AP Deputy CM : పరిసరాల శుభ్రత.. అందరి బాధ్యత
ABN, Publish Date - Jan 19 , 2025 | 05:23 AM
‘స్వచ్ఛత అనేది ప్రజల జీవన విధానంలో ఓ భాగం కావాలి. శుభ్రత అనేది ప్రజల ఆలోచనకు ప్రతిరూపం కావాలి. పారిశుధ్య కార్మికులు, క్లాప్ మిత్రలకు మాత్రమే బాధ్యత ఉందని అనుకోవద్దు.
నంబూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’
పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్
పెదకాకాని, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘స్వచ్ఛత అనేది ప్రజల జీవన విధానంలో ఓ భాగం కావాలి. శుభ్రత అనేది ప్రజల ఆలోచనకు ప్రతిరూపం కావాలి. పారిశుధ్య కార్మికులు, క్లాప్ మిత్రలకు మాత్రమే బాధ్యత ఉందని అనుకోవద్దు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, స్వచ్ఛతను కాపాడటం మన అందరి బాధ్యత’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత వివిధ రకాల స్టాళ్లు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు. చెత్త రవాణా వాహనాన్ని ప్రారంభించి, ట్రాక్టర్ నడిపారు. అనంతరం పవన్ కల్యాణ్ విలేకర్లతో మాట్లాడుతూ వికసిత్ భారత్-2047 లక్ష్యంలో స్వచ్ఛత ప్రధానమైందన్నారు. కరోనా సమయంలో ఉన్నట్లుగా పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛత విషయంలో క్రమశిక్షణ రావాలన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రత అనేది మనందరి జీవితంలో ఒక భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. భవిష్యత్తులో చెత్త కనిపించని భారతదేశం సాకారం కావాలని తెలిపారు. ఇంట్లోనే చెత్తను వేరు చేయాలని, దాని పునర్వినియోగం ద్వారా సంపద సృష్టించవచ్చన్నారు. చెత్త ద్వారా విద్యుత్ ప్లాంటు నిర్వహణ, వర్మీ కంపోస్టు తయారు చేసేందుకు స్థానిక సంస్థలు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఇంట్లోనే చెత్తను వేరుచేయడం, దానిని నిర్మూలించినప్పుడే చెత్త ఉత్పత్తి తగ్గుతుందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రతి నెలా మూడో శనివారం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేపట్టాలని ఆదేశించారు. ప్రజలను సైతం భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఆస్పత్రుల నుంచి వచ్చే బయో వ్యర్థాల నిర్వహణపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో మాట్లాడి వాటి నిర్వహణపై దృష్టి పెడతామన్నారు. బయో వ్యర్థాల నిర్వహణ అనేది స్వచ్ఛతలో కీలకమైనదని తెలిపారు.
క్లాప్ సిబ్బంది వేతనాల పెంపునకు ప్రయత్నిస్తా
క్లాప్ సిబ్బందికి వేతనాల విషయం తన దృష్టికి వచ్చిందని, దీన్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి వేతనాలు పెంచేలా ప్రయత్నిస్తానని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. ఇటీవల విజయవాడ వరదల సమయంలో ఎంతో కష్టపడి పని చేసి, ప్రజల మన్ననలు అందుకున్న 35మంది పారిశుధ్య సిబ్బందిని సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పారిశుధ్య సిబ్బంది సేవలు అమూల్యమైనవని, వారిని గౌరవించుకోవడం ప్రజలందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి శశిభూషణ్‌కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 19 , 2025 | 05:23 AM