AP Govt : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకుఅదనపు రాయితీ
ABN, Publish Date - Feb 18 , 2025 | 04:37 AM
ప్రతిభావంతులైన మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు రాయితీలు ప్రకటించింది.
మూలధన వ్యయం, విద్యుత్తు, భూమి ధరల్లో భారీగా రాయితీలు పెంపు
పారిశ్రామిక విధానానికి సవరణలు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారితోపాటు, విభిన్న ప్రతిభావంతులైన మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు రాయితీలు ప్రకటించింది. ప్రధానంగా మూలధన వ్యయం, విద్యుత్తు, భూముల ధరల్లో రాయితీలను భారీగా పెంచుతూ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే, రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు నెలకొల్పే మహిళలకు మాత్రమే ఈ ప్రత్యేక రాయితీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. 2029-2030 నాటికి రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామికవేత్త(ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త)గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎ్‌సఎంఈ) అభివృద్ధి పాలసీ-4.0ని ప్రకటించింది. దీనిలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించి, రాష్ట్రంలో పెద్దఎత్తున చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాల ప్యాకేజీలను తెచ్చింది. అయితే, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామివేత్తలకు పరిశ్రమల నిర్వహణ వ్యయ భారాన్ని తగ్గించేందుకు ఇంకా మెరుగైన ప్రోత్సాహకాలు అందించాలని దళిత పారిశ్రామికవేత్తలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమల సంఘాలు, పలువురు ఎమ్మెల్యేలు లేఖలు రాయడంతో సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. సీఎం ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఆయా వర్గాలతో విస్తృతస్థాయిలో చర్చలు జరిపి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ప్రయోజనం కోసం పాలసీలో చేయాల్సిన సవరణలపై ప్రభుత్వానికి సిఫారసులు చేశారు.
సవరణలు ఇవీ..
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఇప్పటి వరకు 35 శాతంగా ఉన్న పెట్టుబడి రాయితీని 45 శాతానికి పెంచారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు ఎక్కువగా రవాణా సేవలపై మొగ్గు చూపుతుండటంతో ఆయా వర్గాలకు రవాణా, లాజిస్టిక్స్‌పై కూడా 45 శాతం రాయితీని వర్తింపజేస్తారు.
విద్యుత్తు రాయితీని యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఐదేళ్లపాటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ను కూడా ఐదేళ్లపాటు ఇవ్వాలని నిర్ణయించింది. టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ వ్యయాన్ని 40 శాతానికి పెంచారు.
పరిశ్రమలకు కేటాయించే భూమి విలువపై 50 శాతం రాయితీ ఉండేది. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్కులలో భూములు పొందే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 75 శాతం రాయితీని కల్పిస్తారు.
ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో కూడా సవరణలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తూ ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది.
Updated Date - Feb 18 , 2025 | 04:37 AM