ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deputy CM Pawan Kalyan : డోలీ మోతలు తప్పిస్తాం

ABN, Publish Date - Dec 21 , 2024 | 03:44 AM

రుషికొండలో ప్యాలెస్‌ నిర్మాణం కోసం రూ.500 కోట్ల ప్రజాధనం వృథా చేసిన గత వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయలేకపోయిందని...

  • 3 విడతల్లో 4 వేల తండాలకు రోడ్లు

  • 2 నెలలకోసారి మన్యంలో పర్యటిస్తా

  • గిరిజన గ్రామాల సమస్యలు పరిష్కరిస్తా

  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హామీ

  • మన్యం జిల్లాలో రోడ్ల పనులకు శంకుస్థాపన

స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇప్పటికీ రోడ్లు, వైద్యం తదితర మౌలిక సదుపాయల్లేని గ్రామాలు ఉండడం సరికాదు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా చర్చించా. రాష్ట్రంలో నాలుగు వేల తండాలకు రోడ్లు కావాల్సి ఉంది. మూడు విడతలుగా అన్ని గ్రామాలకు రోడ్లు వేస్తాం. డోలీ మోతలు తప్పించేందుకు అన్ని గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపడతాం.

- డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

పార్వతీపురం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): రుషికొండలో ప్యాలెస్‌ నిర్మాణం కోసం రూ.500 కోట్ల ప్రజాధనం వృథా చేసిన గత వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయలేకపోయిందని, నిధులు కేటాయించలేకపోయిందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సిరివర వద్ద రూ.9.50 కోట్లతో చేపట్టనున్న రోడ్డు పనులకు సంబంధించి మక్కువ మండలం బాగుజోల వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం జోరున వర్షం కురుస్తున్నా సుమారు కిలోమీటరు వరకు నడుచుకుంటూ కొండపై ఉన్న చిలక మెండంగి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం తిరిగి బాగుజోలకు చేరుకున్నారు. అక్కడ గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ‘గత ప్రభుత్వం మద్యం ఆదాయం పేరిట, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చినా గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయలేకపోయింది. వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.350 కోట్లు ఇస్తే, గత ఐదేళ్లలో వచ్చిన ఆ నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. దీంతో వెనుకబడిన జిల్లాలు మరింత వెనుకబడ్డాయి. బుగ్గలు నిమరడం, తలపై చేయివేసి నిమరి మాటలు చెప్పి వెళ్లిపోవడం నాకు తెలియదు. ఏదో చెప్పి వెళ్లిపోవడం కాదు మాట ఇస్తున్నా.. క్షేత్రస్థాయిలో గిరిజనుల కష్టాలు తెలుసుకోవడానికే వచ్చా.


పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, సహచర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, నేను ప్రజల కోసం కూలీలా పనిచేస్తాం. కొద్ది నెలల కిందట ప్రజల కష్టాలు తీర్చాలని తిరుమల కొండ ఎక్కాను. మళ్లీ గిరిజనుల కష్టాలు తెలుసుకోవడానికి ఇక్కడ కొండ ఎక్కాను. ప్రతి రెండు నెలలకు ఒకసారి మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తా. గిరిజన గ్రామాల్లో సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తా. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నాతో పాటు పీఎం మోదీ, సీఎం చంద్రబాబు ఉన్నారు. గిరిజన యువత వివిధ నైపుణ్యాల సాధనకు కృషి చేయాలి. యువత నైపుణ్యాలు సాధిస్తే ఉపాధి అవకాశాలు పొందొచ్చు’ అన్నారు.

  • ఏజెన్సీలో రహదారుల నిర్మాణం

‘ఉపాధి హామీ పథకం కింద రూ.36.71 కోట్ల అంచనా వ్యయంతో జిల్లాలో 19 గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేశాం. నిధుల సమస్య ఉన్నా రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. గిరిజన ప్రాంతాలకు పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నేను మీసం మెలిస్తే, ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. సీఎం, పీఎంలకు ఇక్కడి పరిస్థితి వివరించి నిధులు సాధిస్తేనే రోడ్లు పడతాయి. నా పని చేసుకోవడానికి ప్రజలు సహకరించాలి. పర్యటనకు వస్తే నా చుట్టూ మూగి పనికి అడ్డం పడరాదు. ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ఐ టూ లవ్‌యూ. 2019లో నన్ను ఓడించారు. ప్రజల కోసం నేను నిలబడతానా? లేదా? అని పరీక్ష పెట్టారు. నాయకుడికి ఇలాంటి పరీక్షలు పెట్టడం మంచిదే’ అని అన్నారు. పనసభద్ర, పంచాయతీ పరిధిలోని మహిళా సంఘాలకు రూ.4 కోట్ల మేర చెక్కులను ఉపముఖ్యమంత్రి పంపిణీ చేశారు.


గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా..: గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. డోలీమోతకు స్వస్తి పలకడానికి కరడవలసలో కంటైనర్‌ ఆసుపత్రి ఏర్పాటు చేశామన్నారు. గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నామన్నారు. ఫీడర్‌ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయచంద్ర, జయకృష్ణ, జగదీశ్వరి, మాధవి, కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, జేసీ శోభిక, ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ అంకిత మహావీర్‌ సురానా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 03:44 AM