AP Government: 18 మీటర్ల లోపు ఎత్తు భవన నిర్మాణాలకు
ABN, Publish Date - Mar 04 , 2025 | 05:07 AM
భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై 18 మీటర్ల లోపు లేదా ఐదంతస్తుల లోపు భవన నిర్మాణ అనుమతులకు స్వీయ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది.
స్వీయ ధ్రువీకరణ ఇస్తే సరి
టౌన్‌ప్లానింగ్ అధికారుల అనుమతి అవసరం లేదు!
అందుబాటులోకి సాఫ్ట్‌వేర్.. భవన నిర్మాణదారులకు సర్కారు శుభవార్త
అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై 18 మీటర్ల లోపు లేదా ఐదంతస్తుల లోపు భవన నిర్మాణ అనుమతులకు స్వీయ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. టౌన్‌ప్లానింగ్ అధికారుల అనుమతి అవసరం లేకుండానే భవన నిర్మాణాలకు అనుమతి వస్తుంది. అయితే భవన యజమానులు రిజిస్టర్డ్ ఎల్‌టీపీలు, ఇంజనీర్లు లేదా ఆర్కిటెక్ట్‌ల సమక్షంలో సరైన పత్రాలు సమర్పించి అఫిడవిట్ ఇవ్వాలి. దీనికి సంబంధించి గత నెలలోనే భవన నిర్మాణ అనుమతులకు కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసినప్పటికీ సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. భవన నిర్మాణాల అనుమతుల ప్రక్రియను త్వరితగతిన జారీచేసేలా ఈ కొత్త విధానాన్ని సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా నిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ఏపీడీపీఎంఎస్ పోర్టల్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ విధానం ఆమోదం పొందిన లేఅవుట్లు, గ్రామకంఠం, సర్కులేషన్ ప్లాన్లు ఉన్న ప్రాంతాలు, 1985కు ముందు నిర్మించిన భవనాల పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు.
Updated Date - Mar 04 , 2025 | 05:07 AM