గ్రూప్ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి
ABN, Publish Date - Dec 13 , 2024 | 10:36 PM
గ్రూప్ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ మోతిలాల్, డీసీపీ భాస్కర్, అదనపు డీసీపీ రాజులతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గ్రూప్ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ మోతిలాల్, డీసీపీ భాస్కర్, అదనపు డీసీపీ రాజులతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరీక్ష నిర్వహణకు 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 14,951 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ మోతిలాల్, పోలీసు నోడల్ అధికారి ఏఆర్ ఏసీపీ సుందర్, రీజియన్ కోఆర్డినేటర్‌గా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్‌రెడ్డిలను నియమించామన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది, పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు. తాగునీరు, మూత్రశాలలు, విద్యుత్, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ నెల 15న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2, ఈ నెల 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 3, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 4 పరీక్షలు ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెల్, ఒరిజినల్ గుర్తింపు కార్డుతో హాజరు కావాలని సూచించారు. అభ్యర్ధులు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాలను పరిశీలించుకోవాలని సూచించారు. డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్, ఇంటర్నెట్ షాపులు మూసి వేయాలన్నారు.
ఇసుక తరలింపునకు ప్రత్యేక చర్యలు
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గృహావసరాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఇసుక తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకొంటామని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక రీచ్‌ల నుంచి మరింత ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వేంపల్లి, వేలాల ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతి తీసుకోవాలని, రీచ్ నిర్వహణకు ఇసుక నిల్వల భౌతిక అంచనా నివేదికల రూపకల్పనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రీచ్‌లలో సిరిటేషన్ చేయాలన్నారు. ఆర్డీవో శ్రీనివాసరావు, డీపీవో వెంకటేశ్వర్‌రావు, రోడ్లు భవనాలు, రెవెన్యూ,భూగర్భ జల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 13 , 2024 | 10:36 PM