AP Govt : కోరమాండల్‌కు ప్రోత్సాహకాలు
ABN, Publish Date - Feb 11 , 2025 | 05:57 AM
ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీకి ప్రోత్సాహకాలను అందించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రూ. 529 కోట్ల రాయితీ పదేళ్లలో చెల్లింపు
యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్
అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): కాకినాడలో ఎరువుల కర్మాగారాన్ని విస్తరించడానికి ముందుకు వచ్చిన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీకి ప్రోత్సాహకాలను అందించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవల్‌పమెంట్ పాలసీ (4.0) ప్రకారం టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ప్రొవిజన్ కింద ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడలో కోరమాండల్ సంస్థ మరో రూ. 1,539 కోట్ల అదనపు పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ పాస్ఫటిక్ ఫెర్టిలైజర్ ప్లాంట్ విస్తరణ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇవి కార్యరూపం దాల్చితే కాకినాడలో ఆ కంపెనీ ఎరువుల ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 20 లక్షల టన్నుల నుంచి 37.5 శాతం పెరిగి 27.5 లక్షల టన్నులకు చేరుతుంది. 2027 జనవరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. దీంతో బిల్డింగ్ కాంపోనెంట్ సహా మూలధన పెట్టుబడిపై టైలర్ మేడ్ ఇన్సెంటివ్‌గా 40ు రాయితీ కింద పదేళ్ల వ్యవధిలో రూ. 529 కోట్లు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ. 74 కోట్ల డీకార్బనైజేషన్ సబ్సిడీని పదేళ్ల వ్యవధిలో చెల్లించనుంది. యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్ రాయితీని ప్రకటించింది. ఈ ప్రాజెక్టును త్వరితగతిన ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. సింగిల్ డెస్క్ పోర్టల్ 2.0 కింద అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వాలని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. విద్యుత్తు, జలవనరులు, పరిశ్రమలు, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి, రెవెన్యూ, ఆర్థికశాఖ, ఇతర సంబంధిత శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?
Updated Date - Feb 11 , 2025 | 05:57 AM