కలగానే మిగిలిన ఇంజనీరింగ్ కళాశాల
ABN, Publish Date - Nov 26 , 2024 | 10:30 PM
జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. దీంతో పాలిటెక్నిక్, ఇంజర్ పూర్తి చేసిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి చదివించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
బెల్లంపల్లి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. దీంతో పాలిటెక్నిక్, ఇంజర్ పూర్తి చేసిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి చదివించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు తల్లిదండ్రులు దూర ప్రాంతాలకు పంపించే ఆర్థిక స్ధోమత లేక డిగ్రీ కోర్సుల్లో చేర్పిస్తున్నారు. కళాశాల ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నా అనంతరం విస్మరిస్తున్నారు. కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు, ప్రజలు, డిమాండ్ చేస్తున్నా అందని ద్రాక్షగానే మిగిలుతుంది.
బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శ్రీరాంపూర్‌లో సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఈ కళాశాలలు దాదాపు 20 ఏండ్ల క్రితమే ఏర్పాటయ్యాయి. వీటిలో ఈఈఈ, ఈఐ, మైనింగ్, సివిల్, మెకానిక్, సీఎస్‌ఈ కంప్యూటర్స్ వంటి కోర్సులు ఉన్నాయి. బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో 540 మంది, శ్రీరాంపూర్ కళాశాలలో 900 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నారు. పాలిటెక్నిక్ అనంతరం దూర ప్రాంతాలకు వెళ్లి ఇంజనీరింగ్ చదవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. హైద్రాబాద్, వరంగల్, జగిత్యాల, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాలకు వెళ్లి ఇంజనీరింగ్ చదువుతున్నారు. పేద విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదవాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది.
-జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల లేని వైనం
జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో పది పాలిటెక్నిక్ కళాశాలలను ఇంజనీరింగ్ కళాశాలలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసినప్పటికీ జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలలకు చోటు దక్కలేదు. ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్‌లో ఇంజనీరింగ్ విద్య చదవాలంటే రూ. 10 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని పేర్కొంటున్నారు. ప్రైవేటు ఫీజులు చెల్లించలేని ఎంతో మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు.
42 ఎకరాల విశాలమైన స్థలం...
బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల 1993లో ఏర్పాటు చేశారు. ఈ కళాశాల 42 ఎకరాల విశాలమైన స్థలంలో ఉంది. కళాశాల భవనం, తరగతి గదులు, ప్రయోగశాలలు, వసతి గృహాలు ఉన్నాయి. ఇంకా 40 ఎకరాల స్థలం ఉంది. ఇందులో ఇంజనీరింగ్ కళాశాల భవనం నిర్మించవచ్చు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాలలో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేస్తే జిల్లా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది. గతంలో విద్యార్ధులు, విద్యార్ధి సంఘాల నాయకులు మెడికల్ కళాశాలతోపాటు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కళాశాలను మంచిర్యాలకు కేటాయించారు. బెల్లంపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత అమలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాల కోసం ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విద్యార్థులు, విద్యార్ధి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
Updated Date - Nov 26 , 2024 | 10:30 PM