CM Revanth reddy: తెలంగాణ ప్రజలకు.. సీఎం రేవంత్ రెడ్డి.. న్యూ ఇయర్ విషెస్..
ABN, Publish Date - Dec 31 , 2023 | 09:21 PM
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ కొత్త ఏడాదిలో ప్రతి గడపలో సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాని తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ కొత్త ఏడాదిలో ప్రతి గడపలో సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాని తెలిపారు. తెలంగాణ ప్రజలందరి సహకారంతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామన్నారు. నిర్బంధాలు, ఇనుప కంచెలు తొలగిపోయాయని చెప్పారు. 6 గ్యారంటీల్లో 2 అమలు చేశామని, కొత్త ఏడాదిలో మిగతా గ్యారంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 2024ను రైతు-మహిళ-యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందాలన్నారు.
రాష్ట్రంలో యువతి భవిష్యత్ తమకు ప్రాధాన్యమని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. యువత భవిష్యత్‌కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ సమూల ప్రక్షాళన చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకూ కట్టుబడి ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. త్వరలో సాగునీటి రంగంలో అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. పింఛన్ల, రేషన్ కార్డుల కోసం లక్షల మంది ఎదురు చూశారని, త్వరలో అందరి కల సాకారం అవుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
న్యూ ఇయర్ విషెస్ తెలియజేసిన డిప్యూటీ సీఎం..
తెలంగాణ ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ 2024లో ప్రతి ఇంటా ఆనందాలు, అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలని ఆకాంక్షించారు. అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా... కాంగ్రెస్ ఇందిరమ్మ పాలన ఉంటుందని పేర్కొన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 09:21 PM