AP Network Hospitals : రేపటి నుంచి ఉచిత ఓపీ, ఈహెచ్‌ఎస్ సేవల బంద్
ABN, Publish Date - Jan 05 , 2025 | 05:59 AM
నెట్‌వర్క్ ఆస్పత్రులకు భారీగా బకాయిలు పేరుకుపోవడంతో సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు, ఉచిత ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్...
నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బకాయిలు
కనీసం రూ.1500 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
25 తర్వాత సేవలు పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరిక
ఆరోగ్య బీమాలో కో-పేమెంట్ విధానం అమలుకు డిమాండ్
అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): నెట్‌వర్క్ ఆస్పత్రులకు భారీగా బకాయిలు పేరుకుపోవడంతో సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు, ఉచిత ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్(ఆశా) అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్ తెలిపారు. శనివారం విజయవాడలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టిందని, పాత ప్రభుత్వంలో రూ.2,250 కోట్ల బకాయిలున్నాయని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో రూ.1500 కోట్ల బిల్లులు విడుదల చేసినప్పటికీ ఇంకా, రూ.3 వేల కోట్లు బకాయిలున్నాయని తెలిపారు. ఆస్పత్రల ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఉచిత వైద్య సేవలు అందించలేకపోతున్నామని చెప్పారు. బకాయిల వల్ల నెట్‌వర్క్ ఆస్పత్రులకు మందులు, వైద్య పరికరాలు, రసాయనాల సరఫరాను వ్యాపారులు నిలిపివేశారన్నారు. ఓవర్ డ్రాఫ్ట్ అవడంతో బ్యాంక్‌లు కూడా సహకరించడం లేదని చెప్పారు. దీంతో 6వ తేదీ నుంచి వైద్య సేవలు నిలిపివేస్తున్నామని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామన్నారు. బకాయిలు క్లియర్ చేస్తామని ట్రస్ట్ సీఈవో ఫోన్‌లో చెప్పారని, సోమవారం చర్చలకు రావాలన్నారని తెలిపారు. ప్రభుత్వంపై గౌరవంతో 6వ తేదీ నుంచి ఓపీ, ఈహెచ్‌ఎస్ సేవలు మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు ప్రభుత్వం ఆరోగ్యబీమా విధానంలోకి వెళ్తే రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల మనుగడ కష్టమన్నారు. ఆరోగ్య బీమాలో కనీసం కో-పేమెంట్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఆరోగ్య బీమా ద్వారా వంద శాతం క్యాష్‌లెస్ అంటే ఆస్పత్రులు నడవడం కష్టమని చెప్పారు. అంతకు ముందు ఆస్పత్రుల యాజమాన్యాలు సమావేశమై ఆస్పత్రుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించాయి. ఈనెల 25వ తేదీ వరకూ ప్రభుత్వానికి సమయం ఇద్దామని, అప్పటికి కనీసం రూ.1500 కోట్ల బకాయిలు విడుదల చేయకపోతే సేవలు నిలిపివేయాలని మేజార్టీ సభ్యులు నిర్ణయించారు. దీనిపై ఆశా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సోమవారం ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
Updated Date - Jan 05 , 2025 | 05:59 AM