AP Tourism Development Corporation: అవినీతి అధికారులపై శాఖాపరమైన చర్యలు
ABN, Publish Date - Jan 18 , 2025 | 06:08 AM
గత ప్రభుత్వంలో టూరిజం శాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బోర్డులో తీర్మానం చేశామని ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు.
ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజి
తిరుపతి అర్బన్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో టూరిజం శాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బోర్డులో తీర్మానం చేశామని ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. శుక్రవారం ఆయన తిరుపతిలో ఏపీటీడీసీకి సంబంధించిన ఆస్తులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘అలిపిరి వద్ద నిర్మిస్తున్న టూరిజం భవనం నిర్మాణ ఒప్పందాన్ని కాంట్రాక్టర్లకు మేలు చేసేలా రూపొందించారు. ఈ టెండర్‌ను రద్దు చేయడానికి ప్రయత్నిస్తాం. ఏపీటీడీసీకి టీటీడీ జారీ చేసే 1,000 టికెట్లను వివిధ ప్యాకేజీల రూపంలో వినియోగిస్తున్నాం. టీటీడీకి సక్రమంగానే చెల్లింపులు జరిగాయి. అయితే టికెట్లు బుక్ చేసుకున్న కొందరు భక్తులు ప్యాకేజీ బస్సుల్లో రాకుండా ఇతర వాహనాల్లో వచ్చారు. దాంతో గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై కొద్దిపాటి అవినీతికి పాల్పడ్డారు. దీనికి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మాజీ సీఎం జగన్ తనకు మాత్రమే ఉపయోగపడేలా రిషికొండపై రూ.500 కోట్లతో నిర్మించిన భవనాలను ఏం చేయాలో తెలియడం లేదు’ అని అన్నారు.
Updated Date - Jan 18 , 2025 | 06:08 AM