Water Resources Dept : 21 వేల కోట్లతో సరిపెట్టుకోండి!
ABN, Publish Date - Feb 11 , 2025 | 05:51 AM
సంబంధిత శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
జల వనరుల శాఖ బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి పయ్యావుల సూచన
ఈ మొత్తం చాలదన్న నిమ్మల
రూ.32,000 కోట్లు కావాలని వినతి
అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో ఈ నెలలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శాఖలవారీ కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు జరుగుతోంది. సంబంధిత శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో జల వనరుల శాఖపై భేటీకి ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. నీటి ప్రాజెక్టులకు రూ.32 వేల కోట్లు కేటాయించాలని జల వనరుల శాఖ ప్రతిపాదించగా.. అంత పెద్దమొత్తంలో కేటాయింపులు అసాధ్యమని.. ఈ ఏడాదికి రూ.21 వేల కోట్లతో సర్దుకోవాలని నిమ్మలకు పయ్యావుల సూచించారు. ఇందులో పోలవరం ప్రాజెక్టుకు రూ.9,000 కోట్లు, గాలేరు-నగరి, హంద్రీ-నీవాకు చెరో రూ.4,500 కోట్లు, వెలిగొండకు రూ.1,800 కోట్లు ఇస్తామన్నారు. అయితే ఈ కేటాయింపులతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇతర చిన్న, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులను ఎలా చేపడతామని నిమ్మల ప్రశ్నించారు. చాలా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవన్నారు. ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరారు.
2019-24 మధ్య జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో.. అవన్నీ నిర్వీర్యంగా మారాయన్నారు. ప్రఽధానంగా ప్రాజెక్టుల గేట్లు నిర్వహణ కోసం లస్కర్ వ్యవస్థ కూడా లేకుండా పోయిందని తెలిపారు. గేట్లకు గ్రీజు పూసే పనులూ చేయలేదన్నారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణ కూడా నిలిచిపోయిందని.. ఈ నేపథ్యంలో వీటితోపాటు మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులకూ నిధులు కేటాయించాలని కోరారు. దీంతో ఈ అంశంపై మంగళవారం కూడా చర్చలు కొనసాగించాలని పయ్యావుల నిర్ణయించారు.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?
Updated Date - Feb 11 , 2025 | 05:59 AM