Nara Lokesh: జగన్ హయాంలో విద్యా వ్యవస్థ నాశనం.. అసర్ నివేదికపై మంత్రి నారా లోకేష్ స్పందన..
ABN, Publish Date - Jan 29 , 2025 | 06:03 PM
ప్రచారంలో మేనమామ అని చెప్పుకున్న జగన్, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని అన్నారు. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో బయటపడిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రచారంలో మేనమామ అని చెప్పుకున్న జగన్, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని అన్నారు. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 2018లో నాటి టీడీపీ హయాంలో మెరుగ్గా ఉన్న ప్రభుత్వ విద్యా ప్రమాణాలు వైసీపీ పాలనలో ఎలా దిగజారాయో అసర్ నివేదిక స్పష్టంగా వెల్లడించిందని తెలిపారు (Nara Lokesh).
గత ప్రభుత్వపు పాలకులు అడ్డగోలు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారన్నారు. అక్షరాలు, అంకెలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు ఉన్నారని, స్కూళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శించారు. ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో దాదాపు సగం మంది రెండో తరగతి పుస్తకాలు కూడా సరిగా చదవలేని స్థితిలో ఉన్నారని, విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఏడు నెలలుగా అనేక చర్యలు తీసుకున్నానని వివరించారు. నిరంతరం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటూ అనేక మార్పులకు నాంది పలికానని చెప్పారు.
ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారో తెలుసుకుని, మారుతున్న కాలానికి తగ్గట్టుగా పాఠ్యప్రణాళిక సిద్ధం చేయడం, విలువలతో కూడిన విద్య అందించే ప్రయత్నాలు చేయడం ప్రారంభించామన్నారు. విద్యార్థులకు క్రీడలతో సహా ఇతర రంగాల్లో కూడా గైడెన్స్ ఇవ్వడం, పాఠశాలలో కనీస మౌలికవసతులు కల్పించడం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం మొదలైన అనేక అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తున్నామన్నారు. త్వరలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందించి ప్రజలు, విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకోబోతున్నామని లోకేష్ ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jan 29 , 2025 | 06:03 PM