా ఆక్వా సాగవ్వాలి. ప్రకృతి సేద్యం ద్వారా ఏపీ ఆక్వా ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడుతుంది. ఈ విధానాన్ని అమలు చేయాలి. ఆక్వా దాణా విషయంలో తగు మార్పులు చేయాలి. ప్రతి ఆక్వా రైతూ సాగు వివరాలు రిజస్టర్ చేయించుకోవాలి. ఇష్టానుసారం చేస్తానంటే మాత్రం ప్రభుత్వం నిబంధనల ప్రకారం వ్యవహరిస్తుంది. ఆక్వాకు ప్రాధాన్యమే మా ప్రభుత్వ అభిమతం.
నిబంధనల అమలుకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం. కాలుష్య నియంత్రణ విషయంలో కఠినంగా ఉంటాం. రాష్ట్ర స్థూల విలువ జోడింపు(జీవీఏ)లో 8.8ు ఆక్వా వాటాగా ఉంది. ఉత్పత్తి తక్కువున్నా వియత్నాం వాళ్లు విలువ జోడింపులో ముందున్నారు. వియత్నాం 3.9 మిలియన్ టన్నులు ఎగుమతులతో 13 బిలియన్ డాలర్లు ఆర్జిస్తుండగా, మనం 5 మిలియన్ టన్నుల ఎగుమతి చేస్తూ 3 మిలియన్ డాలర్లు మాత్రమే ఆర్జిస్తున్నాం. మనం కూడా ఆ దిశగా ప్రయాణం చేయడానికి ఈ సదస్సులు ఉపయోగపడతాయి. పంటల ఉత్పత్తితో పాటు ప్రొసెసింగ్ ఉంటేనే వ్యవసాయ ఆధార పరిశ్రమకు భవిష్యత్ ఉంటుంది. ఈ ప్రయత్నాలకు ప్రభుత్వం అన్ని రకాలా ప్రోత్సాహం అందిస్తుంది. మన ఉత్పత్తులను ప్రొసెస్ చేయడం ద్వారా మంచి ధరలు పొందవచ్చు. ప్రపంచ ఆహార అలవాట్లు మారుతున్నాయి. దానికి అనుగుణంగా రైతులు కూడా సాగులో మార్పులు చేయాలి. ఆహార పదార్థాల సర్టిఫికేషన్, ట్రేసబులిటీ అనేది రానున్న రోజుల్లో ప్రాధాన్య అంశంగా మారిపోతుంది. రానున్న రోజుల్లో దక్కే అవకాశాలను గుర్తించి, అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి’’ సీఎం చెప్పారు.
Updated Date - Feb 19 , 2025 | 03:40 AM