Guntur : ఎండీఎంఏ మత్తులో ఇంజనీరింగ్ విద్యార్థులు
ABN, Publish Date - Feb 19 , 2025 | 03:44 AM
ఎండీఎంఏ ఉన్న 9 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను గుంటూరు ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.
గుంటూరులో 9 మంది అరెస్ట్.. ఇద్దరు పరారీ
గుంటూరు కార్పొరేషన్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): నిషేధిత మత్తుమందు మిథలిన్ డయాక్సి మెథాంఫెటెమిన్(ఎండీఎంఏ)ను బెంగళూరు నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్న, దాన్ని వినియోగిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు గుంటూరు పోలీసులకు పట్టుబడ్డారు. ఎండీఎంఏ ఉన్న 9 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను గుంటూరు ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన నితిన్.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఎం సాయికృష్ణకు ఎండీఎంఏను విక్రయించాడు. గుంటూరు సమీపంలోని గోరంట్లలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకుని ఉంటున్న సాయికృష్ణ దీన్ని పరిసర ప్రాంతాల్లోని రెండు ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు విక్రయిస్తున్నాడు. దీంతోపాటు గంజాయి కూడా అమ్ముతున్నాడు. ఈ కేసులో మొత్తం 11 మంది భాగస్వాములు కాగా, 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నట్లు గుంటూరు ఎక్సైజ్ డీసీ డాక్టర్ కే శ్రీనివాసులు, జిల్లా అధికారి అరుణకుమారి, సీఐ యశోధరాదేవి తెలిపారు.
Updated Date - Feb 19 , 2025 | 03:44 AM