ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Steel Plant: ఉత్తరాంధ్ర సిగలో మరో ఉక్కు!

ABN, Publish Date - Nov 05 , 2024 | 05:17 AM

ఉత్తరాంధ్రకు మరో భారీ ఉక్కు పరిశ్రమ రానుంది. ఇప్పటికే విశాఖ తీరాన ఉన్న దేశంలోనే మొట్ట మొదటి పోర్ట్‌ ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (వైజాగ్‌ స్టీల్‌)కు దీటుగా పక్కనే ఉన్న అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ప్రైవేటు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు.

  • 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 55 వేల ఉద్యోగాలు

  • నక్కపల్లిలో భారీ పరిశ్రమ స్థాపనకు ప్రతిపాదన

  • దిగ్గజ సంస్థలు ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌

  • జాయింట్‌ వెంచర్‌గా ఏర్పాటుకు సుముఖత

  • ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు

  • సీఎం చంద్రబాబుకు చేరిన స్టేటస్‌ రిపోర్టు

  • కేబినెట్‌ ఆమోదం కోసం ప్రతిపాదనలు రెడీ

  • ప్రాజెక్టు కోసం 2,164 ఎకరాలు సిద్ధం

  • విశాఖ స్టీల్‌కు దీటుగా ఏర్పాటుకు ప్రణాళిక

  • అనుబంధంగా కో-టెర్మినస్‌ క్యాప్టివ్‌ పోర్ట్‌

  • మరో 11,199 కోట్ల పెట్టుబడి..

  • 8 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రకు మరో భారీ ఉక్కు పరిశ్రమ రానుంది. ఇప్పటికే విశాఖ తీరాన ఉన్న దేశంలోనే మొట్ట మొదటి పోర్ట్‌ ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (వైజాగ్‌ స్టీల్‌)కు దీటుగా పక్కనే ఉన్న అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ప్రైవేటు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. రెండు దశల్లో మొత్తం రూ.1,50,000 కోట్ల పెట్టుబడులు, 55 వేలమందికి ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంగా భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ ఉక్కు తయారీ సంస్థలుగా పేరున్న ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్టు కింద పోర్టు ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నెలకొల్పడానికి ముందుకు వచ్చాయి. దీనికి సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వంతో పలు దఫాలు సంప్రదింపులు జరిపారు. మంత్రులు నారా లోకేశ్‌, టీజీ భరత్‌, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో విడివిడిగా చర్చలు నిర్వహించారు.

ఈ రెండు సంస్థల నుంచి అందిన ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక (ప్రి ఫీజిబిలిటీ రిపోర్టు) ఆధారంగా ఏపీఐఐసీ అధికారులు అనకాపల్లి జిల్లా కలెక్టరుతో సమన్వయం చేసుకుని అవసరమైన భూసేకరణ కూడా పూర్తి చేశారు. నక్కపల్లి మండలంలోని బుచ్చిరాజుపేటలో 102.18 ఎకరాలు, చందనాడలో 840.20 ఎకరాలు, డీఎల్‌ పురంలో 674.39 ఎకరాలు, రాజయ్యపేటలో 36.62 ఎకరాలు, వేంపాడులో 510.92 ఎకరాలు కలిపి మొత్తం 2,164.31 ఎకరాల భూములను సిద్ధం చేశారు. ఒకే బ్లాక్‌ కింద ఉన్న ఆ భూములు ప్రస్తుతం ఏపీఐఐసీ స్వాధీనంలోనే ఉన్నాయి. ముల్లాపురా (శివారు గ్రామం)ను రీ లొకేషన్‌ చేయడానికి ఆర్‌అండ్‌ఆర్‌ సెటిల్‌మెంట్‌ ప్లాన్‌ పురోగతిలో ఉంది. ఈ ప్రతిపాదిత భారీ ప్రాజెక్టుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్టు ఇప్పటికే సీఎం చంద్రబాబుకు చేరింది. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన వెంటనే రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం కోసం పంపడానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.


ప్రాజెక్టు నేపథ్యమిదీ..

ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ కార్పొరేషన్‌.. ప్రపంచంలోనే దిగ్గజ ఉక్కు తయారీ సంస్థలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. యూర్‌పలోని లక్సెంబర్గ్‌కు చెందిన ఆర్సెలర్‌ మిట్టల్‌, జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్‌ సంస్థలు కలసి జాయింట్‌ వెంచర్‌ను ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయి. ఈ రెండు సంస్థలు కలిసి ‘ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌‘ (ఏఎంఎన్‌ఎ్‌సఐ)గా సరికొత్త బ్రాండ్‌తో భారత్‌లో 20 శాతం ఉక్కు తయారీ సామర్థ్యాన్ని సొంతం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. 2035 నాటికి 40 ఎంఎంపీటీఏ (మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు) ఉక్కును ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. తూర్పు తీరంలో కో-టెర్మినస్‌ పోర్ట్‌ ఆధారిత క్లస్టర్‌తో అతి భారీ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని అన్వేషిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి పడింది. రాష్ట్రంలో ఉన్న విశాల తీరప్రాంతం భారీ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించాయి.

దీనికితోడు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను అమలులోకి తీసుకువచ్చి పెట్టుబడిదారులకు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతుండటం... రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టి ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అవసరమైన భూములు, ఇతర మౌలిక సదుపాయాలు, భారీ ప్రోత్సాహకాలు ప్రకటించడం వాటిని ఆకర్షించాయి. దీంతో రాష్ట్రంలో జాయింట్‌ వెంచర్‌ను ప్రారంభించి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాయి. పోర్ట్‌ ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాయి. అక్కడ అవసరమైన భూములు ఏపీఐఐసీ అధీనంలో ఉండటం... అవి 16వ నంబరు జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండటం... భౌగోళికంగా సువిశాలమైన సముద్ర తీరం, పీఎల్‌ఎంసీ నుంచి నీటి వనరులు అందుబాటులో ఉండటం... చెన్నై గ్రాండ్‌ ట్రంక్‌కు రైలు లింక్‌ అనుసంధానం అయి ఉండటంతో నక్కపల్లి ప్రాంతాన్ని అనువైన ప్రదేశంగా గుర్తించారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో తమ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాయి.


అనుబంధంగా పోర్ట్‌..

ప్రాజెక్టుకు అనుబంధంగా కో-టెర్మినస్‌ క్యాప్టివ్‌ పోర్ట్‌ నిర్మాణం కోసం సముద్ర తీరాన 128 హెక్టార్ల భూమి కావాలని ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ కోరింది. తొలిదశలో 1.5 కిలోమీటర్ల మేర 5 బెర్తులు, రెండో దశలో 3.8 కిలోమీటర్ల పొడవున 12 బెర్తులు నిర్మించనున్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ పోర్టులో మొదటి దశలో 5,816 కోట్లు, రెండో దశలో మరో 5,383 కోట్లు కలిపి మొత్తం రూ.11,199 కోట్ల పెట్టుబడితో 8 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. ఈ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే రాష్ట్ర చరిత్రలోనే భారీ ప్రాజెక్టుగా నిలిచిపోనుంది. ఈ ఉక్కు పరిశ్రమకు అనుబంధంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుతో మరికొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విశాఖపట్నం మాదిరిగానే నక్కపల్లి మండలం కూడా మరో ఉక్కు నగరంగా అభివృద్ధి చెందే అవకాశముందని పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి. 1982లో నెలకొల్పిన విశాఖ ఉక్కు వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది.


2029 జనవరికి మొదటి దశ..

ప్రాజెక్టు మొదటి దశను రూ.70 వేల కోట్ల పెట్టుబడితో 7.3 ఎంఎంఎంపీటీఏ సామర్థ్యంతో 2029 జనవరి నాటికి పూర్తి చేయనున్నట్లు ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. మొదటి దశ పూర్తయితే 20 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. దీనికి 2,200 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వాన్ని కోరింది. మరో రూ.80 వేల కోట్ల పెట్టుబడితో 7.3 నుంచి 24 ఎంఎంపీటీఏ సామర్థ్యంతో 2033 నాటికి రెండో దశ పనులను పూర్తి చేసి ప్రాజెక్టును పూర్తిస్థాయి ఉత్పత్తిలోకి తీసుకువస్తామని ప్రతిపాదనల్లో వివరించింది. రెండో దశ ప్రాజెక్టు పూర్తయితే మరో 35 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. రెండో దశ పనులకు 3,800 ఎకరాల భూములు అవసరమవుతాయని ప్రభుత్వాన్ని కోరింది.

Updated Date - Nov 05 , 2024 | 08:06 AM